ఒక్క కిక్‌తో ఇషాం‍త్‌ను నిద్రలేపాను: కోహ్లి | India Vs England Ahead 3rd Test Kohli On Ishant Sharma To Play 100 Test | Sakshi
Sakshi News home page

అప్పుడు ఇషాంత్‌ నిద్రపోతున్నాడు: కోహ్లి

Published Tue, Feb 23 2021 4:25 PM | Last Updated on Tue, Feb 23 2021 4:49 PM

India Vs England Ahead 3rd Test Kohli On Ishant Sharma To Play 100 Test - Sakshi

తను భారత జట్టుకు ఎంపికైన న్యూస్‌ వస్తున్న సమయంలో ఇషాంత్‌ నిద్రపోతున్నాడు. అప్పుడు నేను తన పక్కనే ఉన్నాను.

న్యూఢిల్లీ: ఇషాంత్‌ శర్మ 100వ టెస్టు మ్యాచ్‌ ఆడనుండటం పట్ల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి హర్షం వ్యక్తం చేశాడు. సంప్రదాయ క్రికెట్‌ ఆడేందుకు ప్రాధాన్యమిచ్చి, కెరీర్‌లో అరుదైన మైలురాయి చేరుకోవడం సంతోషకరమన్నాడు. సమకాలీన పరిస్థితుల్లో ఒక పేసర్‌గా సుదీర్ఘ కాలం కొనసాగటం అందరికీ సాధ్యంకాదని, ఆ క్రెడిట్‌ ఇషాంత్‌కు దక్కుతుందంటూ ప్రశంసలు కురిపించాడు. కాగా భారత దిగ్గజ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ (131 టెస్టులు) తర్వాత వంద మ్యాచ్‌లు ఆడనున్న టీమిండియా ఫాస్ట్‌బౌలర్‌గా ‘లంబూ’ చరిత్రకెక్కనున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని  మొతేరా స్టేడియంలో ఇంగ్లండ్‌తో బుధవారం జరుగనున్న పింక్‌బాల్‌ టెస్టులో ఈ ఘనత అందుకోనున్నాడు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన కోహ్లి, ఇషాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు. ‘‘ఇద్దరం కలిసే రాష్ట్రస్థాయి(ఢిల్లీ) క్రికెట్‌ ఆడాం. తను భారత జట్టుకు ఎంపికైన న్యూస్‌ వస్తున్న సమయంలో ఇషాంత్‌ నిద్రపోతున్నాడు. అప్పుడు నేను తన పక్కనే ఉన్నాను. ఒక్క కిక్‌తో నిద్రలేపి, ఆ శుభవార్తను తనకు తెలియజేశాను. అంత క్లోజ్‌గా ఉండేవాళ్లం. పరస్పర నమ్మకం కలిగి ఉండేవాళ్లం. ఇన్నేళ్లుగా బౌలింగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ టెస్టు క్రికెట్‌ ఆడుతున్న ఇషాంత్‌, వందో టెస్టు ఆడనుండటం సంతోషంగా ఉంది.

ఒక పేసర్‌గా సుదీర్ఘ కెరీర్‌ కొనసాగించడం అరుదైన విషయం. దానిని ఇషాంత్‌ సాధ్యం చేసి చూపించాడు. అందుకు తనను అభినందించి తీరాల్సిందే. మరికొన్నేళ్ల పాటు అతడు టెస్టు క్రికెట్‌ ఆడుతూనే ఉండాలి’’ అని ఆకాంక్షించాడు. కాగా దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ఆడుతున్న ఇషాంత్‌, టీమిండియా తరఫున 2016లో చివరి వన్డే, 2013లో ఆఖరిసారిగా టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇక చెన్నైలో ఇటీవల జరిగిన తొలి టెస్టులో భాగంగా ఇషాంత్‌ శర్మ  టెస్టుల్లో 300 వికెట్లు తీసిన ఆరో భారత బౌలర్, మూడో పేసర్‌‌గా రికార్డు సృష్టించాడు.
చదవండిఇషాంత్‌ శర్మ ‘శతకం’.. స్పెషల్‌ స్టోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement