Ravindra Jadeja follows Nathan Lyon on Instagram, says 'Following my friend for 24 hours' - Sakshi
Sakshi News home page

Jadeja-Lyon: ఆసీస్‌ స్పిన్నర్‌ను 24 గంటలు ఫాలో అయిన జడేజా

Published Mon, Feb 20 2023 10:45 AM | Last Updated on Mon, Feb 20 2023 11:22 AM

Intresting Jadeja Follow Australian Spinner Nathan Lyon Instagram 24-hrs - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ కనబరుస్తున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లో సూపర్‌ అనిపించుకుంటున్నాడు. రీఎంట్రీ తర్వాత ఏ క్రికెటర్‌ అయినా నిలదొక్కుకోవడానికి కాస్త సమయం తీసుకుంటాడు. కానీ జడేజా అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాడు. రీఎంట్రీకి ముందు వచ్చిన గ్యాప్‌ను కసిలా తీసుకున్న జడేజా అద్భుత రీతిలో రాణిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా తయారయ్యాడు.

ఇప్పుడు అతన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఒక సవాల్‌ అని చెప్పొచ్చు. నాగ్‌పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో అన్నీ తానై జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచిన జడ్డూ ఢిల్లీ టెస్టులోనూ అదే జోరును చూపించాడు. అయితే ఈసారి బ్యాటింగ్‌లో పెద్దగా మెరవకపోయినప్పటికి భారత్‌లో తాను ఎంత ప్రమాదకర స్పిన్నర్‌ అనేది ఆసీస్‌కు మరోసారి రుచి చూపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన జడేజా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆసీస్‌ బ్యాటర్ల బలహీనతను పసిగట్టిన జడ్డూ ఏడు వికెట్లతో వారి నడ్డి విరిచాడు. ఓవరాల్‌గా ఒక టెస్టులో పది వికెట్లు తన ఖాతాలో వేసుకొని వరుసగా రెండో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును కైవసం చేసుకున్నాడు.

మైదానంలో ఎంత చలాకీగా కనిపిస్తాడో బయట కూడా అంతే చురుకుగా ఉంటాడు. తానే ఏం చేసినా జడ్డూ దానిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో జడేజాకు ఐదు మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. అయితే జడ్డూ మాత్రం ఎవరిని ఫాలో అవ్వడం లేదు. కానీ తాజాగా మాత్రం జడేజా.. తనకు మంచి మిత్రుడైన ఆస్ట్రేలియన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియోన్‌ను 24 గంటల పాటు ఫాలో అవ్వడం ఆసక్తి కలిగించింది.

మరి లియోన్‌ను ఎందుకు ఫాలో​ అయ్యాడో తెలియదు కానీ.. తాను ఫాలో అయిన విషయాన్ని మాత్రం ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్‌ పెట్టి.. ''మై ఫ్రెండ్‌ లియోన్‌ను 24 గంటలు ఫాలో అయ్యా'' అంటూ.. క్యాప్షన్‌ జత చేశాడు. జడ్డూ పోస్ట్‌ టీమిండియా అభిమానులను అమితంగా ఆకట్టుకుంది. గ్రౌండ్‌లోనే అనుకున్నాం.. సోషల్‌ మీడియాలో కూడా ఆసీస్‌ క్రికెటర్లను నీడలా వెంటాడుతున్నావు ఎందుకు అంటూ ఫన్నీ కామెంట్స్‌ చేశారు. 

ఇక ఇరుజట్ల మధ్య మూడో టెస్టు ఇండోర్‌ వేదికగా మార్చి ఒకటి నుంచి జరగనుంది. చివరి రెండు టెస్టులకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. రంజీ ట్రోఫీలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న జైదేవ్‌ ఉనాద్కట్‌ను మిగతా రెండు టెస్టులతో పాటు వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఇక వరుసగా విఫలమవుతున్న కేఎల్‌ రాహుల్‌ను జట్టులో ఉంచినప్పటికి అతని వైస్‌ కెప్టెన్సీని మాత్రం తొలగించింది. దీనిని బట్టి రానున్న రోజ్లులో రాహుల్‌పై వేటు పడడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక రెండో టెస్టులో విజయంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడేందుకు మరింత చేరువైంది. మూడో టెస్టులోనూ టీమిండియా విజయం సాధిస్తే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అదే సమయంలో ఆసీస్‌ క్లీన్‌స్వీప్‌ అయితే మాత్రం వారికి డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆడే అవకాశం పోయినట్లే. అలా జరగకుండా ఉండాలంటే ఆసీస్‌ చివరి రెండు టెస్టులను కనీసం డ్రా అయినా చేసుకోవడానికి ప్రయత్నించాలి.

చదవండి: ఉన్నపళంగా స్వదేశానికి ఆసీస్‌ కెప్టెన్‌..

పిచ్‌పై నీలాపనిందలు.. ఆడడం చేతగాకనే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement