భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్‌ ఉతప్ప | India squad for Hong Kong sixes announced, Robin Uthappa to lead | Sakshi
Sakshi News home page

భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రాబిన్‌ ఉతప్ప

Published Sat, Oct 12 2024 11:05 AM | Last Updated on Sat, Oct 12 2024 11:28 AM

India squad for Hong Kong sixes announced, Robin Uthappa to lead

హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ మళ్లీ అభిమానులను అలరించేందుకు సిద్దమైంది.  సుమారు ఏడేళ్ల తర్వాత ఈ టోర్నీని మళ్లీ నిర్వహించనున్నారు. నవంబర్ 1 నుండి 3 వరకు టిన్ క్వాంగ్ రోడ్ రిక్రియేషన్ గ్రౌండ్‌లో జరగనుంది. 2024 హాంకాంగ్ సిక్సెస్ ఈవెంట్‌లో మొత్తం 12 జట్లు పాల్గొననున్నాయి. 

ఆస్ట్రేలియా, భారత్‌, పాకిస్తాన్‌, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, హాంకాంగ్, నేపాల్, ఒమన్, యూఏఈ జట్లు భాగం కానున్నాయి.  తాజాగా ఈ టోర్నీ కోసం ఏడుగురు సభ్యులతో కూడా భారత జట్టును ప్రకటించారు. 

ఈ జట్టుకు టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అతడితో పాటు మాజీలు  కేదార్ జాదవ్, మనోజ్ తివారీ, షాబాజ్‌ నదీమ్, శ్రీవత్సవ గోస్వామి, స్టువర్ట్ బిన్నీ, భరత్ చిప్లీలకు చోటు దక్కింది.

అసలేంటి హాంకాంగ్ సిక్సెస్‌?
1992లో హాంకాంగ్ క్రికెట్ ఆధ్వ‌ర్యంలో మొద‌లైన హాంకాంగ్ సిక్సెస్ టోర్నీ.. చివ‌ర‌గా 2017 వ‌ర‌కు జ‌రిగింది. ఆ త‌ర్వాత కొన్ని కార‌ణాల‌తో ఈ టోర్నీని నిర్వ‌హించ‌లేదు.  అయితే ఈ ఈవెంట్‌కు మ‌ళ్లీ  పూర్వ వైభవాన్ని తీసుకువ‌చ్చేందుకు హాంకాంగ్ క్రికెట్ ముందుకు వ‌చ్చింది. 

ద‌క్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జ‌ట్లు అత్య‌ధికంగా 5 సార్లు ఈ టోర్నమెంట్ విజేత‌ల‌గా నిల‌వ‌గా.. పాకిస్తాన్ 4 సార్లు ఈ హాంకాంగ్ సిక్సెస్ ట్రోఫీని ముద్దాడింది. భార‌త్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక‌, విండీస్ జ‌ట్లు చెరో ఒక్క‌సారి ఛాంపియ‌న్స్‌గా నిలిచాయి.  గతంలో ఈ టోర్నీలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అనిల్ కుంబ్లే వంటి దిగ్గ‌జ క్రికెట‌ర్లు సైతం ఆడారు.

రూల్స్ ఇవే..
ఒక మ్యాచ్‌లో ప్ర‌తీ జ‌ట్టు 5 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడుతోంది. మ్యాచ్ ఆడే రెండు జ‌ట్ల‌లో ఆరుగురు ఆట‌గాళ్లు ఉండాలి. గ్రూప్ దశలో ఒక్కో ఓవర్‌కు  ఆరు బంతులు ఉంటాయి. అదే ఫైనల్‍లో ఒక్కో ఓవర్లో ఎనిమిది బంతులు ఉంటాయి. . వికెట్ కీపర్ మినహా జట్టులోని ప్రతి ఒక్కరు ఒక్కో ఓవర్ వేయాల్సి ఉంటుంది. 

ఒక్కో వైడ్, నోబాల్‍కు రెండు పరుగులు వస్తాయి. ఒక వేళ ఐదు వికెట్లు పడితే ఇన్నింగ్స్‌ను ముగిసిన‌ట్లు కాదు. వ‌న్ సైడ్ బ్యాట‌ర్ కూడా బ్యాటింగ్ చేయ‌వ‌చ్చు. అదేవిధంగా 31 పరుగులు చేసిన బ్యాటర్ రిటైర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆఖ‌రిలో బ్యాటింగ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంటుంది.
చదవండి: LLC 2024: క్రిస్ గేల్ ఊచ‌కోత‌.. ధావ‌న్ మెరుపులు (వీడియో)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement