హాంగ్జౌ: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు. చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్‌లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది.
నీరజ్ స్వర్ణంతో...
ఆఖరి రోజు శనివారం పోటీల్లో నీరాజ్ యాదవ్ జావెలిన్ త్రో (ఎఫ్55)లో 33.69 మీటర్లతో రికార్డు దూరం విసిరి బంగారం నిలబెట్టుకున్నాడు. 39 ఏళ్ల నీరజ్ గత 2018 పారా ఈవెంట్‌లోనూ పసిడి పట్టాడు. ఈ క్రీడల్లో సహచరుడు టెక్ చంద్ (30.36 మీ.) కాంస్యంతో తృప్తిపడ్డాడు. తర్వాత దిలిప్ మహాదు పురుషుల 400 మీటర్ల పరుగులో విజేతగా నిలిచాడు. మహిళల 1500 మీటర్ల రేసులో పూజ కాంస్యం నెగ్గింది.
వ్యక్తిగత ర్యాపిడ్–6 బి1 ఈవెంట్‌లో సతీశ్ ఇనాని, ప్రధాన్ కుమార్, అశ్విన్‌భాయ్ కంచన్ వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో క్లీన్‌స్వీప్ చేశారు. బి2/బి3 ఈవెంట్‌లో కిషన్ కాంస్యం, ఇదే టీమ్ ఈవెంట్‌లో కిషన్, ఆర్యన్, సోమేంద్రలతో కూడిన బృందం కాంస్య పతకం గెలుచుకుంది. మహిళల టీమ్ ఈవెంట్‌లో వృతి జైన్, హిమాన్షి, సంస్కృతి కాంస్యం నెగ్గారు.
టాప్–5 పట్టికలో...
ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment