పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ వచ్చిన టీమిండియా టి20 సిరీస్‌ను మాత్రం ఇక కోల్పోదు. ఎందుకంటే వర్షంతో ఒకటి రద్దు కాగా... రెండో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ధనాధన్ సెంచరీతో భారత్ జయభేరి మోగించింది. దీంతో ఆతిథ్య సీమర్ టిమ్ సౌతీ ‘హ్యాట్రిక్’ ప్రదర్శన చిన్నబోయింది. ఒకవేళ రేపు ఆఖరి పోరులో ఓడినా సిరీస్ సమం అవుతుందే తప్ప చేజారే ప్రసక్తే లేదు.
మౌంట్ మాంగనుయ్: సూర్యకుమార్ యాదవ్ ఆట న్యూజిలాండ్ గడ్డపైనా చుక్కలను అందుకుంది. ఆతిథ్య బౌలింగ్‌ను తుత్తునియలు చేసింది. దీంతో రెండో టి20 మ్యాచ్‌లో భారత్ 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్య (51 బంతుల్లో 111 నాటౌట్; 11 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సౌతీ 3, ఫెర్గూసన్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారీలక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన న్యూజిలాండ్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. కేన్ విలియమ్సన్ (52 బంతుల్లో 61; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటం చేశాడు. దీపక్ హుడా (2.5–0–10–4) అద్భుతమైన స్పెల్‌తో కివీస్‌ను కూల్చేశాడు. హైదరాబాద్ సీమర్ సిరాజ్ 2 కీలక వికెట్లు తీశాడు. రేపు నేపియర్‌లో ఆఖరి టి20 మ్యాచ్ జరుగుతుంది.
49 బంతుల్లోనే సూర్య సెంచరీ
సూర్యకుమార్ 51 బంతుల్లో చేసింది 111 పరుగులు... ఎక్స్‌ట్రాలు 11. కలిపితే 122 పరుగులు! సూర్య ఆడగా మిగిలిన బంతులు 69... వచ్చిన పరుగులు కూడా 69! క్రీజులోకి వచ్చిన మిగతా 7 మంది బ్యాటర్లు చేశారు. అంటే ఈ పాటికే సూర్య ఒక్కడి విధ్వంసం ఎలా సాగిందో అందరికీ అర్థమై ఉంటుంది. రిషభ్ పంత్ (6) ఓపెనింగ్ కుదర్లేదు. ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) మిగతా ఆరుగురిలో మెరుగ్గా ఆడాడు.
తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ (13), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13)లవి తక్కువ స్కోర్లే! అయితే అవతలి వైపు సూర్య వీరవిహారంతోనే భారత్ భారీస్కోరు చేయగలిగింది. ఆరో ఓవర్లో మొదలైన అతని ఆటను ఆరంభంలో వాన అడ్డుకుంది కానీ... ఆ తర్వాత ఏ బౌలర్ ఆపతరం కాలేదు. 17, 18, 19వ ఓవర్లయితే సూర్య విధ్వంసం దశను దాటి సునామీలా మారింది. సౌతీ 17వ ఓవర్లో సిక్స్ 2 ఫోర్లతో 17 పరుగులు పిండాడు. 18వ ఓవర్లో మిల్నేకు 2 భారీ సిక్సర్లతో చుక్కలు చూపాడు. 18 పరుగులొచ్చాయి.
ఫెర్గూసన్ 19వ ఓవర్లో 4, 0, 4, 4, 4, 6లతో 22 పరుగులు సాధించాడు. దీంతో ఈ మూడు ఓవర్లలోనే 57 పరుగులు వచ్చాయి. సూర్య సునామీతో సౌతీ ఆఖరి ఓవర్లో వరుస బంతుల్లో హార్దిక్, హుడా (0), వాషింగ్టన్ సుందర్ (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ వికెట్లు తీసినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. తొలి ఫిఫ్టీని 32 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన సూర్యకుమార్ శతకాన్ని 49 బంతుల్లో (10 ఫోర్లు, 6 సిక్సర్లు) పూర్తి చేశాడు. అంటే కేవలం 17 బంతుల్లో రెండో ఫిఫ్టీ సాధించాడు.
విలియమ్సన్ ఒంటరి పోరాటం
తర్వాత ఆతిథ్య న్యూజిలాండ్ లక్ష్యఛేదన పేలవంగా మొదలైంది. స్పిన్‌తో ముగిసింది. ఓపెనర్లలో ఫిన్ అలెన్ (0) డకౌట్ కాగా, కాన్వే (22 బంతుల్లో 25; 3 ఫోర్లు) కాసేపే నిలిచాడు. చహల్, హుడా స్పిన్ ఉచ్చులో ఫిలిప్స్ (12), మిచెల్ (10), నీషమ్ (0) పడ్డారు.
అయితే కుదురుగా ఆడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టు స్కోరును 100 పరుగులు దాటించి పరువు నిలిపాడు. విలియమ్సన్ 48 బంతుల్లో (3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 19వ ఓవర్ వేసిన దీపక్ హుడా... మూడు వికెట్లు తీయడంతో కివీస్ ఆట 7 బంతుల ముందే ముగిసింది. అతను ఇష్ సోధి (1), సౌతీ (0), మిల్నే (6)లను పెవిలియన్ చేర్చడంతో కివీస్ ఆలౌటైంది.
చదవండి: క్రెడిట్ వాళ్లకి ఇవ్వాలి... మాకు బౌలింగ్ చేసే బ్యాటర్లు కావాలి: హార్దిక్
Comments
Please login to add a commentAdd a comment