![India Beat Sri Lanka By 67 Runs 1st ODI 1-0 Lead 3-Match ODI Series - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/11/Virat.jpg.webp?itok=yxD11wIY)
కొత్త ఏడాదిలో ఆడిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు దుమ్మురేపింది. సొంతగడ్డపై ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ టోరీ్నకి భారీ విజయంతో సన్నాహాలు మొదలుపెట్టింది. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణకు తెరదించుతూ కోహ్లి స్వదేశంలో వన్డేల్లో మళ్లీ సెంచరీ కొట్టగా... రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కూడా మెరిశారు. ఫలితంగా శ్రీలంకపై గెలుపుతో ‘వరల్డ్‌కప్ నామ’సంవత్సరానికి టీమిండియా ఘనమైన ఆరంభాన్నిచ్చింది.
గువహటి: ‘టాప్’ఆర్డర్ బ్యాటర్ల వీరవిహారం చేయడంతో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా 67 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించి సిరీస్ లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే రేపు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. మొదట భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 373 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (87 బంతుల్లో 113; 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదంతొక్కాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (67 బంతుల్లో 83; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శుబ్‌మన్ గిల్ (60 బంతుల్లో 70; 11 ఫోర్లు) చెలరేగారు. అనంతరం శ్రీలంక 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ దసున్ షనక (88 బంతుల్లో 108 నాటౌట్; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించాడు. నిసాంక (80 బంతుల్లో 72; 11 ఫోర్లు) రాణించాడు.
అదరగొట్టిన ఓపెనర్లు
విశ్రాంతి తర్వాత ఈ ఏడాదిని ఆరంభించిన కెప్టెన్ రోహిత్ శర్మ మునుపటి ‘హిట్‌మ్యాన్’లా ఆడాడు. గిల్‌తో కలిసి ఇన్నింగ్స్‌కు శుభారంభం అందించాడు. రజిత వేసిన ఏడో ఓవర్లో రోహిత్ 2 సిక్స్ లు, ఒక బౌండరీతో 17 పరుగులు పిండుకున్నాడు. మదుషంక ఓవర్లో ‘హ్యాట్రిక్’ ఫోర్లతో టచ్‌లోకి వచి్చన గిల్ కూడా బాదడం మొదలు పెట్టడంతో లంక బౌలర్లకు కష్టాలు తప్పలేదు. దునిత్ 19వ ఓవర్లో గిల్ 4, 4, 4, 1 కొడితే ఆఖరి బంతిని రోహిత్ సిక్సర్‌గా బాదాడు. 20వ ఓవర్ వేసిన షనక... గిల్‌ను అవుట్ చేసి 143 పరుగుల భాగస్వామ్యానికి తెరదింపాడు.
కోహ్లి కమాల్...
గిల్ అవుటయ్యాక కోహ్లి రాగా... కాసేపటికే రోహిత్‌ని మదుషంక బౌల్డ్ చేశాడు. లంక హమ్మయ్య! అనుకునేలోపే మరో ధాటైన ఇన్నింగ్స్ కు కోహ్లి శ్రీకారం చుట్టాడు. బౌండరీలతో చకచకా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో 47 బంతుల్లో (3 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 52, 81 పరుగుల వద్ద లైఫ్‌లు పొందిన కోహ్లి సెంచరీ దిశగా తనదైన శైలీ షాట్లతో అలరించాడు. 41వ ఓవర్లో భారత్ 300 మార్క్ చేరుకోగా, కోహ్లి 80 బంతుల్లో (10 ఫోర్లు, 1 సిక్స్) తన వన్డే కెరీర్‌లో 45వ సెంచరీ సాధించాడు. 2019 మార్చి 8న ఆ్రస్టేలియాపై రాంచీలో చివరిసారి స్వదేశంలో వన్డేల్లో కోహ్లి సెంచరీ చేశాడు. 49వ ఓవర్లో కోహ్లిని రజిత అవుట్ చేశాడు.
లంకకు పేస్ దెబ్బ
భారత సీమర్లు సిరాజ్, ఉమ్రాన్, షమీల పేస్ బౌలింగ్‌కు శ్రీలంక ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. నిసాంక బాధ్యతగా ఆడినప్పటికీ టాపార్డర్ బ్యాటర్స్ అవిష్క ఫెర్నాండో (5), కుశాల్ మెండిస్ (0)లను సిరాజ్ తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో మిడిలార్డర్ వికెట్లను సీమర్లు కూల్చారు. 206 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకున్న లంకను కెపె్టన్ షనక ఆదుకున్నాడు. షనక టెయిలెండర్ రజిత (9 నాటౌట్)లో కలిసి తొమ్మిదో వికెట్ కు 100 పరుగులు జోడించారు.
భారత్ క్రీడాస్ఫూర్తి
ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన షమీ... సెంచరీకి రెండే పరుగుల దూరంలో ఉన్న షనక (98 వద్ద) మన్కడింగ్ చేశాడు. నిజానికి ఇది అవుటే! కానీ కెప్టెన్ రోహిత్... షమీ దగ్గరకొచ్చి వారించాడు. వెంటనే షమీ అంపైర్‌తో అప్పీల్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో షనక ఐదో బంతికి ఫోర్ కొట్టి సెంచరీ సాధించగలిగాడు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) మదుషంక 83; గిల్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షనక 70; కోహ్లి (సి) మెండిస్ (బి) రజిత 113; అయ్యర్ (సి) ఫెర్నాండో (బి) ధనంజయ 28; కేఎల్ రాహుల్ (బి) రజిత 39; పాండ్యా (సి) హసరంగ (బి) రజిత 14; అక్షర్ (సి) ఫెర్నాండో (బి) కరుణరత్నే 9; షమీ (నాటౌట్) 4; సిరాజ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 373. వికెట్ల పతనం: 1–143, 2–173, 3–213, 4–303, 5–330, 6–362, 7–364. బౌలింగ్: కసున్ రజిత 10–0–88–3, మదుషంక 6–0–43–1, హసరంగ 10–0–67–0, కరుణరత్నే 8–0–54–1, దునిత్ 8–0–65–0, షనక 3–0–22–1, ధనంజయ 5–0–33–1.
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) అక్షర్ (బి) ఉమ్రాన్ 72; ఫెర్నాండో (సి) పాండ్యా (బి) సిరాజ్ 5; మెండిస్ (బి) సిరాజ్ 0; అసలంక (సి) రాహుల్ (బి) ఉమ్రాన్ 23; ధనంజయ (సి) రాహుల్ (బి) షమీ 47; షనక (నాటౌట్) 108; హసరంగ (సి) అయ్యర్ (బి) చహల్ 16; దునిత్ (సి) గిల్ (బి) ఉమ్రాన్ 0; కరుణరత్నే (సి) రోహిత్ (బి) పాండ్యా 14; రజిత (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–19, 2–23, 3–64, 4–136, 5–161, 6–178, 7–179, 8–206. బౌలింగ్: షమీ 9–0–67–1, సిరాజ్ 7–1–30–2, పాండ్యా 6–0–33–1, ఉమ్రాన్ 8–0–57–3, చహల్ 10–0–58–1, అక్షర్ 10–0–58–0.
Comments
Please login to add a commentAdd a comment