భారత్–ఆ్రస్టేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు సమంగా ముగిశాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన తర్వాత చివరి మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను 2–1తో ఆ్రస్టేలియా గెలుచుకోగా... ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో టి20 సిరీస్ సాధించిన అనంతరం ఆఖరి మ్యాచ్‌లో ఓడి భారత్ 2–1తో ముగించింది. ఆరు మ్యాచ్‌ల ‘వైట్ బాల్’ సమరంలో రెండు జట్లూ సమఉజ్జీలుగా నిలిచాయి. వేడ్, మ్యాక్స్‌వెల్ అర్ధసెంచరీలకు తోడు స్పిన్నర్ల పొదుపైన ప్రదర్శన ఆ్రస్టేలియాను మూడో టి20లో గెలిపించగా... కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడం భారత్‌ను విజయానికి దూరం చేసింది.
సిడ్నీ: సొంతగడ్డపై టి20 సిరీస్ చేజార్చుకున్న ఆ్రస్టేలియాకు ఊరట విజయం దక్కింది. మంగళవారం జరిగిన మూడో టి20లో ఆసీస్ 12 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (53 బంతుల్లో 80; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మూడో వికెట్‌కు 52 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది. కోహ్లి (61 బంతుల్లో 85; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్వెప్సన్ (3/23) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. హార్దిక్ పాండ్యాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
భారీ భాగస్వామ్యం...
గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చిన కెప్టెన్ ఫించ్ (0) విఫలం కాగా, మరో ఓపెనర్ వేడ్ దూకుడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నాడు. పవర్‌ప్లేలో ఆ్రస్టేలియా 51 పరుగులు చేసింది. వేడ్‌తో కలిసి స్మిత్ (23 బంతుల్లో 24; 1 ఫోర్) రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించినా... వేగంగా ఆడటంలో విఫలమయ్యాడు. మరోవైపు 34 బంతుల్లో వేడ్ వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. స్మిత్ వెనుదిరిగాక వేడ్‌కు మ్యాక్స్‌వెల్ జత కలవడంతో ఆసీస్ స్కోరు జోరు పెరిగింది. చహల్ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో చెలరేగిన మ్యాక్స్‌వెల్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
రాణించిన స్పిన్నర్లు...
ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. తొలి ఓవర్ వేసిన మ్యాక్స్‌వెల్ రెండో బంతికే రాహుల్ (0)ను వెనక్కి పంపించాడు. అయితే శిఖర్ ధావన్ (21 బంతుల్లో 28; 3 ఫోర్లు), కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. అబాట్ ఓవర్లో మూడు ఫోర్లతో వీరిద్దరు 15 పరుగులు రాబట్టారు. రెండో వికెట్‌కు 51 బంతుల్లో 74 పరుగులు జోడించిన తర్వాత స్వెప్సన్ ఈ జోడీని విడదీశాడు. స్పిన్నర్లు స్వెప్సన్, జంపా కట్టడి చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారి చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. ఒక దశలో 39 బంతుల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు! ఒకవైపు 41 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... సామ్సన్ (10), అయ్యర్ (0) విఫలమయ్యారు. కోహ్లి, పాండ్యా (13 బంతుల్లో 20; 1 ఫోర్, 2 సిక్సర్లు) జత కలిసే సమయానికి భారత్ విజయం కోసం 42 బంతుల్లో 87 పరుగులు చేయాల్సి ఉంది. స్యామ్స్ ఓవర్లో కోహ్లి రెండు సిక్సర్లు, పాండ్యా మరో సిక్సర్ కొట్టారు. టై వేసిన తర్వాతి ఓవర్లో కూడా పాండ్యా వరుసగా 4, 6 కొట్టడంతో జట్టు విజయం దిశగా సాగుతున్నట్లు అనిపించింది. 18 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన దశలో పాండ్యాను జంపా అవుట్ చేయగా, స్యామ్స్ పట్టిన చక్కటి క్యాచ్‌తో కోహ్లి వెనుదిరగడంతో భారత జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది.
చెల్లని రివ్యూ...
మూడు సార్లు రివ్యూ కోరినా భారత్‌కు ఫలితం దక్కలేదు. వీటికి తోడు 11వ ఓవర్ నాలుగో బంతికి జరిగిన డ్రామా కోహ్లికి చిరాకు తెప్పించింది. నటరాజన్ వేసిన బంతి వేడ్ (50 వద్ద) ప్యాడ్లను తాకడంతో భారత్ అప్పీల్ చేయగా, అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే భారత్ రివ్యూ కోరే లోపే భారీ స్క్రీన్‌పై రీప్లే కనిపించింది. మూడో అంపైర్ కూడా కోహ్లి రివ్యూ చెల్లదంటూ ప్రకటించాడు. దాంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. టైమర్ లేకపోవడంతో రివ్యూ కోరడంలో భారత్ నిజంగానే ఆలస్యం (15 సెకన్లకు మించి) చేసిందా లేక మూడో అంపైర్ తొందరపడి రీప్లే చూపించాడా అనేదానిపై స్పష్టత రాలేదు. కోహ్లి కూడా రివ్యూ అవసరం లేదన్నట్లుగా బౌండరీ వైపు నడిచి వెళ్లడం, వేడ్ కూడా బ్యాటింగ్‌కు సిద్ధమవడం కనిపించింది. ఇలాంటి తరుణంలో కోహ్లి అనూహ్యంగా రివ్యూ కోరడాన్ని వేడ్ కూడా ప్రశ్నించాడు. చివరకు రీప్లేలో అది స్పష్టంగా ‘అవుట్’గా కనిపించడంతో తాము అన్యాయంగా వికెట్ చేజార్చుకున్నట్లు భారత్ బాధపడాల్సి వచ్చింది. తాను మాత్రం సమయం ముగిసేలోపే రివ్యూ కోరినట్లు మ్యాచ్ తర్వాత కోహ్లి వెల్లడించాడు.
చెత్త ఫీల్డింగ్‌లో పోటీ పడుతూ...
చివరి టి20లో ఇరు జట్ల ఫీల్డింగ్ ప్రదర్శన మరీ నాసిరకంగా కనిపించింది. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ‘లైఫ్’ ఇవ్వడంలో ఆటగాళ్లంతా పోటీ పడ్డారు. మ్యాక్స్‌వెల్ రెండుసార్లు ఇచ్చిన క్యాచ్‌లను చహర్, చహల్ వదిలేయగా, స్మిత్‌ను స్టంపౌట్ చేయడంలో రాహుల్ విఫలమయ్యాడు. ఇక కోహ్లి ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను (9 పరుగుల వద్ద) డీప్ మిడ్‌వికెట్‌లో స్మిత్ వదిలేశాడు. 19 పరుగుల వద్ద టై కూడా కోహ్లి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను పట్టలేకపో యాడు. మ్యాక్స్‌వెల్ 18 పరుగుల వద్ద ఉన్నప్పుడు చహల్ బౌలింగ్‌లో రాహుల్ చక్కటి క్యాచ్ పట్టినా... అది నోబాల్‌గా తేలింది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వేడ్ (ఎల్బీ) (బి) శార్దు ల్ 80; ఫించ్ (సి) పాండ్యా (బి) సుందర్ 0; స్మిత్ (బి) సుందర్ 24; మ్యాక్స్‌వెల్ (బి) నటరాజన్ 54; హెన్రిక్స్ (నాటౌట్) 5; షార్ట్ (రనౌట్) 7; స్యామ్స్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186. వికెట్ల పతనం: 1–14; 2–79; 3–169; 4–175; 5–182. బౌలింగ్: చహర్ 4–0 –34– 0; సుందర్ 4–0–34–2; నటరాజన్ 4–0– 33 –1; చహల్ 4–0–41–0; శార్దుల్ 4–0–43–1.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (సి) స్మిత్ (బి) మ్యాక్స్‌వెల్ 0; ధావన్ (సి) స్యామ్స్ (బి) స్వెప్సన్ 28; కోహ్లి (సి) స్యామ్స్ (బి) టై 85; సామ్సన్ (సి) స్మిత్ (బి) స్వెప్సన్ 10; అయ్యర్ (ఎల్బీ) (బి) స్వెప్సన్ 0; పాండ్యా (సి) ఫించ్ (బి) జంపా 20; సుందర్ (సి) టై (బి) అబాట్ 7; శార్దుల్ (నాటౌట్) 17; చహర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–0; 2–74; 3–97; 4–100; 5–144; 6–151; 7–164. బౌలింగ్: మ్యాక్స్‌వెల్ 3–0–20–1; అబాట్ 4–0–49–1; స్యామ్స్ 2–0–29–0; టై 4–0–31–1; స్వెప్సన్ 4–0–23–3; జంపా 3–0–21–1.
Comments
Please login to add a commentAdd a comment