IPL 2021: 5 Top Most Dismissals By A Wicket-Keeper In IPL History, MS Dhoni, Dinesh Karthik - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌ చరిత్రలో ఈ వికెట్‌ కీపర్లు ప్రత్యేకం

Published Sat, Apr 3 2021 5:30 PM | Last Updated on Sat, Apr 3 2021 8:11 PM

IPL 2021: Top 5 WicketKeepers In IPL History - Sakshi

క్రికెట్‌ మ్యాచ్‌లు గెలవాలంటే వికెట్‌ కీపర్ల పాత్ర ప్రధానమైనది. కీపర్‌ అనేవాడు ఏ తప్పిదం చేసినా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తమ కీపింగ్‌కు సానబెడుతూ ఉంటారు వికెట్‌ కీపర్లు. ఒకవేళ కీపర్‌గా విఫలమైతే అతను మంచి బ్యాట్స్‌మన్‌ అయినా కూడా జట్టులో చోటు దక్కడం కష్టమై పోతుంది. ఇక్కడ కీపింగ్‌లో తనదైన ముద్ర వేసిన ఎంఎస్‌ ధోని..  ఐపీఎల్‌ చరిత్రలో బెస్ట్‌ కీపర్లలో ఒకడు.  బ్యాటింగ్‌తో పాటు.. బెస్ట్ వికెట్ కీపర్‌గానూ సీఎస్‌కేకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. వికెట్ల వెనుక ఉండి బౌలర్లకు సంకేతాలిస్తూ ఎన్నో కీలక సమయాల్లో క్రీజును అంటిపెట్టుకుని నిలబడ్డ దిగ్గజ బ్యాట్స్‌మెన్లను సైతం తన అద్బుతమైన డిస్మిసల్స్‌తో పెవిలియన్ బాట పట్టించిన ఘటన ధోని సొంతం. ఐపీఎల్‌-14వ సీజన్‌ ప్రారంభం కానున్న తరుణంలో టాప్‌-5 వికెట్‌ కీపర్ల గురించి ఒకసారి చూద్దాం. 

ఎంఎస్‌ ధోని
ఐపీఎల్‌ చరిత్రలో బెస్ట్‌ కీపర్ల రేసులో ధోని ముందు వరుసలో ఉన్నాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో 148 డిస్మిసల్స్‌లో ధోని భాగమయ్యాడు. ఫలితంగా ఐపీఎల్‌లో అత్యధిక మందిని పెవిలియన్‌కు పంపిన వికెట్‌ కీపర్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఈ 148 డిస్మిసల్స్‌లో 109 క్యాచ్‌ల రూపంలో రాగా, 39 స్టంపింగ్స్‌ ద్వారా వచ్చాయి. 2008 నుంచి సీఎస్‌కేకు అటు కెప్టెన్‌గా ఇటు కీపర్‌గా సేవలందిస్తున్న ధోని ఒక ప్రత్యేకమైన వికెట్‌ కీపర్‌గా కొనసాగుతున్నాడు.   

దినేశ్‌ కార్తీక్‌
ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యంత అనుభవం ఉన్న వికెట్‌ కీపర్లలో దినేశ్‌ కార్తీక్‌ ఒకడు. తన ఐపీఎల్‌ కెరీర్‌లో 196 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్‌.. 140 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఇందులో 110 క్యాచ్‌లు, 30 స్టంపింగ్స్‌ ఉన్నాయి. ఫలితంగా రెండో స్థానాన్ని ఆక్రమించాడు.  కాగా, ఈ టోర్నమెంట్‌ చరిత్రలో అత్యధిక మందిని క్యాచ్‌ల ద్వారా జాబితాలో మాత్రం కార్తీక్‌ ముందు వరుసలో ఉన్నాడు. ఇక్కడ ధోని కంటే కార్తీక్‌ ఒక క్యాచ్‌ అధికంగా పట్టుకోవడం ద్వారా తొలిస్థానంలో నిలిచాడు. గత ఐపీఎల్‌ సీజన్‌ మధ్యలోనే కేకేఆర్‌ కెప్టెన్సీ పగ్గాలను కార్తీక్‌ వదిలేసుకున్నాడు. కీపింగ్‌, బ్యాటింగ్‌పై దృష్టి పెట్టే క్రమంలో ఇయాన్‌ మోర్గాన్‌కు కెప్టెన్సీ బాధ్యతల్ని వదిలేశాడు. ఇది కేకేఆర్‌ యాజమాన్యం తీసుకున్న నిర్ణయమే అయినా అది సమంజసమేనని భావించిన కార్తీక్‌.. ఆ విషయాన్ని పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. 

రాబిన్‌ ఊతప్ప
ఎన్నో ఫ్రాంచైజీలు మారుతూ వస్తున్న రాబిన్‌ ఊతప్ప.. ఈ సీజన్‌లో సీఎస్‌కేకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ధోనికి మంచి స్నేహితుడైన ఊతప్ప..సీఎస్‌కేతో ఆడటాన్ని కచ్చితంగా ఆస్వాదిస్తాడు. కాగా, వికెట్‌ కీపర్‌గా రాబిన్‌ ఊతప్పకు మంచి రికార్డే ఉంది. ఊతప్ప రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ కాకపోయినప్పటికీ తన కీపింగ్‌ స్కిల్స్‌తో ఆకట్టుకుంటూనే ఉంటాడు. ఇలా ఐపీఎల్‌ చరిత్రలో 90 డిస్మిసల్స్‌లో ఊతప్ప భాగమయ్యాడు. ఇందులో 58 క్యాచ్‌లు, 32 స్టంపింగ్స్‌ ఉన్నాయి. స్టంపింగ్స్‌ విషయంలో ధోని తర్వాత స్థానం ఊతప్పదే కావడం విశేషం. ఈ సీజన్‌లో ఊతప్పకు కీపింగ్‌ చేసే అవకాశం దాదాపు రాకపోవచ్చు. సీఎస్‌కేకు రెగ్యులర్‌ కీపర్‌గా ధోని ఉండటంతో ఊతప్ప బ్యాటింగ్‌కు పరిమితం కానున్నాడు.   

పార్థివ్‌ పటేల్‌
గత ఏడాది అన్ని ఫార్మాట్లకు గుడ్‌ బై చెప్పేశాడు పార్థీవ్‌ పటేల్‌. 2020 సీజన్‌లో ఆర్సీబీ తరుఫున జట్టులో కొనసాగినా అతనికి ఒక్క గేమ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. ఓవరాల్‌గా ఆరు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు పార్థివ్‌. కాగా, లీగ్‌ చరిత్రలో 81 డిస్మిసల్స్‌లో భాగమయ్యాడు. ఇందులో 65 క్యాచ్‌లు ఉండగా 16 స్టంపింగ్స్‌ ఉ‍న్నాయి. 

వృద్ధిమాన్‌ సాహా
ఇప్పటికీ టీమిండియా జట్టులో ఆడపా దడపా అవకాశాలు అందుకుంటూ మెరుస్తున్న వికెట్‌ కీపర్లలో సాహా ఒకడు. రిషభ్‌ పంత్‌ రాకతో సాహా ప్రాధాన్యత తగ్గినా అవకాశం వచ్చినప్పుడు జట్టుకు ఉపయోగపడుతునే ఉన్నాడు. బ్యాట్స్‌మన్‌గా కంటే వికెట్‌ కీపర్‌గా సాహాది ప్రత్యేక స్థానం. అవలీలగా డైవ్‌లు కొట్టి క్యాచ్‌లను అందుకోవడంలో సాహా దిట్ట. ఒక ఐపీఎల్‌ చరిత్రలో గ్లోవ్స్‌తో మెరుస్తూనే ఉన్నాడు సాహా. ఇప్పటివరకూ 76 డిస్మిసల్స్‌లో భాగమైన సాహా.. 56 క్యాచ్‌లను అందుకున్నాడు. మిగతా 20 స్టంపింగ్స్‌ చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆడగాడైన సాహా.. గతేడాది ఆ జట్టులో అటు కీపింగ్‌తో పాటు బ్యాట్‌తో కూడా మెరిశాడు.

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ చరిత్రలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్స్‌ 

చాంపియన్స్‌ వీరే.. మరి ఈసారి ఎవరో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement