తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్‌ మెరుపులు.. గబ్బర్‌ గర్జన.. సంజూ శతక్కొట్టుడు | IPL 2021: Top Run Scorers, Wicket Takers Of First Half Season | Sakshi
Sakshi News home page

IPL 2021: తొలి భాగం మొత్తం వీళ్లదే.. రాహుల్‌ మెరుపులు.. గబ్బర్‌ గర్జన.. సంజూ శతక్కొట్టుడు

Published Sun, Sep 19 2021 1:31 PM | Last Updated on Sun, Sep 19 2021 3:15 PM

IPL 2021: Top Run Scorers, Wicket Takers Of First Half Season - Sakshi

Recap Of First Half IPL 2021: క్రికెట్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్‌-2021 రెండో అంచె నేటి నుంచి ప్రారంభం కానుంది. కోవిడ్‌ కారణంగా ఆకస్మికంగా వాయిదా పడిన క్యాష్‌ రిచ్‌ లీగ్‌.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య జరిగే మ్యాచ్‌తో పునః ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్‌ మొదటి దశలో చాలా మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. బౌలర్లపై బ్యాట్స్‌మెన్లు పూర్తి ఆధిపత్యం చలాయించారు. భారీ సంఖ్యలో ఫోర్లు, సిక్సర్లు నమోదవ్వడంతో పరుగుల వరద పారింది. కొన్ని మ్యాచ్‌ల్లో బౌలర్లు సైతం ప్రతాపం చూపినప్పటికీ వారి ప్రభావం నామమాత్రమే. సీజన్‌ తొలి దశలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. టీమిండియా బ్యాట్స్‌మెన్లు పరుగుల వరద పారించారు. ముఖ్యంగా శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌ ఆకాశమే హద్దుగా చెలరేగారు. 

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గబ్బర్‌.. ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్‌ల్లో 54.28 సగటుతో 380 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుత సీజన్‌లో అత్యధిక ఫోర్ల (43) రికార్డు కూడా ధవన్‌ పేరిటే ఉంది.  ఈ సీజన్‌లో ఇప్పటివరకు 3 హాఫ్‌ సెంచరీలు నమోదు చేసిన ధవన్‌.. ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 92 పరుగులు చేశాడు. తొలి దశలో గర్జించిన గబ్బర్‌.. రెండో దశలో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
చదవండి: IPL 2021: జోరు మీదున్న ధోని.. సీఎస్‌కే ప్రతీకారం తీర్చుకుంటుందా?

మరోవైపు తొలిదశ ఐపీఎల్‌-2021లో టీమిండియా మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ సైతం మెరుపులు మెరిపించాడు. పంజాబ్‌ కింగ్స్ కెప్టెన్‌గా ఆశించిన మేరకు ప్రభావం చూపనప్పటికీ.. వ్యక్తిగతంగా రాణించాడు. ఈ సీజన్‌లో రాహుల్‌ సారధ్యంలో పంజాబ్‌ 8 మ్యాచ్‌ల్లో మూడింటిలో మాత్రమే నెగ్గింది. అయినా బ్యాట్స్‌మెన్‌గా రాహుల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 7 మ్యాచ్‌ల్లో 66.20 సగటుతో 331 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు (16), అత్యధిక అర్ధ సెంచరీ(4)ల రికార్డులు కూడా రాహుల్‌ పేరిటే నమోదై ఉన్నాయి. కాగా, టీమిండియా టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్న రాహుల్‌ రెండో దశలోనూ రాణించి.. జట్టును విజయాల బాట పట్టించాలని పంజాబ్‌ కింగ్స్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

వీరిద్దరితో పాటు చెన్నై సూపర్‌ కింగ్స్ ఆటగాడు డుప్లెసిస్‌( 7 మ్యాచ్‌ల్లో 64 సగటుతో 320 పరుగులు, 4 హాఫ్‌ సెంచరీలు), మరో ఢిల్లీ ఆటగాడు పృథ్వీ షా(8 మ్యాచ్‌ల్లో 38.50 సగటుతో 308 పరుగులు, 3 అర్ధ శతకాలు), రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌(7 మ్యాచ్‌ల్లో 46.16 సగటు, 145.78 స్ట్రయిక్‌ రేట్‌తో 277 పరుగులు, సెంచరీ), మరో రాజస్థాన్‌ ఆటగాడు జోస్‌ బట్లర్‌(7 మ్యాచ్‌ల్లో 36. 29 సగటు, 153.01 స్ట్రయిక్‌ రేట్‌తో 254 పరుగులు, సెంచరీ), రాయల్‌ ఛాలెంజర్స్‌ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌(6 మ్యాచ్‌ల్లో 39 సగటు, 152.34 స్ట్రయిక్‌ రేట్‌తో 195 పరుగులు, సెంచరీ)  జోరును ప్రదర్శించారు.

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే.. ఆర్సీబీ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌ సీజన్‌ మొత్తానికే హైలైట్‌గా నిలిచాడు. 7 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టి సీజన్‌ టాప్‌ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో ఓసారి ఐదు వికెట్ల ప్రదర్శన(5/27) కూడా ఉంది. హర్షల్‌ తర్వాత చెప్పుకోదగ్గ బౌలింగ్‌ ప్రదర్శనల్లో ఆవేశ్‌ ఖాన్‌(8 మ్యాచ్‌ల్లో 14), క్రిస్‌ మోరిస్‌(7 మ్యాచ్‌ల్లో 14) ఉన్నారు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌(5/15) సీజన్‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
చదవండి: ఆ మూడు బాదితే రోహిత్‌ ఖాతాలో మరో రికార్డు..
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement