
న్యూఢిల్లీ: శ్రీలంక వేదికగా ఈ నెల 28న ఆరంభమయ్యే లంక ప్రీమియర్ లీగ్‌లో భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇందుకోసం అతడు లీగ్ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. లీగ్‌లో పాల్గొనే ఐదు జట్లలో ఏదో ఒక జట్టు అతడిని ‘మార్కీ ప్లేయర్ (స్టార్ ఆటగాడు)’ జాబితాలో తీసుకునే అవకాశం ఉంది. పఠాన్ ఈ ఏడాది జనవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడంతో... విదేశీ లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ నుంచి ఎటువంటి అడ్డంకులు ఎదురుకాకపోవచ్చు. భారత జట్టుకు ఆడే ఆటగాళ్లను విదేశీ టి20 లీగ్‌ల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతించదు. అయితే తాను ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించడంతో లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడేందుకు తనకెటువంటి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉండదని పఠాన్ పేర్కొన్నాడు. 35 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ 2007 టి20 ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో కీలక సభ్యుడిగా వ్యవహరించాడు.