కోహ్లి, అర్జున్ (ఫైల్ ఫొటో)
లండన్ : టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ కాస్త ఇబ్బంది పెట్టాడు. అర్జున్‌కు, భారత క్రికెటర్లకు సంబంధం ఏంటంటారా..! ఇక్కడి మార్చంట్ టేలర్ స్కూల్ గ్రౌండ్‌లో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి లెఫ్టార్మ్ పేసర్ అర్జున్ బౌలింగ్ చేశాడు. కోహ్లితో పాటు కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్‌లు రెండో టెస్ట్‌కు ముందు బుధవారం నెట్స్‌లో అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సమయంలో ముంబైలోని వాంఖెడే స్టేడియంలోనూ భారత బ్యాట్స్‌మెన్ అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేశారు.
తొలి టెస్టులో ఇంగ్లండ్ యువ సంచలనం స్యామ్ కరన్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో ఏమాత్రం అనుభవం లేకున్నా భారత్ నుంచి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పేశాడు. అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లోనూ చెలరేగిన కరన్‌నే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించిన విషయం తెలిసిందే. పేస్‌కు అనుకూలించే లార్డ్స్ టెస్టులో కరన్‌తో పాటు ఇంగ్లండ్ పేస్ దళాన్ని ఎదుర్కోవడంలో భాగంగా టీమిండియా మేనేజ్‌మెంట్ అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేయించింది. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్‌లు ముఖ్యంగా ఇంగ్లండ్ పేసర్ కరన్ బౌలింగ్‌లో తడబాటుకు లోనవుతున్నారు. దీన్ని అధిగమించేందుకు కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర టాపార్డర్ బ్యాట్స్‌మెన్ యువ బౌలర్ అర్జున్ బౌలింగ్‌లో ప్రాక్టీస్ చేసినా.. అతడి బంతులను ఎదుర్కోవడంలో కాస్త ఇబ్బంది పడ్డట్లు సమాచారం. అయితే ప్రాక్టీస్ చేయడం మంచి యోచన అని మాజీలు అభిప్రాయపడ్డారు.
మరోవైపు గాయంతో బాధపడుతోన్న పేసర్ జస్ప్రిత్ బుమ్రా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. బుమ్రా ఇంకా కోలుకోలేదని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తెలిపాడు. దారుణంగా విఫలమవుతున్న ధావన్‌ను రెండో టెస్టులో ఆడిస్తారో లేదన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. వర్షం కారణంగా గురువారం రెండో టెస్టు కనీసం టాస్ కూడా వేయలేదన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment