ముంబై: ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించే అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచనలో పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ నవంబర్‌లో ఆసీస్‌కు పయనం కావాల్సి ఉంటుంది. ఆటగాళ్ల ఆసీస్ ప్రయాణానికి సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. ఈ స్వల్ప సమయంలో చార్టెర్డ్ విమానాల ఏర్పాటు, క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బందికి వసతి, జట్ల ఎంపిక, ఆటగాళ్లకు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహణ, పర్యటనకు తీసుకెళ్లాల్సిన ఆటగాళ్ల సంఖ్య ఇలా ప్రతీ విషయంలోనూ బీసీసీఐ ముందు అనేక సవాళ్లు నిలిచాయి.
మరోవైపు ఆస్ట్రేలియాలోని క్వారంటైన్ నిబంధనలు ప్రతీ రాష్ట్రానికి వేర్వేరుగా ఉండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా తలపట్టుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా ఉంటే... మరో చోట ఈ నిబంధన ఏడు రోజులుగా ఉంది. షెడ్యూల్ ప్రకారం 4 టెస్టులకు వేర్వేరు వేదికలు ఉండటంతో పాటు... వన్డే, టి20 ఫార్మాట్‌లు కూడా ఆడాల్సి రావడంతో ఆటగాళ్లకు ఎలాంటి క్వారంటైన్ విధించాలనే అంశంపై సీఏ ఇంకా అస్పష్టతతోనే ఉంది. దీంతో కేవలం ఒక ఫార్మాట్‌తోనే సిరీస్‌ను ముగించాలా? లేక రెండే వేదికల్లో మ్యాచ్‌లన్నీ ముగించాలా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. వీటిపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టతనిచ్చే వరకు బీసీసీఐ వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment