
నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు
సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో టీమిండియా
ఆధిపత్యం కోసం ఆతిథ్య జట్టు ప్రయత్నం
బుమ్రా ఆడటంపై సందేహాలు!
మధ్యాహ్నం గం.3:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు మరో సవాల్‌కు సై అంటోంది. తొలి పోరులో భారీ స్కోర్లు, ఐదు సెంచరీల తర్వాత కూడా పరాజయాన్ని ఎదుర్కొన్న జట్టు ఈ సారి తప్పులు దిద్దుకొని లెక్క సరి చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే సిరీస్‌లో కోలుకునేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఆతిథ్య జట్టు పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడతాడా లేదా అనేదే చివరి నిమిషం వరకు సస్పెన్స్‌గా ఉండవచ్చు!
బర్మింగ్‌హామ్: సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత బరిలోకి దిగిన తొలి సిరీస్‌లో భారత జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌కు నిరాశే ఎదురైంది. బ్యాటర్‌గా అతను సెంచరీ సాధించినా... ఫలితం మాత్రం సానుకూలంగా రాలేదు. ఇప్పుడు నాయకుడిగా తన సమర్థతను నిరూపించుకునేందుకు అతను సిద్ధమయ్యాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో రెండో టెస్టు జరుగుతుంది. తొలి మ్యాచ్ నెగ్గిన ఇంగ్లండ్ 1–0తో ఆధిక్యంలో ఉంది. ఈ మైదానంలో మన జట్టు రికార్డు పేలవంగా ఉంది. 8 టెస్టులు ఆడితే 7 మ్యాచ్‌లు ఓడిన టీమిండియా మరో టెస్టును ‘డ్రా’ చేసుకోగలిగింది.
కుల్దీప్‌కు చాన్స్!
గత టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన చూస్తే తుది జట్టులో మార్పులు కచ్చితంగా ఉంటాయి. టీమ్ మేనేజ్‌మెంట్ పదే పదే చెబుతున్నట్లుగా టాప్ బౌలర్ బుమ్రా మిగిలిన నాలుగు టెస్టుల్లో రెండు మాత్రమే ఆడతాడు. తొలి, రెండో టెస్టుకు మధ్యలో తగినంత విశ్రాంతి లభించింది కాబట్టి అతను ఈ టెస్టు ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. లార్డ్స్‌లో జరిగే మూడో టెస్టులో అతను ఆడాలని భావిస్తే ఇక్కడ తప్పుకోవచ్చు. అదే జరిగితే మన బౌలింగ్ మరింత బలహీనంగా కనిపించడం ఖాయం.
గత టెస్టులో విఫలమైన శార్దుల్‌కు బదులు స్పిన్నర్ బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అయితే జడేజాకు తోడుగా ఎవరనే విషయంలోనే కాస్త సందిగ్ధత ఉంది. బ్యాటింగ్ బలహీనంగా మారవద్దని భావిస్తే సుందర్‌కు అవకాశం లభించవచ్చు. అయితే ప్రత్యర్థిని కట్టిపడేయగల పదునైన స్పిన్నర్ కావాలంటే మాత్రం కుల్దీప్‌కు చాన్స్ ఇవ్వాలి. మరోవైపు బ్యాటింగ్‌లో టాప్–6కు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు.
మార్పుల్లేకుండా...
తొలి టెస్టు విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఈ పోరుకు సిద్ధమైన ఇంగ్లండ్ రెండు రోజుల ముందే తుది జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ ఆర్చర్ వస్తే కూర్పులో మార్పు ఉండవచ్చని అనిపించినా ... అతడిని తీసుకోకుండా గత మ్యాచ్ గెలిపించిన టీమ్‌నే ఎంపిక చేసింది. మరోసారి ఇంగ్లండ్ తమ బ్యాటింగ్ బలాన్ని నమ్ముకుంది. ఓపెనర్లు క్రాలీ, డకెట్‌తో పాటు ఓలీ పోప్ కూడా తొలి టెస్టులో చెలరేగిపోయారు.
ఫామ్‌లో ఉన్న రూట్‌ను నిలువరించడం భారత్‌కు అంత సులువు కాదు. బ్రూక్, స్టోక్స్‌లతో పాటు జేమీ స్మిత్ బ్యాటింగ్ పదును ఏమిటో గత మ్యాచ్‌లో కనిపించింది. తొలి టెస్టులో విఫలమైన వోక్స్ తన సొంత మైదానంలో సత్తా చాటా లని పట్టుదలగా ఉన్నాడు. కార్స్, టంగ్ అతడికి అండగా నిలవాల్సి ఉంది. ఏకైక స్పిన్నర్ షోయబ్ బషీర్ ఏమాత్రం ప్రభావం చూపిస్తాడో చూడాలి.
పిచ్, వాతావరణం
ఎడ్జ్‌బాస్టన్ మైదానం కూడా ఛేదనకే అనుకూలం. గత సిరీస్‌లో ఇక్కడే ఇంగ్లండ్ రికార్డు స్థాయిలో భారత్‌పై 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ సందర్భంగా అక్కడక్కడా వర్షంతో అంతరాయం కలగవచ్చు.