ఇక భారత్ తాడో పేడో తేల్చుకోవాల్సిన పనిలేదు. ఒత్తిడిలో బరిలోకి దిగాల్సిన అవసరం పడదు. ఇంకో మ్యాచ్ మిగిలున్నా... ఈ సిరీస్ ఎక్కడికీ పోదు. ఆఖరి టెస్టు డ్రా చేసుకుంటే చాలు! ఐదు టెస్టుల సిరీస్ కోహ్లి సేనకే ఖాయమవుతుంది. ఈ బాటలోనే టీమిండియా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో విజయబావుటా ఎగరేసింది. ఈ వేదికపై 50 ఏళ్ల తర్వాత భారత టెస్టు నెగ్గడం విశేషం. బుమ్రా పదునెక్కిన పేస్, జడేజా స్పిన్ మ్యాజిక్, శార్దుల్ కీలక వికెట్లు, ఉమేశ్ ఫినిషింగ్ స్పెల్ ఇంగ్లండ్‌పై భారత్‌కు ఘనవిజయాన్ని కట్టబెట్టింది.
లండన్: ఇంగ్లండ్ ముందున్నది కష్టసాధ్యమైన లక్ష్యమే! అయితే సోమవారం ఉదయం 100 పరుగుల దాకా వికెట్ కోల్పోని ఇంగ్లండ్... మరో 110 పరుగులు చేసేసరికే అనూహ్యంగా అలౌటైంది. భారత బౌలర్లు సమష్టిగా శ్రమించారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో... పట్టుసడలని ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌ను దెబ్బతీశారు. దీంతో నాలుగో టెస్టులో భారత్ 157 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచింది. భారత సీమర్ బుమ్రా (22–9–27–2) అసాధారణ ప్రదర్శన చేశాడు. ఇతనికి స్పిన్నర్ జడేజా (2/50) జత కలిశాడు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్ పరుగు చేసేందుకు నాలుగు ఓవర్లు (65, 66, 67, 68) ఆడింది.
కానీ... ఈ లోపే మూడు వికెట్ల (పోప్, బెయిర్‌స్టో, మొయిన్ అలీ)ను కోల్పోయింది. చివరకు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 92.2 ఓవర్లలో 210 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్లు బర్న్స్ (50; 5 ఫోర్లు), హమీద్ (63; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీశాడు. శార్దుల్‌కు 2 వికెట్లు దక్కాయి. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. చివరిసారి 1971లో ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌పై టెస్టులో గెలిచిన భారత్ ఆ తర్వాత ఈ మైదానంలో ఎనిమిది టెస్టులు ఆడి ఐదింటిని ‘డ్రా’ చేసుకొని, మూడింటిలో ఓడింది. ఎట్టకేలకు 50 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో భారత్ మళ్లీ విజయం రుచి చూసింది. ఈనెల 10 నుంచి మాంచెస్టర్‌లో చివరిదైన ఐదో టెస్టు జరుగుతుంది.
శార్దుల్ ఇచి్చన బ్రేక్‌తో...
కఠినమైన 368 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు బర్న్స్, హమీద్ సానుకూల ఆరంభమిచ్చారు. ఓవర్‌నైట్ స్కోరు 77/0తో ఆటకొనసాగించిన ఇంగ్లండ్ నింపాదిగా ఆడుతూ మూడంకెల స్కోరుకు చేరువైంది. శార్దుల్ వేసిన 41వ ఓవర్‌లో బర్న్స్ ఫిఫ్టీ (124 బంతుల్లో; 5 ఫోర్లు) పూర్తి చేసుకున్నాడు. జట్టు వంద పరుగులకు చేరింది. అంతలోనే బర్న్స్ వికెట్ కూడా పడింది. ఇవన్నీ మూడు బంతుల వ్యవధిలోనే జరిగిపోయాయి. తర్వాత జాగ్రత్తగా ఆడుతున్న హమీద్ అర్ధశతకం (123 బంతుల్లో 6 ఫోర్లు) సాధించాడు. అయితే లంచ్‌కుముందే మలాన్ (5) రనౌటయ్యాడు.
విరామం తర్వాత అనూహ్యంగా జడేజా ... హమీద్‌ను బోల్తా కొట్టిస్తే, బుమ్రా తన రివర్స్ స్వింగ్‌తో ఒలీ పోప్ (2), బెయిర్‌స్టో (0)లను పడేశాడు. జడేజా కూడా పోటీ పడి మొయిన్ అలీ (0)ని డకౌట్ చేయడంతో ఇంగ్లండ్ 141/2 నుంచి 147/6 స్కోరుతో పతనం అంచులకు పడిపోయింది. ఈ సిరీస్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ కెపె్టన్ రూట్ (36; 3 ఫోర్లు) ‘డ్రా’తో అయినా జట్టును కాపాడాలనుకున్నా శార్దుల్ ఆ అవకాశం ఇవ్వలేదు. టెయిలెండర్లు వోక్స్ (18), ఒవర్టన్ (10), అండర్సన్ (2)లను ఉమేశ్ కొత్త బంతితో బోల్తాకొట్టించడంతో ఇంగ్లండ్ పతనం పరిపూర్ణమైంది. 35 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఒకే సిరీస్‌లో రెండు టెస్టులు గెలిచింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 191; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290;
భారత్ రెండో ఇన్నింగ్స్: 466; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: బర్న్స్ (సి) పంత్ (బి) శార్దుల్ 50; హమీద్ (బి) జడేజా 63; మలాన్ (రనౌట్) 5; రూట్ (బి) శార్దుల్ 36; ఒలీ పోప్ (బి) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) బుమ్రా 0; మొయిన్ అలీ (సి) సబ్–సూర్యకుమార్ (బి) జడేజా 0; వోక్స్ (సి) రాహుల్ (బి) ఉమేశ్ 18; ఒవర్టన్ (బి) ఉమేశ్ 10; రాబిన్సన్ (నాటౌట్) 10; అండర్సన్ (సి) పంత్ (బి) ఉమేశ్ 2; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (92.2 ఓవర్లలో ఆలౌట్) 210.
వికెట్ల పతనం: 1–100, 2–120, 3–141, 4–146, 5–146, 6–147, 7–182, 8–193, 9–202, 10–210.
బౌలింగ్: ఉమేశ్ 18.2–2–60–3, బుమ్రా 22–9–27–2, జడేజా 30–11–50–2, సిరాజ్ 14–0–44–0, శార్దుల్ 8–1–22–2.
తక్కువ టెస్టుల్లో 100 వికెట్లు తీసిన భారత పేస్ బౌలర్‌గా బుమ్రా గుర్తింపు పొందాడు. బుమ్రా ఈ మైలురాయిని 24 టెస్టుల్లో అందుకున్నాడు. కపిల్ దేవ్ 25 టెస్టుల్లో 100 వికెట్లు తీశాడు. ఇర్ఫాన్ పఠాన్ (28 టెస్టుల్లో) మూడో స్థానంలో ఉన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ (35 సార్లు) నాలుగో స్థానానికి ఎగబాకాడు. తొలి మూడు స్థానాల్లో సచిన్ (76), కోహ్లి (57), గంగూలీ (37) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment