Photo Courtesy: IPL
Adam Milne Ruled Out Of IPL 2022 Says Reports: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు ఐపీఎల్ 2022 సీజన్ ఏ మాత్రం కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో (6 మ్యాచ్‌ల్లో 5 ఓటములు) సతమతమవుతూ పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైన ఆ జట్టును గాయాల బెడద పట్టిపీడిస్తుంది. ఇప్పటికే 14 కోట్లు పోసి కొనుక్కున్న స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ సీజన్ మొత్తానికి దూరం కాగా, తాజాగా విదేశీ (న్యూజిలాండ్) పేసర్ ఆడమ్ మిల్నే కూడా చాహర్ బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. మోకాలి గాయం కారణంగా మిల్నే కూడా సీజన్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.
ఈ సీజన్‌లో కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన మిల్నే.. రెండో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డాడు. స్కానింగ్‌లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలడంతో మిల్నేను రెండు వారాల విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్లు సూచించారు. గాయం తీవ్రతపై తాజాగా మరోసారి పరీక్షలు నిర్వహించిన వైద్యులు మిల్నే కోలుకోవడానికి మరికొన్ని వారాల సమయం పట్టవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం ఏదో మిరకిల్ జరిగితే తప్ప సీఎస్‌కే లీగ్ దశ దాటి ముందుకెళ్లడం దాదాపుగా అసంభవం. దీంతో ఆడమ్ మిల్నే సీజన్ మొత్తానికే దూరం కావడం ఖాయంగా తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది మెగా వేలంలో మిల్నేను సీఎస్‌కే 1.9 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే సీఎస్‌కే ఏప్రిల్ 21న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్‌లో ముంబై పరిస్థితి సీఎస్‌కేతో పోల్చుకుంటే మరీ దారుణంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది.
చదవండి: అమితుమీ తేల్చుకోనున్న లక్నో, ఆర్సీబీ.. బలాబలాలు ఎలా ఉన్నాయంటే...?
Comments
Please login to add a commentAdd a comment