డబ్లిన్: సీనియర్లంతా విశ్రాంతి తీసుకున్న ఐర్లాండ్ పర్యటనలో యువ ఆటగాళ్లు బాధ్యతగా ఆడి టీమిండియాను గెలిపించారు. రెండో టి20లో 33 పరుగులతో గెలుపొందిన బుమ్రా బృందం మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సిరీస్‌లోని చివరిదైన మూడో మ్యాచ్ ఈనెల 23న ఇదే వేదికపై జరుగుతుంది.
రెండో టి20లో మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (43 బంతుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), సంజూ సామ్సన్ (26 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రింకూ సింగ్ (21 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిపించారు.
మెకార్తీ 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్ అండీ బల్బిర్నీ (51 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, రవి బిష్ణోయ్ తలా 2 వికెట్లు తీశారు.
రాణించిన గైక్వాడ్
భారీ షాట్లు ఆడే క్రమంలో బంతిని గాల్లోకి లేపిన టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ తిలక్ వర్మ (1) అవుటయ్యారు. విండీస్ పర్యటనలో రాణించిన తిలక్ ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లో నిరాశ పరిచాడు. మెకార్తీ షార్ట్‌పిచ్ బంతిని తిలక్ పుల్ చేయగా అదికాస్తా అక్కడే చాలా ఎత్తుకు లేచింది. డీప్‌స్కే్వర్ లెగ్‌లో ఉన్న డాక్‌రెల్ క్యాచ్‌ను అందుకున్నాడు.
34 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయిన జట్టును రుతురాజ్, సంజూ సామ్సన్ ధాటిగా నడిపించారు. మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతున్న సామ్సన్ బంతిని వికెట్ల మీదికి ఆడుకొని నిష్క్రమించగా, అర్ధసెంచరీ అనంతరం రుతురాజ్ అవుటయ్యాడు. ఆఖర్లో రింకూ సింగ్, శివమ్ దూబే (16 బంతుల్లో 22 నాటౌట్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు.
బల్బిర్నీ పోరాటం...
తొలి మ్యాచ్‌లో బుమ్రా పడగొట్టినట్లే ఈసారి ప్రసిధ్ కృష్ణ ఒకే ఓవర్లో (3వ) కెపె్టన్ స్టిర్లింగ్ (0), టక్కర్ (0)లను డకౌట్ చేశాడు. టెక్టర్ (7), క్యాంఫర్ (18)లను రవి బిష్ణోయ్ స్పిన్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో 10 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు 63/4. ఈ దశలో ఐర్లాండ్‌కు గెలుపుపై ఆశలేమీ లేవు. అయితే బల్బిర్నీ వీరవిహారం భారత శిబిరాన్ని వణికించింది.
డాక్‌రెల్ (13; 1 సిక్స్)తో కలిసి జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. కాసేపటికే డాక్‌రెల్ లేని పరుగుకు యత్నించి రనౌట్ కాగా... సిక్సర్ల మోత మోగిస్తున్న బల్బిర్నీ జోరుకు అర్ష్దీప్ బ్రేక్ వేలేశాడు. ఆ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్ పక్షాన నిలిచింది. మార్క్ అడైర్ (15 బంతుల్లో 23; 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అయితే బంతులకి, పరుగులకి మధ్య కొండంత అంతరాన్ని ఈ సిక్సర్లు తగ్గించలేకపోయాయి.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) క్యాంఫర్ (బి) యంగ్ 18; రుతురాజ్ (సి) టెక్టర్ (బి) మెకార్తీ 58; తిలక్ వర్మ (సి) డాక్‌రెల్ (బి) మెకార్తీ 1; సంజూ సామ్సన్ (బి) వైట్ 40; రింకూ సింగ్ (సి) యంగ్ (బి) అడైర్ 38; దూబే (నాటౌట్) 22; సుందర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 185.
వికెట్ల పతనం: 1–29, 2–34, 3–105, 4–129, 5–184. బౌలింగ్: మార్క్ అడైర్ 4–0–36–1, జోష్ లిటిల్ 4–0–48–0, మెకార్తీ 4–0–36–2, క్రెయిగ్ యంగ్ 4–0–29–1, బెన్ వైట్ 4–0–33–1.
ఐర్లాండ్ ఇన్నింగ్స్: బల్బిర్నీ (సి) సామ్సన్ (బి) అర్ష్దీప్ 72; స్టిర్లింగ్ (సి) అర్ష్దీప్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; టక్కర్ (సి) రుతురాజ్ (బి) ప్రసిధ్ కృష్ణ 0; టెక్టర్ (బి) రవి బిష్ణోయ్ 7; క్యాంఫర్ (సి) దూబే (బి) రవి బిష్ణోయ్ 18; డాక్‌రెల్ (రనౌట్) 13; అడైర్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 23; మెకార్తీ (సి) రవి బిష్ణోయ్ (బి) బుమ్రా 2; యంగ్ (నాటౌట్) 1; జోష్ లిటిల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) 152.
వికెట్ల పతనం: 1–19, 2–19, 3–28, 4–63, 5–115, 6–123, 7–126, 8–148. బౌలింగ్: బుమ్రా 4–1–15–2, అర్ష్దీప్ 4–0–29–1, ప్రసిధ్ కృష్ణ 4–0–29–2, రవి బిష్ణోయ్ 4–0–37–2, వాషింగ్టన్ సుందర్ 2–0–19–0, శివమ్ దూబే 2–0–18–0.
Comments
Please login to add a commentAdd a comment