బుధవారం ఉదయం జింఖానాలో మ్యాచ్ టికెట్ల కోసం వచ్చిన అభిమానులు
సాక్షి, హైదరాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో జరిగే చివరి టి20 మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ‘ఆఫ్‌లైన్’లో అమ్మకానికి ఉంచింది. ఈ నెల 15న స్వల్ప సంఖ్యలో టికెట్లను ‘పేటీఎం ఇన్‌సైడర్’ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో హెచ్‌సీఏ అందుబాటులోకి తీసుకురాగా, కొద్ది సేపటిలోనే అవి పూర్తిగా అమ్ముడుపోయాయి. దాంతో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ నిరాశ చెందారు.
ఈ నేపథ్యంలో అభిమానుల విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుంటూ ‘పేటీఎం ఇన్‌సైడర్’తో చర్చలు జరిపిన హెచ్‌సీఏ టికెట్లను నేరుగా కౌంటర్‌లో అమ్మాలని నిర్ణయించింది. నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో టికెట్ కౌంటర్ ఉంటుంది. ఒక వ్యక్తికి గరిష్టంగా రెండు టికెట్లు మాత్రమే ఇస్తారు. టికెట్లు కొనుగోలు చేసేందుకు వచ్చే అభిమానులు ఆధార్ కార్డు తీసుకురావాలి. అయితే టికెట్ల మొత్తం సంఖ్యతో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో వేర్వేరుగా ఎన్ని టికెట్లు అందుబాటులో ఉంటాయనే విషయంలో మాత్రం హెచ్‌సీఏ ఎలాంటి స్పష్టతనివ్వలేదు.
బ్లాక్‌లో అమ్మితే చర్యలు: క్రీడా మంత్రి
భారత్, ఆస్ట్రేలియా టి20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి చోటు చేసుకుంటున్న గందరగోళంపై తెలంగాణ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ‘క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తేనే హెచ్‌సీఏ స్టేడియం కట్టుకుంది. ఇది తెలంగాణ ప్రజల కోట్ల విలువైన ఆస్తి. అలాంటప్పుడు రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదు. అభిమానుల ఉత్సాహాన్ని దెబ్బ తీయవద్దు.
బ్లాక్‌లో టికెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్‌సీఏను హెచ్చరించాం. దీనిపై అవసరమైతే విచారణ కూడా జరిపిస్తాం. అదే విధంగా బయటి వ్యక్తులు కూడా ఎవరైనా తనకు టికెట్లు కావాలంటూ బెదిరించినా చర్య తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు. గుజరాత్‌లో జరిగే జాతీయ క్రీడల్లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందానికి క్రీడా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ బుధవారం కిట్‌లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డితో పాటు ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 29 నుంచి అక్టోబర్ 12 వరకు జరిగే జాతీయ క్రీడల్లో తెలంగాణ నుంచి 230 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment