పుంజుకునే పనిలో ఇంగ్లండ్
ఇరుజట్ల మధ్య నేడు రెండో టి20
రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
ఇంగ్లండ్‌తో బోణీ అదిరింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో టీమిండియా సత్తా చాటుకుంది. ఇక సిరీస్‌లో పైచేయే మిగిలింది. వరుస మ్యాచ్‌ల విజయాలతో ప్రత్యర్థిని దెబ్బతీయాలని ఆతిథ్య భారత్ చూస్తోంది. తద్వారా సిరీస్ ఫలితం కోసం ఆఖరి పోరు (ఐదో టి20) దాకా లాక్కెళ్లడం ఎందుకని భావిస్తోంది. అయితే ఇది టి20 ఫార్మాట్.
ఇందులో సొంతగడ్డ అనుకూలతలు, పర్యాటక జట్టుకు ప్రతికూలతలంటూ ఉండవు. ఒక్క ఓవర్ మార్చేస్తుంది. ఇక మెరుపు ఇన్నింగ్స్ తేల్చేస్తుంది. అలాంటి స్పీడ్ గేమ్‌లో మనదే ఆధిపత్యమనుకొని ఆదమరిస్తే అంతే సంగతి! ఐసీసీ ర్యాంకింగ్‌తో సంబంధం లేకుండా అంతర్జాతీయ క్రికెట్‌లోనే ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లండ్ జట్లు ఎప్పుడైనా సరే టాప్–3 జట్లే! కాబట్టి బట్లర్ బృందాన్ని ఏమాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ మూల్యం చెల్లించుకోక తప్పదు.
పైగా ఐపీఎల్‌లో హార్డ్ హిట్టర్‌గా ఇక్కడి పిచ్‌లపై కెప్టెన్ బట్లర్‌కు చక్కని అవగాహన ఉంది. ఆ సంగతి సూర్యకుమార్ బృందం మర్చిపోకూడదు. ఈ నేపథ్యంలో నేడు జరిగే రెండో టి20లో భారత్, ఇంగ్లండ్ జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.
చెన్నై: కోల్‌కతాలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ బోల్తా పడింది. అలాగని ఒక్క మ్యాచ్‌తోనే పటిష్టమైన ఇంగ్లండ్‌ను తేలిగ్గా తీసుకోలేం. ఓపెనింగ్‌లో ఫిల్ సాల్ట్, మిడిలార్డర్‌లో హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్‌లు బ్యాట్ ఝుళిపిస్తే భారత బౌలర్లకు కష్టాలు తప్పవు.
ఈ ముగ్గురితో పాటు జోస్ బట్లర్‌కు ఇక్కడి పిచ్‌లు కొట్టిన పిండే! అతని విధ్వంసం కొన్ని ఓవర్లపాటే ఉన్నా ఆ ప్రభావం ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను గణనీయంగా మార్చేస్తుంది. బౌలింగ్‌లో పేస్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ మెరుగ్గా బౌలింగ్ చేశాడు.
అట్కిన్సన్, మార్క్ వుడ్‌లతో పార్ట్‌టైమ్ బౌలర్‌గా లివింగ్‌స్టోన్ కూడా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. గత మ్యాచ్‌లో విఫలమైనంత మాత్రాన జట్టు వెనుకబడదు. కచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచేందుకు, 1–1తో సమం చేసేందుకు బట్లర్ బృందం గట్టి పోరాటమే చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
షమీ ఆడేనా?
భారత వెటరన్ సీమర్ షమీ గాయాల తర్వాత దేశవాళీ క్రికెట్‌లో బరిలోకి దిగాడు. ఫిట్‌నెస్ నిరూపించుకున్నాడు. అయితే అంతర్జాతీయ పోటీలకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. ‘ఈడెన్’లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన భారత బృందం స్పిన్‌కు స్వర్గధామమైన ‘చెపాక్’లోనూ అదే ఎత్తుగడను కొనసాగిస్తే సీనియర్ పేసర్ డగౌట్‌కే పరిమితం కావొచ్చు.
ఒకవేళ ఐదు మ్యాచ్‌ల సుదీర్ఘ సిరీస్‌లో అతన్ని దించాలనుకుంటే మాత్రం ‘ఈడెన్’లో ప్రభావం చూపలేకపోయిన స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని పక్కనబెట్టే అవకాశమైతే ఉంది. ఈ మార్పు మినహా గత జట్టే యథాతథంగా కొనసాగుతుంది. ఓపెనర్లు సంజూ సామ్సన్, అభిషేక్ శర్మ మంచి ఆరంభమే ఇచ్చారు. తక్కువ లక్ష్యమే కావడంతో మిగతా వారు పెద్దగా రాణించే చాన్స్ రాలేదు.
సంజూ కూడా అభిషేక్‌లాగే భారీ ఇన్నింగ్స్ ఆడితే భారత బ్యాటింగ్ ఆర్డర్‌కు ఏ ఢోకా ఉండదు. నితీశ్ రెడ్డి, అక్షర్ పటేల్ దాకా అంతా దంచేసే వాళ్లే ఉన్నారు. ఓవర్‌కు పది పైచిలుకు పరుగులిచ్చినా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లతో సత్తా చాటాడు. అర్ష్ దీప్ సింగ్ ఈ ఫార్మాట్‌లో తన ప్రాధాన్యం పెంచుకునే ప్రదర్శన చేస్తున్నాడు. స్పిన్‌తో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇంగ్లండ్ బలగాన్ని తిప్పేస్తుండటంతో బౌలింగ్ దళం కూడా దీటుగానే ఉంది.
2 చెన్నైలో ఇప్పటి వరకు భారత జట్టు రెండు టి20లు ఆడింది. ఒక మ్యాచ్‌లో గెలిచి (2018లో వెస్టిండీస్‌పై ఆరు వికెట్ల తేడాతో)... మరో మ్యాచ్‌లో (2012లో న్యూజిలాండ్ చేతిలో ఒక పరుగు తేడాతో) ఓడిపోయింది.
పిచ్, వాతావరణం
గత ఈడెన్ పిచ్ సీమర్లకు, స్పిన్నర్లకు సమాన అవకాశమిచ్చిoది. కానీ ఇక్కడి చెపాక్ వికెట్ అలా కాదు. ఇది ఎప్పట్నుంచో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్. వరుణ్, అక్షర్‌లతో పాటు రవి బిష్ణోయ్‌కు కలిసొచ్చే వేదికని చెప్పొచ్చు. మంచు ప్రభావం తప్ప వాన ముప్పయితే లేదు.
Comments
Please login to add a commentAdd a comment