India tour of West Indies, 2023: అంతర్జాతీయ స్థాయిలో అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం బాదే క్రికెటర్లు కొంతమందే ఉంటారు. ఎంతటి ప్రతిభావంతులైనా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే.. అదీ అదృష్టం కలిసి వస్తేనే ఇలాంటి అరుదైన ఫీట్ అందుకోగలుగుతారు. అలాంటి వాళ్లలో టీమిండియా యువ సంచలనం యశస్వి జైశ్వాల్ కూడా ఒకడు.
డబుల్ సెంచరీ మిస్!
వెస్టిండీస్‌తో తొలి టెస్టు సందర్భంగా ఈ ముంబై బ్యాటర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. డొమినికా వేదికగా ఆడిన మ్యాచ్‌లో 387 బంతులు ఎదుర్కొన్న యశస్వి.. 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 171 పరుగులు సాధించాడు. సెంచరీని డబుల్ సెంచరీగా మార్చే ప్రయత్నంలో అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు.
అనవసరంగా
ఇక ట్రినిడాడ్ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ ఈ యువ ఓపెనర్ సునాయాసంగా శతకం సాధిస్తాడని అనిపించినా.. వైడ్ వెళ్లే బంతిని గెలికి వికెట్ పారేసుకున్నాడు. జేసన్ హోల్డర్ బౌలింగ్‌లో విండీస్ అరంగేట్ర ఆటగాడు కిర్క్ మెకాంజీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అర్ధ శతకం పూర్తి చేసుకుని 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యశస్వి అవుటయ్యాడు.
ఇదే మ్యాచ్‌లో సీనియర్లు.. కెప్టెన్ రోహిత్ శర్మ 80 పరుగులు, విరాట్ కోహ్లి సెంచరీ(121)తో మెరిశారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ యశస్వి జైశ్వాల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘విరాట్ కోహ్లి తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌ను సెంచరీతో సెలబ్రేట్ చేసుకున్నాడు.
ఆ మాత్రం ఓపిక లేకపోతే ఎలా?
క్రీజులో నిలదొక్కుకుని కొన్ని బంతులు ఎదుర్కొన్న తర్వాత పిచ్ ఎలా ఉందో ఓ అవగాహనకు వచ్చిన తర్వాత బ్యాటర్ అతివిశ్వాసం ప్రదర్శించకుండా.. జాగ్రత్తగా ఆడతాడు. అలాంటిది శతకం బాదే అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుంటాడు?
కానీ జైశ్వాల్ మాత్రం సహనం కోల్పోయి.. వైడ్ వెళ్లే బాల్‌ను అనవసరంగా టచ్ చేసి స్లిప్‌లో ఉన్న ఆటగాడికి క్యాచ్ ఇచ్చాడు. కాస్త ఓపిక పడితే బాగుండేది’’ అని సునిల్ గావస్కర్ మిడ్ డేకు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే.. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగులతో గెలిచిన టీమిండియాకు.. వర్షం కారణంగా రెండో టెస్టు డ్రాగా ముగియడం నిరాశను మిగిల్చింది.
సిరీస్ గెలిచినా ఆ లోటు..
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో తొలి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలన్న భారత జట్టు ఆశలపై వరణుడు నీళ్లు చల్లడమేగాక.. కీలక డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత పడేలా చేశాడు. దీంతో విండీస్‌తో టెస్టు సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియాకు సంతృప్తి లేకుండా పోయింది.
చదవండి: ఏడాదికి 50 కోట్ల సంపాదన! మరి.. ధోని సొంత అక్క పరిస్థితి ఎలా ఉందంటే!
Comments
Please login to add a commentAdd a comment