స్వదేశంలో వన్డేల్లో ఎంత స్కోరు చేస్తే భారత జట్టు సురక్షితంగా ఉండవచ్చు? ఇంగ్లండ్ లాంటి మేటి జట్టు ముందు 336 పరుగుల స్కోరు కూడా సరిపోదని రెండో వన్డేలోనే అర్థమైంది. బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా భారీ స్కోరు చేస్తే... ప్రపంచ చాంపియన్ జట్టు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడి దానిని అలవోకగా ఛేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి పరుగుల పండగకు భారత్, ఇంగ్లండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గత మ్యాచ్ అనుభవంతో వ్యూహం మార్చి విజయాన్ని అందుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ఈ పర్యటనలో చివరి మ్యాచ్‌లో నెగ్గి ఒక్క ఫార్మాట్‌లోనైనా విజేతగా వెనుదిరగాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది.
పుణే: భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటన చివరి ఘట్టానికి చేరింది. టెస్టు, టి20 సిరీస్‌ల తర్వాత వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మూడో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా ... ఈ పోరుతో అంతిమ విజయం ఎవరిదో తేల నుంది. గత మ్యాచ్ అందించిన ఫలితంతో ఇంగ్లండ్ జట్టులో ఉత్సాహం పెరగ్గా... భారత్ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేయాల్సిన స్థితిలో నిలిచింది.
చహల్‌కు చాన్స్!
336 పరుగులు సాధించిన జట్టులో బ్యాటింగ్ లోపాల గురించి చెప్పడానికేమీ ఉండదు. అయితే తుది ఫలితం చూస్తే భారత జట్టు మరిన్ని పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయిందని అనిపించింది. మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదిగా ఆడటం కూడా ఇందుకు కారణం. ముఖ్యంగా మొయిన్ అలీలాంటి సాధారణ స్పిన్నర్ బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడటం కూడా కొంప ముంచింది. చివరి ఓవర్లలోనే కాకుండా అంతకుముందు నుంచే దూకుడు కనబర్చాలని భారత్ భావిస్తోంది. టాప్–3 రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లిలతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా... కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటడం జట్టుకు అదనపు బలాన్నిచ్చింది.
ఇక రిషభ్ పంత్ తనదైన శైలిలో చెలరేగి ఆడుతుండటం, హార్దిక్ పాండ్యా మెరుపు ప్రదర్శనలు కూడా జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించడం ఖాయం. పేస్ బౌలింగ్‌లో మరోసారి భువనేశ్వర్‌పైనే భారం ఉంది. ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. అయితే చివరి మ్యాచ్‌లో వైవిధ్యం కోసం వీరిద్దరిలో ఒకరిని తప్పించి నటరాజన్‌ను తీసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ పేస్‌తో పాటు యార్కర్ల బలంతో నటరాజన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడని మేనేజ్‌మెంట్ నమ్ముతోంది. అయితే అన్నింటికంటే భారత్‌కు ఆందోళన కలిగించే అంశం స్పిన్ విభాగం.
గత మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, కృనాల్ పాండ్యా కలిసి 16 ఓవర్లలో 156 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, 14 సిక్సర్లు సమర్పించుకున్నారు! ఈ నేపథ్యంలో కుల్దీప్ స్థానంలో యజువేంద్ర చహల్ రావడం ఖాయమైంది. టి20ల్లో చహల్‌ను చితక్కొట్టినా... ప్రస్తుతం కుల్దీప్ పరిస్థితి చూస్తే అంతకంటే కొంతైనా మెరుగ్గా బౌలింగ్ చేయగలడని అనిపిస్తోంది. కృనాల్ స్థానంలో సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వికెట్లు పడగొట్టకపోయినా... బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం సుందర్‌కు ఉంది. మరోవైపు హార్దిక్‌తో బౌలింగ్ చేయించే ఆలోచన లేదని కోహ్లి స్పష్టంగా చెప్పేయడంతో ప్రత్యామ్నాయానికి అవకాశం లేకుండా ఐదుగురు బౌలర్లే పూర్తి కోటాతో జట్టును నడిపించాల్సి ఉంది.
ఓపెనర్లపైనే దృష్టి...
‘భారీ లక్ష్యాలను నిర్దేశించడంలోనూ, ఛేదించడంలోనూ మేం చాలా కాలంగా ఒక శైలిని ఏర్పరుచుకున్నాం. ఫలితాలతో సంబంధం లేకుండా వాటిని కొనసాగిస్తాం’ ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్య ఇది. గత మ్యాచ్‌లో అతను ఆడకపోయినా బట్లర్ నేతృత్వంలోని టీమ్ దానిని కొనసాగించి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వన్డే క్రికెట్‌లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా ఉన్న జేసన్ రాయ్, బెయిర్‌స్టో జోరుతో ఇంగ్లండ్‌కు అద్భుత ఆరంభాలు లభిస్తున్నాయి. తొలి వన్డేలో గెలుపు అవకాశాన్ని వృథా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం అదే పునాదిపై చెలరేగి గెలుపు తీరం చేరింది. ఒక్కసారి కుదురుకుంటే తాను ఎంత ప్రమాదకారినో స్టోక్స్ చూపించాడు.
మలాన్, బట్లర్, లివింగ్‌స్టోన్‌లు బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించగలరు. తర్వాత వచ్చే ఇద్దరు ఆల్‌రౌండర్లు అలీ, స్యామ్ కరన్‌లు కూడా పరుగులు సాధించగలరు కాబట్టి జట్టు బ్యాటింగ్ లోతు ఎలాంటిదో తెలుస్తోంది. బౌలింగ్‌లో ఇద్దరు స్పిన్నర్లు అలీ, రషీద్ తమ వంతు బాధ్యతలు సమర్థంగా పోషిస్తున్నారు. స్యామ్ కరన్, టాప్లీలు పేస్ భారం మోస్తారు. ఫిట్‌నెస్ సమస్యలతో రెండో మ్యాచ్ ఆడని మార్క్ వుడ్ మళ్లీ బరిలోకి దిగితే అతని పేస్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన టామ్ కరన్ స్థానంలో వుడ్ ఆడతాడు. మొత్తంగా చూస్తే బౌలింగ్‌లో కొన్ని సమస్యలు ఉన్నా...బ్యాటింగ్ బలగం ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలబెడుతోంది.
పిచ్, వాతావరణం
పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. గత రెండు వన్డేల్లాగే మళ్లీ భారీ స్కోర్లకు మంచి అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ మరీ సులువుగా మారిపోతోంది కాబట్టి మరోసారి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, హార్దిక్, సుందర్, శార్దుల్/నటరాజన్, భువనేశ్వర్, కుల్దీప్/చహల్, ప్రసిధ్ కృష్ణ.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, మలాన్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్ కరన్, ఆదిల్ రషీద్, టాప్లీ, వుడ్.
IND vs ENG 3rd ODI: ఆఖరి పోరాటం
Published Sun, Mar 28 2021 4:52 AM | Last Updated on Sun, Mar 28 2021 11:45 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment