టీ20 వరల్డ్‌కప్-2024లో గ్రూపు స్టేజీలో అదరగొట్టిన టీమిండియా.. ఇప్పుడు సూపర్-8 పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన భారత జట్టు గ్రూపు-ఎ నుంచి సూపర్-8కు అర్హత సాధించింది.
సూపర్-8 రౌండ్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ తో భారత్ తలపడనుంది. ఇప్పటికే గ్రూపు-1లో ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్, భారత్ తమ బెర్త్‌లు ఖారారు చేసుకోగా.. మరో బెర్త్ కోసం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్-8లో భారత్ షెడ్యూల్‌ను ఓ సారి పరిశీలిద్దాం.
టీ20 వరల్డ్ కప్ టీమిండియా సూపర్ 8 షెడ్యూల్
జూన్ 20 : భారత్ వర్సెస్ అఫ్గానిస్తాన్, బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్
జూన్ 22: భారత్ వర్సెస్ బంగ్లాదేశ్/నెదర్లాండ్స్, ఆంటిగ్వా
జూన్ 24: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, సెయింట్ లూసియా
అదే విధంగా టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
సూపర్-8లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే?
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) సూపర్ 8, సూపర్ 10, సూపర్ 12 రౌండ్లలో మ్యాచ్‌లను నిర్వహిస్తుంటుంది. అయితే ఈ ఏడాది పొట్టి వరల్డ్‌కప్‌ను సూపర్ 8 రౌండ్‌లో నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది.
12 సంవత్సరాల తర్వాత సూపర్-8 ఫార్మాట్‌ను ఐసీసీ తిరిగి మళ్లీ తీసుకువచ్చింది. చివరిగా 2012 టీ20 వరల్డ్‌కప్ సూపర్ ఎయిట్ ఫార్మాట్‌లో జరిగింది. సూపర్-8 ఫార్మాట్‌లో భారత జట్టు ట్రాక్ రికార్డు చాలా పేలవంగా ఉంది.
ఇప్పటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ సూపర్ 8లో 12 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించగా, ఎనిమిదింట ఓటమి పాలైంది. టీమిండియా విన్నింగ్ శాతం 33.3 శాతంగా ఉండగా.. ఓటమి శాతం 66.67% గా ఉంది.
టీ20 వరల్డ్‌కప్-2007లో సూపర్-8లో మూడు మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అదే విధంగా 2009, 2010 పొట్టి ప్రపంచకప్‌లో సూపర్-8లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా పరాజయం పాలైంది.
ఆ తర్వాత 2012 వరల్డ్‌కప్‌లో రెండింట విజయం సాధించగా, ఒక్క మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. అయితే ఈ నాలుగు వరల్డ్‌కప్‌లలో కూడా భారత జట్టు ఎంఎస్ ధోని నాయకత్వంలోనే బరిలోకి దిగింది. 2007 వరల్డ్‌కప్‌ను ధోని సారథ్యంలోనే టీమిండియా సొంతం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ 12 ఏళ్ల తర్వాత తొలిసారి సూపర్-8 ఫార్మాట్‌లో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment