కింగ్ కోహ్లి ఈ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తొలి టెస్టులో మంచి ఇన్నింగ్స్ ఆడిన కేఎల్ రాహుల్ గాయంతో తర్వాత మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. వైఫల్యంతో శ్రేయస్ అయ్యర్‌ను తీసేశారు. ఇక ప్రధాన బ్యాటింగ్ దళానికి కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే పెద్ద దిక్కు. రజత్ పటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్, ఆకాశ్ దీప్... వీళ్లంతా పూర్తిగా కొత్తవాళ్లు!
ఈ సిరీస్‌తోనే అరంగేట్రం చేశారు. 11 మందిలో నలుగురు కొత్తవాళ్లతో... మిగతా అనుభవం లేనివారితో... సంప్రదాయ మ్యాచ్‌లాడి ఇంగ్లండ్‌లాంటి ‘బజ్‌బాల్’ దూకుడు జట్టును ఓడించడం ఆషామాషీ కానేకాదు. కానీ కుర్రాళ్లతో నిండిన టీమిండియా ఆడి గెలిచింది. సిరీస్‌ను సొంతం చేసుకుంది. రోహిత్, కోహ్లి తర్వాత టీమిండియా భవిష్యత్తుకు కొండంత విశ్వాసాన్ని ఈ సిరీస్ ఇచి్చంది.
రాంచీ: ఐదు టెస్టుల సిరీస్‌ను ఆఖరి మ్యాచ్ మిగిలుండగానే భారత్ 3–1తో కైవసం చేసుకుంది. గత మ్యాచ్‌ల్లాగే నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ నాలుగో టెస్టులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 61 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్, కెపె్టన్ రోహిత్ శర్మ (81 బంతుల్లో 55; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (124 బంతుల్లో 52 నాటౌట్; 2 సిక్స్‌లు) అర్ధసెంచరీలతో రాణించారు.
తొలి ఇన్నింగ్స్ టాప్‌స్కోరర్ ధ్రువ్ జురెల్ (77 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు) టెస్టు విజయానికి అవసరమైన పరుగుల్ని అజేయంగా చేసి పెట్టాడు. ఇంగ్లండ్ స్పిన్నర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా, రూట్, హార్ట్‌లీలకు చెరో వికెట్ దక్కింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కీలకమైన పరుగులు చేసిన కొత్త వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
రోహిత్, గిల్ ఫిఫ్టీ–ఫిఫ్టీ
ఈ టెస్టుతో పాటు సిరీస్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉండగా... ఓవర్‌నైట్ స్కోరు 40/0తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాను ఓపెనర్లు రోహిత్, జైస్వాల్ ఒడిదొడుకుల్లేకుండా నడిపించారు. కుదురుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 37; 5 ఫోర్లు)ను జట్టు స్కోరు 84 పరుగుల వద్ద రూట్ బోల్తా కొట్టించాడు. అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక మరో ఓపెనర్ రోహిత్‌ను హార్ట్‌లీ పెవిలియన్ చేర్చాడు. 99/2 వద్ద ఓపెనర్లే అవుటయ్యారు. ఇక్కడిదాకా టీమిండియా మంచి స్థితిలోనే ఉంది. అయితే బషీర్ స్పిన్నేయడంతో రజత్ పటిదార్ (0), జడేజా (4), సర్ఫరాజ్ (0)లు బ్యాట్లెత్తారు.
అప్పుడు భారత్ స్కోరు 120/5. సగం వికెట్లను కోల్పోయింది. ఇక మిగిలిన సగంలో జురెల్ తప్ప అంతా స్పెషలిస్టు బౌలర్లే! లక్ష్యమింకా 72 పరుగుల దూరంలో ఉంది. ఇలాంటి గడ్డు స్థితిలో శుబ్‌మన్, జురెల్ మొండి పోరాటం చేశారు. ఇంగ్లండ్ సారథి స్టోక్స్ వరుసబెట్టి స్పిన్ త్రయం బషీర్, హార్ట్‌లీ, రూట్‌లతోనే బౌలింగ్ వేయించాడు. అయినా ప్రత్యర్థి జట్టుకు పట్టుబిగించే అవకాశమివ్వకుండా... మరో వికెట్ పడకుండా గిల్–జురెల్ జోడీ ఇన్నింగ్స్‌ను నడిపించింది. ఈ క్రమంలో శుబ్‌మన్ ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... టీ విరామానికి ముందే భారత్ విజయతీరాలకు చేరుకుంది. ఇద్దరు అబేధ్యమైన ఆరో వికెట్‌కు 72 పరుగులు జోడించడంతో టెస్టుతోపాటు సిరీస్ కూడా మన జట్టు వశమైంది.
► వరుసగా మూడు టెస్టుల్లో గెలిచి 3–1తో ఐదు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ 64.58 శాతంతో ప్రపంచ టెస్టు చాంపియన్
షిప్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ (75) అగ్రస్థానంలో, ఆ్రస్టేలియా (55) మూడోస్థానంలో ఉన్నాయి.
► ఈ టెస్టూ నాలుగో రోజుల్లో ముగియడం... ధర్మశాలలో ఆఖరి టెస్టు (మార్చి 7 నుంచి)కు 9 రోజుల విరామం ఉండటంతో ఇంగ్లండ్ జట్టు సభ్యులు రెండు వేర్వేరు చోట్ల విశ్రాంతి తీసుకోనున్నారు. కొన్నాళ్లు చండీగఢ్, ఆ తర్వాత బెంగళూరుల్లో స్టోక్స్ బృందం సేద తీరుతుంది. మూడో టెస్టుకు ముందూ ఇలాంటి గ్యాపే ఉండటంతో ఇంగ్లండ్ జట్టు అబుదాబిలో విశ్రాంతి తీసుకొని వచి్చంది.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 353;
భారత్ తొలి ఇన్నింగ్స్: 307;
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 145;
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (సి) ఫోక్స్ (బి) హార్ట్‌లీ 55; యశస్వి (సి) అండర్సన్ (బి) రూట్ 37; శుబ్‌మన్ గిల్ (నాటౌట్) 52; రజత్ పటిదార్ (సి) పోప్ (బి) బషీర్ 0; జడేజా (సి) బెయిర్‌స్టో (బి) బషీర్ 4; సర్ఫరాజ్ (సి) పోప్ (బి) బషీర్ 0; ధ్రువ్ జురెల్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (61 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1–84, 2–99, 3–100, 4–120, 5–120. బౌలింగ్: జో రూట్ 7–0–26–1, హార్ట్‌లీ 25–2–70–1, బషీర్ 26–4–79–3, అండర్సన్ 3–1–12–0.
17: స్వదేశంలో భారత్‌కిది వరుసగా 17వ టెస్టు సిరీస్ విజయం. చివరిసారి టీమిండియా సొంతగడ్డపై 2012లో ఇంగ్లండ్ చేతిలోనే ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment