దక్షిణాఫ్రికాలో గతంలో ఎనిమిదిసార్లు పర్యటించినా... భారత జట్టు ఒక్కసారి కూడా సిరీస్ గెలవలేకపోయింది... ఈసారీ ఆ అవకాశం ఇప్పటికే చేజారింది. అయితే గత రెండు పర్యటనల్లో కనీసం ఒక్క టెస్టు మ్యాచ్ అయినా విజయం సాధించగలిగింది. 2013లో మాత్రమే విజయం లేకుండా రిక్తహస్తాలతో తిరిగొచ్చింది.
తొలి టెస్టు ఓడినా... ఇప్పుడు తమ స్థాయికి తగ్గ ఆటతో చెలరేగి టీమిండియా సిరీస్‌ను సమం చేస్తుందా లేక విజయం లేకుండా వెనుదిరుగుతుందా అనేది చూడాలి. మ్యాచ్ జరిగే న్యూలాండ్స్ మైదానంలో ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారి గెలవలేకపోవడం రికార్డుపరంగా భారత్‌కు ప్రతికూలాంశం కూడా.
కేప్‌టౌన్: తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్ గెలిచే సంకల్పంతో బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. ఇప్పుడు దానిని మరచి ప్రత్యర్థిపై పైచేయి సాధించేందుకు మరో అవకాశం వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ టీమ్ క్లీన్‌స్వీప్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో నేటినుంచి జరిగే రెండో టెస్టులో భారత్, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. భారత్ మ్యాచ్ ఓడినా, ‘డ్రా’ అయినా సిరీస్ కోల్పోతుంది. కాబట్టి సమం చేయాలంటే టెస్టులో గెలవడం తప్పనిసరి.
జట్టులోకి జడేజా...
తొలి టెస్టులో ఒక్కో ఇన్నింగ్స్‌లో రాహుల్, కోహ్లి ప్రదర్శన మినహా చెప్పుకోవడానికేమీ లేదు. మన జట్టు రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కూడా దక్షిణాఫ్రికా ఒక ఇన్నింగ్స్‌లో ఆడినన్ని ఓవర్లు ఆడలేకపోయింది. యశస్వి, గిల్, శ్రేయస్‌ల బ్యాటింగ్ వైఫల్యం భారత్ పరాజయంలో ఒక కారణంగా నిలిచింది. కెప్టెన్ రోహిత్ కూడా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపించింది. దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ రికార్డు చాలా పేలవం. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి అతను 128 పరుగులే చేశాడు.
ఇక్కడ చివరి సిరీస్ ఆడబోతున్న రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లోనైనా ఘనంగా ముగింపు ఇవ్వాలని పట్టుదలగా ఆడితే భారత్‌కు శుభారంభం లభిస్తుంది. తొలి టెస్టులో చక్కటి షాట్లతో ఆకట్టుకున్న కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి తమ ఫామ్‌ను కొనసాగించడం కీలకం. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన జడేజా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనుండటం జట్టుకు సానుకూలాంశం. జడేజా కోసం అశ్విన్ న్‌ను పక్కన పెట్టవచ్చు. అయితే ఆల్‌రౌండర్‌గా శార్దుల్ ఠాకూర్ స్థానంపై గత మ్యాచ్ ప్రదర్శన సందేహాలు రేకెత్తించింది.
బౌలింగ్‌లో పూర్తిగా విఫలమైన అతని స్థానంలో రెగ్యులర్ పేస్ బౌలర్‌ను తీసుకోవాలా లేక అశ్విన్ న్‌ను రెండో స్పిన్నర్‌గా కొనసాగించాలా అనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ తేల్చుకోలేకపోతోంది. టాపార్డర్ విఫలమైతే చివర్లో కొన్ని పరుగులు కావాలంటే శార్దుల్ సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు. పేసర్ ప్రసిధ్ కృష్ణ ఘోరంగా విఫలమైనా... ఒక్క మ్యాచ్‌కే అతనిపై వేటు వేయడం సరైన ఆలోచన కాదు. కెప్టెన్ రోహిత్ శర్మ మాటలను బట్టి చూసినా ప్రసిద్‌కు మరో అవకాశం దక్కవచ్చు. ఓవరాల్‌గా బ్యాటింగ్‌పరంగా భారత్ సరైన స్థితిలోనే కనిపిస్తున్నా... బౌలింగ్‌లో మెరుగైతేనే విజయావకాశాలు ఉంటాయి.
కొయెట్జీ స్థానంలో ఎన్‌గిడి
‘నాకు సంబంధించి ఇదే వరల్డ్ కప్. అందుకే విజయంతో ఘనంగా ముగిద్దామనుకుంటున్నా’... తన చివరి టెస్టులో కెపె్టన్‌గా వ్యవహరించున్న డీన్ ఎల్గర్ వ్యాఖ్య ఇది. గత మ్యాచ్‌లోనూ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఎల్గర్ సిరీస్‌ను 2–0తో గెలుచుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. కేప్‌టౌన్‌లో తమ రికార్డు కూడా ఆ జట్టులో ఉత్సాహం పెంచుతోంది. ఎల్గర్‌తో పాటు జోర్జి ఫామ్‌లో ఉండగా బెడింగామ్ తనను తాను నిరూపించుకున్నాడు.
సీనియర్ మార్క్‌రమ్‌తో పాటు పీటర్సన్ కూడా రాణిస్తే భారీ స్కోరు ఖాయం. గాయపడి మ్యాచ్‌కు దూరమైన బవుమా స్థానంలో హమ్జాకు చోటు దక్కింది. బౌలింగ్‌లో సఫారీ మరింత పదునుగా కనిపిస్తోంది. ఈ మైదానంలో 20.95 సగటుతో 42 వికెట్లు తీసిన ఘనమైన రికార్డు రబడ సొంతం. బర్గర్ తొలి టెస్టులోనే సత్తా చాటాడు. గాయపడిన కొయెట్జీ స్థానంలో ఎన్‌గిడి వస్తాడు. భారత్‌ను ఈ పేస్ బలగం తీవ్రంగా ఇబ్బంది పెట్టవచ్చు. స్పిన్నర్ లేకుండా టీమ్ బరిలోకి దిగే చాన్స్ ఉంది.
పిచ్, వాతావరణం
మ్యాచ్‌కు ముందు రోజు పిచ్‌పై పచ్చి క కనిపిస్తోంది. తొలి రోజు వాతావరణాన్ని బట్టి చూస్తే సీమర్లు ప్రభావం చూపించగలరు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. టెస్టుకు వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్ ), యశస్వి, గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, జడేజా, శార్దుల్, బుమ్రా, సిరాజ్, ప్రసిధ్.
దక్షిణాఫ్రికా: ఎల్గర్ (కెప్టెన్ ), మార్క్‌రమ్, జోర్జి, పీటర్సన్, హమ్జా, బెడింగామ్, వెరీన్, జాన్సెన్, ఎన్‌గిడి, రబడ, బర్గర్.
Comments
Please login to add a commentAdd a comment