సెంచూరియన్ టెస్టులో పరాజయం పాలైనా పడిలేచిన కెరటంలా దూసుకువచ్చింది దక్షిణాఫ్రికా. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి టీమిండియాపై పైచేయి సాధించింది. సమష్టి కృషితో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. అదే జోష్‌లో వన్డే సిరీస్‌ను కూడా ఇప్పటికే కైవసం చేసుకుంది. తద్వారా భారత జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టింది.
ఈ క్రమంలో నామమాత్రపు మూడో వన్డేకు టీమిండియా సిద్ధమవుతోంది. వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకోవాలని భావిస్తోంది. అయితే, అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికాను ఓడించడం రాహుల్ సేనకు అంత తేలిక కాదంటున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. ఆఖరి వన్డేలోనూ ఆతిథ్య ప్రొటిస్ జట్టుదే విజయం అని జోస్యం చెప్పాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా మూడో వన్డే నేపథ్యంలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
‘‘రాహుల్‌తో ధావన్ ఓపెనింగ్ చేయాలి. కోహ్లి వన్‌డౌన్‌లో .. పంత్ నాలుగో స్థానంలో రావాలి. శ్రేయస్ అయ్యర్ ఐదో ప్లేస్‌లో బరిలో దిగాలి. వెంకటేశ్ ఆరో స్థానంలో రావాలి. బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు సరికాదు. టీమిండియా ఓపెనర్లు... దక్షిణాఫ్రికా ఓపెనర్ల కంటే ఎక్కువ పరుగులు రాబడతారు. కేప్‌టౌన్‌లో మంచి స్కోర్లు నమోదు చేస్తారు. నాకు తెలిసి కోహ్లి ఈ మ్యాచ్‌లో కచ్చితంగా భారీ స్కోరు సాధిస్తాడు.
గత మ్యాచ్‌లో 85 పరుగులు సాధించిన పంత్ కూడా మళ్లీ మెరుస్తాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ జట్టులో స్థానం కోసం ఇంకా ఎదురుచూడాల్సిందే. మరోవైపు.. దక్షిణాఫ్రికా జోరు చూస్తే మాత్రం కచ్చితంగా విజయం వాళ్లనే వరిస్తుందనిపిస్తోంది. వరుస విజయాలతో వారు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. జట్టు సమష్టిగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్ వాళ్లే గెలుస్తారని నేను భావిస్తున్నా’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. కాగా ఆదివారం కేప్‌టౌన్ వేదికగా టీమిండియా- దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి వన్డే జరుగనుంది. దీంతో టీమిండియా సౌతాఫ్రికా టూర్ ముగియనుంది.
చదవండి: Ind Vs Sa 3rd ODI: ధావన్‌కు విశ్రాంతి.. ఓపెనర్‌గా వెంకటేశ్.. భువీ వద్దు.. అతడే కరెక్ట్!
Comments
Please login to add a commentAdd a comment