మహిళల జూనియర్ ఆసియా కప్ టోర్నీ బరిలోకి భారత జట్టు
7 నుంచి మస్కట్‌లో టోర్నీ
బెంగళూరు: జూనియర్ ఆసియా కప్ టైటిల్ నిలబెట్టుకునేందుకు భారత మహిళల హాకీ జట్టు మంగళవారం ఒమన్‌కు బయల్దేరింది. ఒమన్ రాజధాని మస్కట్‌లో ఈ నెల 7 నుంచి 15 వరకు ఆసియా టోర్నీ జరుగుతుంది. ఇందులో రాణించి టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు వచ్చే ఏడాది జూనియర్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలనే లక్ష్యంతో భారత అమ్మాయిల జట్టు సన్నద్ధమై వెళ్లింది. మస్కట్ టోర్నీలో స్వర్ణ, రజత, కాంస్య పతక విజేతలు (టాప్–3 జట్లు) శాంటియాగో (చిలీ)లో జరిగే ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తారు.
ఆసియా కప్ ఈవెంట్‌లో భారత్ పూల్ ‘ఎ’లో ఉంది. ఈ పూల్‌లో భారత్‌తో పాటు చైనా, మలేసియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ జట్లున్నాయి. పూల్ ‘బి’లో దక్షిణ కొరియా, జపాన్, చైనీస్ తైపీ, హాంకాంగ్, శ్రీలంకలు పోటీపడతాయి. జ్యోతి సింగ్ నేతృత్వంలోని భారత జట్టులో పలువురు ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తున్నారు. వైష్ణవి విఠల్ ఫాల్క, సునేలిత టొప్పొ, ముంతాజ్ ఖాన్, దీపిక, బ్యూటీ డుంగ్‌డుంగ్‌లకు సీనియర్లతో కలిసి ఆడిన అనుభవం ఉంది.
ఈ జట్టుకు భారత మాజీ కెప్టెన్ తుషార్ ఖండ్కేర్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. ఒమన్‌కు బయలుదేరే ముందు మీడియాతో కెపె్టన్ జ్యోతి సింగ్ మాట్లాడుతూ జట్టు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైందని, కొన్ని నెలలుగా జట్టు సన్నాహాల్లో చెమటోడ్చుతుందని తెలిపింది. అక్కడే ఉన్న పురుషుల జట్టు నాకౌట్‌కు చేరడం ఆనందంగా ఉందని, మేం కూడా వారిలాగే రాణిస్తామని ఆశాభావం వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment