
Ashwin Is Not A Wicket Taker In T20 Format Says Sanjay Manjrekar : టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై వివాదాస్పద వ్యాఖ్యాత, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ టీ20 క్రికెట్‌కు అనర్హుడని, ఈ ఫార్మాట్‌లో అతనికి వికెట్లు తీసే సామర్ధ్యమే లేదని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో అశ్విన్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్‌ను అసలు జట్టులోకే తీసుకోనని వ్యాఖ్యానించాడు.
అశ్విన్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశామని, టీ20 బౌలర్‌గా అతను ఏ జట్టుకు కూడా ఉపయోగపడింది లేదని అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్‌లో అశ్విన్ బౌలింగ్ శైలి మారాలనుకుంటే అది జరిగేది కాదని, గత ఐదారేళ్లుగా అతను ప్రాతినిధ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టర్నింగ్ వికెట్లపై తాను వికెట్ టేకింగ్ బౌలర్లవైపే మొగ్గుచూపుతానని.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, చహల్ లాంటి వారు తన బెస్ట్ ఛాయిస్ బౌలర్లని వెల్లడించాడు.
సాంప్రదాయ టెస్ట్ ఫార్మాట్‌లో అశ్విన్ అద్భుతమైన బౌలరే అయినప్పటికీ.. పొట్టి ఫార్మాట్‌కు మాత్రం అస్సలు పనికిరాడని తెలిపాడు. ఓ ప్రముఖ క్రీడా ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ.. మంజ్రేకర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఐపీఎల్-2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్-2 పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడిన సంగతి తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరి ఓవర్ వేసిన అశ్విన్ తొలుత వరుస బంతుల్లో వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించినప్పటికీ.. ఐదో బంతికి కేకేఆర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు.
చదవండి: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి