వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని వెస్టిండీస్ నిరూపించింది. ‘అంచనాలకు తగినట్లుగా’ సాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కూడా కనబర్చలేక టీమ్ కుప్పకూలింది. టి20 మ్యాచ్‌కు మించి ఆడటం తమ వల్ల కాదన్నట్లుగా 23 ఓవర్లకే ఇన్నింగ్స్ ముగించింది. మొదటి మూడు వికెట్లు తీసి పేసర్లు శుభారంభం చేస్తే తర్వాతి 7 వికెట్లతో స్పిన్నర్లు కుల్దీప్, జడేజా పండుగ చేసుకున్నారు.
అయితే టీమిండియాకు విజయం సులువుగా దక్కలేదు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఐదు వికెట్లు కోల్పోయి చివరకు గెలుపు సొంతం చేసుకుంది. రోహిత్, కోహ్లి తమ స్థానాల్లో ఆడకుండా ఇతర బ్యాటర్లను ముందుగా పంపగా... అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు.
బ్రిడ్జ్‌టౌన్: వెస్టిండీస్‌పై టెస్టు సిరీస్‌ను అలవోకగా గెలుచుకున్న భారత జట్టు వన్డేల్లోనూ తమ స్థాయిని ప్రదర్శించింది. గురువారం ఏకపక్షంగా సాగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ షై హోప్ (45 బంతుల్లో 43; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కుల్దీప్ యాదవ్ 6 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా, రవీంద్ర జడేజాకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 22.5 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (46 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఇదే మైదానంలో జరుగుతుంది.
టపటపా...
వన్డేల్లో తమ జట్టు బలహీనతను మరోసారి ప్రదర్శిస్తూ వెస్టిండీస్ కుప్పకూలింది. కెపె్టన్ హోప్ కొంత పోరాడగలిగినా... మిగతావారంతా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. హార్దిక్ తన రెండో ఓవర్లోనే కైల్ మేయర్స్ (2)ను అవుట్ చేసి భారత్‌కు సరైన ఆరంభం అందించాడు. హార్దిక్ ఓవర్లో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్... శార్దుల్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి అలిక్ అతనజ్ (18 బంతుల్లో 22; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేసినా అది ఎక్కువ సేపు సాగలేదు.
జడేజా చక్కటి క్యాచ్‌తో అతను వెనుదిరిగాడు. ముకేశ్‌కు ఇది తొలి వికెట్ కావడం విశేషం. మరో మూడో బంతులకే బ్రెండన్ కింగ్ (17)ను శార్దుల్ అవుట్ చేయడంతో స్కోరు 45/3కి చేరింది. ఈ దశలో హోప్ కొన్ని చక్కటి షాట్లతో కాస్త పట్టుదల కనబర్చాడు. అయితే మరో ఎండ్‌లో 8 పరుగుల వ్యవధిలో హెట్‌మైర్ (11), రావ్‌మన్ పావెల్ (4), షెఫర్డ్ (0) వెనుదిరగడంతో విండీస్ కోలుకోలేకపోయింది. తర్వాతి నాలుగు వికెట్లూ కుల్దీప్ ఖాతాలోకే వెళ్లాయి.
తన తొలి, రెండో ఓవర్లో ఒక్కో వికెట్ తీసిన అతను మూడో ఓవర్లో మరో రెండు వికెట్లతో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. వెస్టిండీస్ తరఫున 1972–79 మధ్య 12 టెస్టులు ఆడి 29 వికెట్లు తీసిన లెఫ్టార్మ్ స్పిన్నర్ రఫీక్ జుమాదిన్ గురువారం మరణించడంతో సంతాప సూచకంగా విండీస్ ఆటగాళ్లు భుజానికి నల్ల బ్యాండ్‌లు ధరించి బరిలోకి దిగారు.
తడబడినా...
ఛేదనలో భారత్ ఇన్నింగ్స్ అలవోకగా సాగలేదు. రోహిత్ శర్మ కాకుండా కిషన్, గిల్ (7) ఓపెనర్లుగా బరిలోకి దిగారు. గిల్ విఫలం కాగా, మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (19) కూడా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ప్రమోట్ అయిన హార్దిక్ పాండ్యా (5) రనౌట్ కాగా, మరో ఎండ్‌లో ఇషాన్ మాత్రం నిలకడగా ఆడుతూ 44 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ వెంటనే ఇషాన్‌తో పాటు శార్దుల్ (1) వెనుదిరగడంతో రోహిత్ (12 నాటౌట్) క్రీజ్‌లోకి రాక తప్పలేదు. ఆపై మరో వికెట్ పడకుండా జడేజా (16 నాటౌట్)తో రోహిత్ మ్యాచ్‌ను ముగించడంతో కోహ్లి బ్యాటింగ్‌కు రావాల్సిన అవసరం లేకపోయింది.
ముకేశ్@ 251
వెస్టిండీస్‌తో రెండో టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన పేస్ బౌలర్ ముకేశ్ కుమార్‌కు ఇదే టూర్‌లో వన్డే అవకాశం కూడా దక్కింది. గురువారం మ్యాచ్‌తో అతను వన్డేల్లో అరంగేట్రం చేశాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 251వ ఆటగాడిగా ముకేశ్ నిలిచాడు.
2విండీస్‌కు భారత్‌పై వన్డేల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. 2018లో 104 పరుగులకు ఆలౌటైంది. ఆలౌట్ అయిన సందర్భాల్లో ఎదుర్కొన్న బంతులపరంగా కూడా విండీస్‌కు ఇది రెండో చెత్త ప్రదర్శన. 2011లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 22 ఓవర్లకే ఆ జట్టు కుప్పకూలింది.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ ఇన్నింగ్స్: కింగ్ (బి) శార్దుల్ 17; మేయర్స్ (సి) రోహిత్ (బి) హార్దిక్ 2; అతనజ్ (సి) జడేజా (బి) ముకేశ్ 22; హోప్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 43; హెట్‌మైర్ (బి) జడేజా 11; పావెల్ (సి) గిల్ (బి) జడేజా 4; షెఫర్డ్ (సి) కోహ్లి (బి) జడేజా 0; డ్రేక్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; కారియా (ఎల్బీ) (బి) కుల్దీప్ 3; మోతీ (నాటౌట్) 0; సీల్స్ (సి) హార్దిక్ (బి) కుల్దీప్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (23 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–7, 2–45, 3–45, 4–88, 5–96, 6–96, 7–99, 8–107, 9–114, 10–114. బౌలింగ్: హార్దిక్ పాండ్యా 3–0–17–1, ముకేశ్ 5–1–22–1, శార్దుల్ 3–1–14–1, జడేజా 6–0–37–3, ఉమ్రాన్ 3–0–17–0, కుల్దీప్ యాదవ్ 3–2–6–4.
భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (సి) పావెల్ (బి) మోతీ 52; గిల్ (సి) కింగ్ (బి) సీల్స్ 7; సూర్యకుమార్ (ఎల్బీ) (బి) మోతీ 19; హార్దిక్ (రనౌట్) 5; జడేజా (నాటౌట్) 16; శార్దుల్ (సి) అతనజ్ (బి) కారియా 1; రోహిత్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (22.5 ఓవర్లలో 5 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1–18, 2–54, 3–70, 4–94, 5–97. బౌలింగ్: డ్రేక్స్ 4–0– 19–0, సీల్స్ 4–0–21–1, మేయర్స్ 1–0– 6–0, షెఫర్డ్ 1–0–2–0, మోతీ 6.5–0– 26–2, కారియా 5–0–35–1, అతనజ్ 1–0–7–0.
Comments
Please login to add a commentAdd a comment