IPL 2022 Auction: SRH Responds on David Warner Doubts Hope You Have Good Time - Sakshi
Sakshi News home page

IPL 2022 Auction: నువ్వు మంచి ధర పలుకుతావులే.. వార్నర్‌పై సన్‌రైజర్స్‌ ట్వీట్‌ వైరల్‌

Published Wed, Dec 29 2021 2:27 PM | Last Updated on Wed, Dec 29 2021 2:56 PM

IPL 2022 Auction: SRH Responds On David Warner Doubts Hope You Have Good Time - Sakshi

PC: IPL/BCCI

IPL 2022 Auction- SRH Tweet On David Warner Goes Viral: ఆస్ట్రేలియా ఆటగాడు, తమ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను ఉద్దేశించి ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆసక్తికర ట్వీట్‌ చేసింది. యాషెస్‌ సిరీస్‌లో అతడి ప్రతిభను కొనియాడుతూనే.. మెగా వేలం గురించి ప్రస్తావించింది. కాగా ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో రెండు టెస్టులు మిగిలి ఉండగానే.. ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి ఆసీస్‌ ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

మొదటి మూడు టెస్టుల్లోనూ ఏకపక్ష విజయాలు సాధించి స్వదేశంలో తమకు తిరుగులేదని మరోసారి నిరూపించుకుంది. ఇక ఈ విజయంలో వార్నర్‌ తన వంతు పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా... ఎస్‌ఆర్‌హెచ్‌ ఇటీవల తమ కొత్త సిబ్బంది వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టామ్‌ మూడీ మరోసారి హెడ్‌కోచ్‌గా నియమితుడయ్యాడు. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ టామ్‌ మూడీని ఉద్దేశించి... ‘‘ఈసారి వేలంలో మంచి టీమ్‌ను ఎంచుకుంటారా టామ్‌’’అని ప్రశ్నించాడు.

ఇందుకు స్పందించిన వార్నర్‌... ‘‘అనుమానమే’’ అంటూ కామెంట్‌ చేశాడు. ఇక వార్నర్‌ ట్వీట్‌కు బదులిచ్చిన ఎస్‌ఆర్‌హెచ్‌... ‘‘యాషెష్‌ సిరీస్‌ గెలిచినందుకు కంగ్రాట్స్‌ డేవీ... మంచి ఫామ్‌లోకి వచ్చావు కదా... విజయం తర్వాత పార్టీ చేసుకుని ఉంటావు! మరో విషయం.. మెగా వేలంలో నువ్వు మంచి ధర పలుకుతావులే’’ అని పేర్కొంది. కాగా ఐపీఎల్‌-2021 సీజన్‌ వార్నర్‌కు చేదు అనుభవం మిగిల్చిన విషయం విదితమే. వార్నర్‌ను తొలుత కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత తుది జట్టులో కూడా చోటు కల్పించలేదు.

ఫామ్‌లేమి కారణంగా అతడిని పక్కనపెట్టింది. అంతేగాక ఐపీఎల్‌-2022 మెగా వేలం నేపథ్యంలో అతడిని రీటైన్‌ చేసుకోలేదు. దీంతో వార్నర్‌ వేలంలోకి రానున్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్‌-2021 టోర్నీతో పూర్తి ఫామ్‌లోకి వచ్చిన వార్నర్‌.. ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. యాషెస్‌ సిరీస్‌లో మెరుగ్గా రాణించాడు. ఈ నేపథ్యంలో అతడిని ఉద్దేశించి ఎస్‌ఆర్‌హెచ్‌ ఈ మేరకు ట్వీట్‌ చేయడం గమనార్హం. నెటిజన్లను ఆకర్షిస్తున్న ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. ఇక ఆరెంజ్‌ఆర్మీ అభిమానులైతే పరిస్థితులు చక్కబడి డేవిడ్‌ భాయ్‌ను ఎస్‌ఆర్‌హెచ్‌ వేలంలో సొంతం చేసుకుంటే ఎంత బాగుంటుందో అని కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: IPL 2022- Ambati Rayudu : "నాకు ఐపీఎల్‌లో ఆ జట్టుకు ఆడాలి అని ఉంది"


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement