న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో అతలాకుతలం అవుతోన్న భారత్‌కు సహాయం చేసేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్న క్రికెటర్లు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్, మాజీ ప్లేయర్ బ్రెట్‌లీలు తమ వంతుగా ఆర్థిక సాయం ప్రకటించగా... ఇప్పుడు ఆ జాబితాలోకి భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, జైదేవ్ ఉనాద్కట్‌లతో పాటు వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ కూడా చేరాడు. ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లను కొనుగోలు చేసేందుకు ఆక్సిజన్ ఇండియా అనే ఒక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్‌జీవో)కు ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ రూ. 20 లక్షలు అందజేశాడు.
దాంతో పాటు ఐపీఎల్‌లో తాను గెల్చుకొనే ప్రైజ్‌మనీని కూడా అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ధావన్ ప్రకటించాడు. రెండు రోజుల క్రితం సచిన్ టెండూల్కర్ కూడా ఇదే సంస్థకు రూ. కోటిని విరాళంగా ఇచ్చాడు. వైద్య పరికరాలు కొనుగోలు చేసేందుకు తన ఐపీఎల్ జీతం నుంచి 10 శాతాన్ని అందజేస్తున్నట్లు ఉనాద్కట్ ప్రకటించాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ వేలంలో అతడిని రాజస్తాన్ రాయల్స్ రూ. 3 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ లెక్కన అతడి విరాళం రూ. 30 లక్షలు. పంజాబ్ కింగ్స్ ఆటగాడు నికోలస్ పూరన్ (వెస్టిండీస్) కూడా తనకు ఐపీఎల్ ద్వారా లభించే వేతనంలో నుంచి కొంత భాగాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.
చదవండి: కరోనా కల్లోలం: సచిన్, ఐపీఎల్ జట్ల విరాళాలు ఎంతంటే!
Comments
Please login to add a commentAdd a comment