ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్‌కు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా సీఎస్‌కే గెలుపును ఖాతాలో వేసుకుంది. మొయిన్ అలీ (3/7), కరాన్ (2/24), జడేజా (2/28), బ్రేవో (1/28), శార్ధూల్ (1/20) దెబ్బకు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు మాత్రమే చేసిన రాజస్థాన్ పరాజయం పాలైంది. 189 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్థాన్ చతికిలబడింది. మాస్టర్ కెప్టెన్ ధోని గేమ్ ప్లానింగ్ ముందు తలవంచింది.
మ్యాచ్ తర్వాత విన్నింగ్ కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ.. దీపక్ చహర్, సామ్ కరాన్‌ల పేస్ బౌలింగ్ మరొకసారి ఆకట్టుకుందన్నాడు. ఇక ఫీల్డింగ్ వ్యూహాలకు పదును పెడుతూ పదే పదే బౌలర్లను మార్చిన ప్రయోగాలపై అడిగిన ప్రశ్నకు ధోని బదులిస్తూ.. ‘ నేను ఎప్పుడూ ఏ సమయంలో ఏది మంచి అనిపిస్తే దాని కోసమే ప్రయత్నిస్తా. ఎప్పూడూ నా దృష్టి అంతా గేమ్‌పై ఫోకస్ చేయడంపైనే ఉంటుంది. ఏది మంచి అనిపిస్తే అది చేస్తా. మా పేసర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఇదే గేమ్‌లో ముఖ్యం. సామ్ కరాన్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. జోస్ బట్లర్ రివర్స్ షాట్ ఆడతాడనే విషయం నా మైండ్‌లో లేదు.
ఆరో బౌలర్ ఆప్షన్ ఉండటం ఎప్పుడూ జట్టుకు మంచిదే. అది ఎప్పుడూ ఉపయోగపడుతూ ఉంటుంది. ఈసారి ఇక్కడ డ్యూ పెద్దగా కనిపించలేదు. మేము ఇంకా స్కోరు చేస్తామనుకున్నాం. బోర్డుపై సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు ఉంచాలనుకున్నాం. మా క్యాంప్‌లో వాతావరణం బాగుంది. గత ఏడాది నేర్చుకున్న పాఠాలతో మా బౌలర్లు ఈ వికెట్‌పై బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనం మెరుగ్గా ఆడుతున్నప్పుడు ఏ ఒక్కరూ నువ్వు అన్‌ఫిట్ అని చెప్పరు’ అని ధోని పేర్కొన్నాడు.
ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్న మొయిన్ అలీ మాట్లాడుతూ.. ఇక్కడ తన కర్తవ్యం పరుగులు చేయడం, జట్టుకు మంచి ఆరంభాన్ని ఇవ్వడమేనన్నాడు. తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోట్ అయి వచ్చినప్పుడు ఇక్కడ వికెట్ అంత ఈజీగా లేదన్నాడు. ఇది సమష్టి విజయమని మొయిన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment