టి20 ఫార్మాట్‌లో అమేయ శక్తిగా భారత్
సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లు
దిగ్గజాల స్థానాన్ని భర్తీ చేస్తున్న కుర్రాళ్లు
ఈ ఏడాది టి20ల్లో టీమిండియా జైత్రయాత్ర
ఆడిన 26 మ్యాచ్‌ల్లో 24 విజయాలు
ప్రపంచకప్‌తోపాటు ఐదు సిరీస్‌లు సొంతం
ప్రపంచ క్రికెట్‌లో ఏ జట్టయినా మేటి ఆటగాళ్ల నిష్క్రమణతో డీలా పడటం సహజమే! టీమిండియా విషయంలో మాత్రం అందుకు భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ ఫార్మాట్‌లోనైనా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి ప్లేయర్లు ఆటకు వీడ్కోలు పలికితే వారి స్థానాలను భర్తీ చేయడం అంత సులువు కాదు. ఈ ఏడాది ఐసీసీ టి20 ప్రపంచకప్ నెగ్గిన అనంతరం ఈ ముగ్గురు పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా... దిగ్గజాలను మైమరిపించేందుకు మేమున్నామంటూ యువతరం దూసుకొస్తోంది!
సంజూ సామ్సన్ సుదీర్ఘ కెరీర్‌ను గాడిన పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే... అడిగి మరీ బరిలోకి దిగిన మూడో స్థానంలో తానే సరైన వాడినని హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ నిరూపించుకున్నాడు. సూర్యకుమార్ తన సారథ్యంతో సత్తా చాటుతుంటే... హార్దిక్ పాండ్యా అసలు సిసలు ఆల్‌రౌండర్‌గా తనని తాను ఆవిష్కరించుకుంటున్నాడు. ‘ఛోటా పటాకా... బడా ధమాకా’ మాదిరిగా అభిõÙక్ శర్మ చెలరేగుతుంటే... ‘నయా ఫినిషర్’ తానే అని రింకూ సింగ్ నిరూపించుకుంటున్నాడు.
టి20ల్లో ప్రమాదకర బౌలర్‌గా అర్‡్షదీప్ సింగ్ పరిణతి సాధిస్తే... వరుణ్, రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో వైవిధ్యంతో కట్టిపడేస్తున్నారు. వీరంత సమష్టిగా కదం తొక్కుతుండటంతో భారత జట్టు ఈ ఏడాది టి20ల్లో జైత్రయాత్ర సాగించింది. ఆడిన 26 మ్యాచ్‌ల్లో 24 విజయాలతో అదరగొట్టిన నేపథ్యంలో ప్రత్యేక కథనం. –సాక్షి క్రీడా విభాగం
టి20 ఫార్మాట్‌లో నిర్వహించిన తొలి ప్రపంచకప్ (2007) గెలిచిన తర్వాత... మరోసారి వరల్డ్ కప్ ట్రోఫీ ముద్దాడేందుకు సుదీర్ఘ కాలం నిరీక్షించిన టీమిండియా... ఈ ఏడాది రెండోసారి జగజ్జేతగా నిలిచింది. చాన్నాళ్లుగా ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న భారత జట్టు ఆ కల నెరవేర్చుకోవడంతో పాటు... అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొట్టింది. వరల్డ్‌కప్‌లో ఒక్క మ్యాచ్ ఓడకుండా కప్ కైవసం చేసుకున్న టీమిండియా... మరో ఐదు సిరీస్‌లు సైతం చేజిక్కించుకుంది.
అఫ్గానిస్తాన్‌పై 3–0తో, జింబాబ్వేపై 4–1తో, శ్రీలంకపై 3–0తో, బంగ్లాదేశ్‌పై 3–0తో, దక్షిణాఫ్రికాపై 3–1తో సిరీస్‌లు హస్తగతం చేసుకుంది. ఇందులో అఫ్గానిస్తాన్‌తో సిరీస్ తర్వాత టి20 వరల్డ్‌కప్ జరగ్గా... ఆ తర్వాత నుంచి సీనియర్ ప్లేయర్లు లేకుండా యువ ఆటగాళ్లతోనే టీమిండియా అద్భుతాలు చేసింది. కోహ్లి, రోహిత్, జడేజా వంటి సీనియర్లు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం... మిగిలిన కీలక ఆటగాళ్లు కూడా అన్ని సిరీస్‌లకు అందుబాటులే లేకపోవడం ఇలాంటి ఎన్నో ప్రతికూలతల మధ్య కూడా యువ ఆటగాళ్లు సత్తా చాటారు.
భవిష్యత్తుపై భరోసా ఇస్తూ... బాధ్యత తీసుకునేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చారు. ఫలితంగా ఈ ఏడాది ఆడిన 26 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌ల్లో భారత్ 24 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అందులో రెండు ‘సూపర్ ఓవర్’ విజయాలు కూడా ఉన్నాయి. ఓడిన రెండింట్లో ఒకటి వరల్డ్‌కప్ నెగ్గిన వారం రోజుల తర్వాత సరిగ్గా కుదురుకోకుండానే జింబాబ్వేతో ఆడిన మ్యాచ్ ఒకటి అయితే... తాజాగా దక్షిణాఫ్రికా సిరీస్‌లో చివరి వరకు పోరాడి ఓడిన రెండో టి20 మరొకటి.
ఈ రెండు మినహా మిగిలిన మ్యాచ్‌లు చూసుకుంటే మన జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. ఓవరాల్‌గా విజయాల శాతాన్ని పరిశీలిస్తే... భారత్ 92.31 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. 2018లో పాకిస్తాన్ 19 మ్యాచ్‌లాడి 17 గెలిచి 89.47 శాతంతో రెండో స్థానంలో ఉంది.
ప్రతి 12 బంతులకో సిక్స్...
టీమిండియా జైత్రయాత్ర వెనక యువ ఆటగాళ్ల దూకుడు ఉందనేది వాస్తవం. ఈ ఏడాది గణాంకాలు చూస్తే... భారత జట్టు సగటున ప్రతి 12 బంతులకో సిక్స్ బాదింది. జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోవాలనుకునే ప్రతి ఆటగాడు తమకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని చెలరేగుతుండటం వల్లే ఇది సాధ్యమైంది.
ముఖ్యంగా ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన తిలక్ వర్మ, అభిõÙక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, రింకూ సింగ్ వంటి హిట్టర్ల వల్ల జట్టు బ్యాటింగ్ శైలి మారిపోయింది. గతంలో కుదురుకున్నాక భారీ షాట్లు ఆడాలనే ధోరణి ఎక్కువగా కనిపించే టీమిండియాలో... ఇప్పుడు బాదుడే పరమావధి అనేది స్పష్టమవుతోంది. దక్షిణాఫ్రికాతో సిరీస్ సందర్భంగా వన్‌డౌన్‌లో అవకాశం దక్కించుకున్న తిలక్ వర్మకు... టీమిండియా తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా ఇదే నూరిపోసానని వెల్లడించాడు.
‘వికెట్ పడ్డా ఫర్వాలేదు. దూకుడు మాత్రం తగ్గించొద్దు. సహజసిద్ధమైన షాట్లు ఆడితేనే మెరుగైన ఫలితాలు వస్తాయి’అని లక్ష్మణ్ తనకు చెప్పినట్లు తిలక్ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ఈ ఏడాది 4.68 బంతులకో బౌండరీ (ఫోర్, సిక్స్) కొట్టిన భారత జట్టు ఈ జాబితాలో ఆస్ట్రేలియా (4.39) తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
ఏడు సెంచరీలు..
2024 క్యాలెండర్ ఏడాదిలో భారత ఆటగాళ్లు ఒక్క టి20 ఫార్మాట్‌లోనే ఏడు సెంచరీలు బాదారు. సంజూ సామ్సన్, తిలక్ వర్మ తాజా సిరీస్‌లోనే చెరో రెండు సెంచరీలు బాదగా... అంతకుముందు సామ్సన్ హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై మరో శతకం సాధించాడు. రోహిత్ శర్మ, అభిషేక్ శర్మ కూడా ఒక్కోసారి మూడంకెల స్కోరు అందుకున్నారు. ఒక ఏడాదిలో టి20ల్లో ఒక జట్టు ప్లేయర్లు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే కావడం విశేషం.
సెంచరీ నమోదైన ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా 200 పైచిలుకు పరుగులు చేసింది. మొత్తంగా 2024లో తొమ్మిది సార్లు భారత జట్టు 200+ స్కోర్లు నమోదు చేసింది. ప్రపంచంలో మరే జట్టు ఏడు సార్లకు మించి ఈ ఫీట్ అందుకోలేదు. ఈ క్రమంలో టీమిండియా 9.55 రన్‌రేట్‌తో పరుగులు రాబట్టింది. ఇది ఆ్రస్టేలియా (9.87) తర్వాత రెండో అత్యధికం. కేవలం బ్యాటింగ్‌లోనే మెరుపులు మెరిపిస్తే ఈ స్థాయి జైత్రయాత్ర సాధ్యమయ్యేది కాదు!
బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారం కూడా తోడవడంతోనే ఈ నిలకడ సాధ్యమైంది. ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌లో భారత జట్టు పదిసార్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది. సగటున ప్రతి మ్యాచ్‌లో టీమిండియా 8.39 వికెట్లు పడగొట్టింది. 2023 వరకు టీమిండియా కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే ప్రత్యర్థిపై 100 పరుగుల తేడాతో విజయం సాధించగా... ఈ ఒక్క ఏడాదే మూడు సార్లు ఆ ఫీట్ నమోదు చేయడం కొసమెరుపు!
ఫ్యూచర్ స్టార్స్
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇప్పటికే నిరూపించుకోగా... ఇప్పుడు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో డకౌట్ అయిన తిలక్ వర్మ... ఈసారి సఫారీ టూర్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డు గెలుచుకున్నాడు. నాలుక మడతేసి కొడితే బంతి బౌండరీ దాటాల్సిందే అన్న తరహాలో... దక్షిణాఫ్రికాలో విధ్వంస రచన చేసిన తిలక్‌పై సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో మాదిరిగా కాకుండా ఒకే బంతికి భిన్నమైన షాట్లు ఎలా ఆడొచ్చో తిలక్ చివరి మ్యాచ్‌లో నిరూపించాడు. జాన్సన్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ చివరి బంతికి తిలక్ డీప్ మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన సిక్సర్ చూస్తే అతడు ఎంత పరిణతి సాధించాడో ఇట్టే చెప్పేయోచ్చు. గతంలో సంప్రదాయ షాట్లతోనే పరుగులు రాబట్టేందుకు ఎక్కువ ప్రయత్నించిన తిలక్... తాను కూడా వికెట్‌కు నాలుగు వైపులా పరుగుల వరద పారించగలనని నిరూపించుకున్నాడు.
మ్యాచ్ అనంతరం కెప్టెన్ , కోచ్ మాటలను బట్టి చూస్తే... తిలక్ మూడో స్థానంలో కుదురుకున్నట్లే అనిపిస్తోంది. ఇప్పటి వరకు 20 టి20లు ఆడిన తిలక్ వర్మ రెండు సెంచరీలు, రెండు హాఫ్‌సెంచరీలతో 51.33 సగటుతో 616 పరుగులు సాధించాడు. ఇన్నాళ్లు కోహ్లి ఆడిన మూడో స్థానంలో నిలకడ కొనసాగించగలిగితే 22 ఏళ్ల తిలక్‌కు మంచి భవిష్యత్తు ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment