ముంబై ఇండియన్స్ ఆటగాడు హార్దిక్ పాండ్యా(ఫొటో కర్టెసీ: పీటీఐ/బీసీసీఐ)
చెన్నై: భుజం నొప్పి కారణంగానే తమ జట్టు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయాడని ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రిస్‌లిన్ అన్నాడు. బ్యాట్స్‌మెన్‌గా తన సేవలు జట్టుకు ఎంతో ముఖ్యమని, బౌలింగ్ చేసే క్రమంలో నొప్పి ఎక్కువైతే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పూర్తిగా కోలుకున్న తర్వాత బంతితో మ్యాజిక్ చేయగలడని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎన్నో అంచనాల నడుమ ఐపీఎల్-2021 బరిలో దిగిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లోనే అభిమానులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. రెండు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై ఆటగాళ్లలో క్రిస్ లిన్(49) మినహా మిగతా వాళ్లెవరూ రాణించకపోవడంతో స్వల్ప స్కోరుకే పరిమితమై కోహ్లి సేనకు మ్యాచ్ సమర్పించుకుంది.
ఇక సమన్వయ లోపం కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మ రనౌట్ కావడం, స్టార్ ప్లేయర్‌గా పేరొందిన హార్దిక్ పాండ్యా కూడా త్వరగానే పెవిలియన్ చేరడంతో భారీ మూల్యమే చెల్లించింది. కాగా ఈ మ్యాచ్ నేపథ్యంలో క్రిస్ లిన్ మాట్లాడుతూ.. ‘‘హార్దిక్‌కు భుజం నొప్పి ఉన్న కారణంగానే బౌలింగ్ సేవలు వినియోగించులేకపోయాం. ఈరోజు మ్యాచ్‌లో మేం ఆరో బౌలర్‌ను మిస్ కావచ్చు. ఆరంభ మ్యాచ్‌లో హార్దిక్ బౌలింగ్ చేయడం కుదరకపోవచ్చు. కానీ టోర్నీ మొత్తం తను దాదాపు 14 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. తను కోలుకున్నట్లయితే మాకు అదనపు బలం చేకూరుతుంది. తను బంతితోనూ, బ్యాట్‌తోనూ అద్భుతం చేయగలడని నేను విశ్వసిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్‌ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
Comments
Please login to add a commentAdd a comment