
ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును సమం చేశాడు. ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఏకంగా 37 పరుగులు సమర్పించుకుని, 2011 సీజన్‌లో కొచ్చి టస్కర్స్ బౌలర్ ప్రశాంత్ పరమేశ్వరన్ 37 పరుగల చెత్త రికార్డును ఈక్వల్ చేశాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్‌ను(15 వికెట్లు) సొంతం చేసుకున్న హర్షల్ పటేల్.. ఈ మ్యాచ్‌లో మొదటి మూడు ఓవర్ల పాటు చాలా పొదుపుగా బౌలింగ్(14 పరుగలు) చేసి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు.
అయితే, ఆఖరి ఓవర్‌లో జడ్డూ విశ్వరూపం ప్రదర్శించడంతో హర్షల్ తేలిపోయాడు. జడేజా ధాటికి అతను 5 సిక్స్‌లు, ఒక ఫోర్, డబుల్ నోబాల్‌తో కలిపి ఏకంగా 37 పరుగులు సమర్పించుకున్నాడు. గతంలో క్రిస్ గేల్ ధాటికి పరమేశ్వరన్ కూడా ఒకే ఓవర్‌లో 37 పరుగుల సమర్పించుకున్నాడు. పరమేశ్వరన్ బౌలింగ్‌లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లు బాది 36 పరుగులు పిండుకున్నాడు. ఇందులో ఒక నోబాల్ ఉంది.
ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ల జాబితాలో వీరి తర్వాత స్థానాల్లో పంజాబ్ బౌలర్ పర్వీందర్ ఆవానా(33 పరుగులు), పంజాబ్ బౌలర్ రవి బొపారా(33 పరుగులు) ఉన్నారు. ఆవానా బౌలింగ్‌లో చెన్నై ఆటగాడు రైనా 2 సిక్సర్లు, 5 ఫోర్లు, ఓ నోబాల్ కలిపి 33 పరుగుల రాబట్టగా, బొపారా బౌలింగ్‌లో గేల్ 4 సిక్సర్లు, 7 వైడ్లు, 2 సింగల్స్‌తో కలిపి 33 పరుగులు పిండుకున్నాడు.
చదవండి: భజ్జీ.. సెలబ్రిటీలకు మాత్రమే రిప్లై ఇస్తావా?
Comments
Please login to add a commentAdd a comment