Mahendra Singh Dhoni(Ms Dhoni) అంటే తెలియనివారుండరు. ఆ పేరు వెనుక ఒక చరిత్ర దాగుంది. భారత క్రికెట్ బతికున్నంతవరకు ధోని పేరు చిరస్థాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. భారత అత్యుత్తమ కెప్టెన్‌గా నిలిచిన ధోని నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దేశానికి రెండు ప‍్రపంచకప్‌లు అందించిన కెప్టెన్‌గా.. అలాగే ప్రపంచక్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోపీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్‌గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు. భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఆటగాడిగా పేరు పొందాడు.
1981 జూలై 7న జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించిన ఎంఎస్ ధోని డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. కానీ మొదటి మ్యాచ్‌లో తొలి బంతికే అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని ఇన్నింగ్స్‌ల పాటు అంతగా ఆకట్టుకోలేకపోయిన ధోని 2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోని టీమిండియా తరపున వికెట్ కీపర్‌గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే 2007లో తొలి టీ20 ప్రపంచకప్‌కు ముందు ఎవరు ఊహించని విధంగా ద్రవిడ్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.
దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో ధోని భారత యువజట్టును ముందుండి నడిపించాడు. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన ధోని సేన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఇక్కడి నుంచి ధోని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు 2008, 2009లో ధోని వరుసగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. అప్పటివరకు వరుసగా రెండుసార్లు ఐసీసీ అవార్డును అందుకున్న ఆటగాడు ధోనినే కావడం విశేషం. అప్పటికే భారత విజయవంతమైన కెప్టెన్‌గా ముద్రపడిన ధోని 2011లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 79 బంతుల్లో 91 పరుగులు నాటౌట్‌గా నిలిచి ఒంటిచేత్తో భారత్‌కు కప్‌ను అందించాడు. ఇక మ్యాచ్‌లో విన్నింగ్ షాట్‌గా కొట్టిన సిక్సర్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికి గుర్తుండిపోయే ఘటన. ఇక ఆ తర్వాత రెండు సంవత్సరాలకు క్రికెట్ చరిత్రలో అప్పటివరకు ఎవరు సాధించని రికార్డును ధోని సాధించాడు. 2013లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలవడం ద్వారా క్రికెట్ చరిత్రలో అప్పటివరకు ఉన్న ఐసీసీ ట్రోపీలను సాధించిన ఏకైక కెప్టెన్‌గా నిలిచాడు.
కేవలం భారత జట్టు మాత్రమే కాకుండా ఐపీఎల్‌లోనూ ధోని తన సత్తా చాటాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కే కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని మూడుసార్లు టైటిల్‌ను అందించాడు. అటువంటి ధోని ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్‌గా విఫలం కావడంతో 2017 జనవరిలో వన్డే, టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పటినుంచి ధోని కెరీర్‌పై అనుమానాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే 2019 ప్రపంచకప్‌లో కివీస్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ధోని రనౌట్‌గా వెనుదిరగడంతో మొదటిసారి ధోని రిటైర్మెంట్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. యాదృశ్చికంగా ధోనికి అదే చివరి మ్యాచ్ కావడం విశేషం. ఇక 2020 ఆగస్టు 15న రాత్రి 7.29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్న ధోని క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. తన 16 ఏళ్ల కెరీర్‌లో అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా ప్రశంసలతో పాటు ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ధోని ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం.
ఇక ఆటగాడిగాను ధోని తనదైన ముద్ర వేశాడు. టీమిండియా తరపున 350 వన్డేల్లో 10773 పరుగులు, 90 టెస్టుల్లో 4876 పరుగులు, 98 టీ20ల్లో 1617 పరుగుల సాధించాడు. ఇందులో వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు సాధించాడు. ఇక వికెట్‌కీపర్‌గా సూపర్ సక్సెస్ సాధించిన ధోని మెరుపు స్టంపింగ్స్‌కు పెట్టింది పేరు. అన్ని ఫార్మాట్లు కలిపి 195 స్టంపింగ్స్ చేసిన ధోని వికెట్‌కీపర్‌గా 634 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇక బెస్ట్ ఫినిషర్‌గా పేరు పొందిన ధోని వన్డేల్లో 81 సార్లు నాటౌట్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. మరో 51 మ్యాచ్‌ల్లో టీమిండియా చేజింగ్ సమయంలో ధోని 49 సార్లు నాటౌట్‌గా నిలిచాడు. ఈ 49 సార్లు టీమిండియా విజయం సాధించడం విశేషం. భారత్ తరపున అన్ని ఫార్మాట్లు కలిపి ఎక్కువ మ్యాచ్‌లకు కెప్టెన్సీ నిర్వహించిన ఆటగాడిగా ధోని నిలిచాడు. ఓవరాల్‌గా 331 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా పనిచేసిన ధోని 178 విజయాలు అందుకున్నాడు. క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మెన్లలో ఐదో స్థానంలో కొనసాగుతున్న ధోని మొత్తంగా 359 సిక్స్‌లు కొట్టి చరిత్ర సృష్టించాడు.
- సాక్షి, వెబ్‌డెస్క్
Happy Birthday Mahendra Singh Dhoni Don't know how many world records in your name, who can forget Mauser Mahendra Singh Dhoni in the name of Captain Cool, you won the first T20 World Cup and won India 28 years bad World Cup, won the World Cup by hitting six Tha o moment we have pic.twitter.com/8elIePSTAW
— Rajveer singh Juni (@JuniRajveer) July 6, 2021
Happy birthday @msdhoni🎉💐
— ARGeditz (@Arg_editz) July 6, 2021
MSDIANS DAY ❤️#HappyBirthdayDhoni pic.twitter.com/AEcLWnHjJU
Comments
Please login to add a commentAdd a comment