IPL 2022: Delhi Capitals Beat Rajasthan Royals By 8 Wickets - Sakshi
Sakshi News home page

IPL 2022: ఢిల్లీ ఆశలు పదిలం

Published Thu, May 12 2022 1:40 AM | Last Updated on Thu, May 12 2022 8:51 AM

IPL 2022: Delhi Capitals beat Rajasthan Royals by eight wickets - Sakshi

ముంబై: సీజన్‌లో ఒక విజయం తర్వాత ఒక పరాజయం... గత పది మ్యాచ్‌లలో ఇలాగే పడుతూ, లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ అదే శైలిని కొనసాగించింది! తాజా ఫలితం అనంతరం సరిగ్గా సగం మ్యాచ్‌లలో విజయం, సగం పరాజయాలతో ఆ జట్టు ఇంకా ప్లే ఆఫ్స్‌ ఆశలు పదిలంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన పోరులో క్యాపిటల్స్‌ 8 వికెట్లతో రాజస్తాన్‌ రాయల్స్‌పై నెగ్గింది. ముందుగా రాజస్తాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులు చేసింది.

అశ్విన్‌ (38 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా, దేవదత్‌ పడిక్కల్‌ (30 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిచెల్‌ మార్ష్‌ (62 బంతుల్లో 89; 5 ఫోర్లు, 7 సిక్స్‌లు), డేవిడ్‌ వార్నర్‌ (41 బంతుల్లో 52 నాటౌట్‌; 5 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలు సాధించారు. వీరిద్దరు రెండో వికెట్‌కు 144 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.  

రాణించిన పడిక్కల్‌...
ప్రమాదకర బ్యాటర్‌ బట్లర్‌ (7)ను అవుట్‌ చేసి సకరియా ఢిల్లీకి శుభారంభం అందించగా, యశస్వి జైస్వాల్‌ (19) కూడా ఎక్కువసేపు నిలవలేదు. అయితే అనూహ్యంగా మూడో స్థానంలో వచ్చిన అశ్విన్‌ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. శార్దుల్‌ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అతను, అక్షర్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరో ఎండ్‌లో పడిక్కల్‌ కూడా ధాటిని ప్రదర్శించాడు. అక్షర్‌ ఓవర్లో వరుస బంతుల్లో అతను రెండు సిక్సర్లు కొట్టాడు. 37 బంతుల్లో అశ్విన్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఐపీఎల్‌ సహా టి20 క్రికెట్‌లో అతనికి ఇదే తొలి హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. మూడో వికెట్‌కు పడిక్కల్‌తో 36 బంతుల్లో 53 పరుగులు జోడించిన అనంతరం అశ్విన్‌ వెనుదిరగ్గా...  సామ్సన్‌ (6), పరాగ్‌ (9) విఫలమయ్యారు.   

శతక భాగస్వామ్యం...
కేఎస్‌ భరత్‌ (0) మరోసారి విఫలమవ్వగా... వార్నర్, మార్ష్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోరు 38 పరుగులకు చేరింది. మార్ష్‌ దూకుడు కనబర్చగా, వార్నర్‌  నెమ్మదిగా ఆడాడు. కుల్దీప్‌ సేన్‌ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన మా చహల్‌ ఓవర్లో మరో భారీ సిక్స్‌తో 38 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 79 బంతుల్లో 100 పరుగుల భాగస్వామ్యం నమో దైంది. వేగంగా ఆడుతూ సెంచరీ దిశగా దూసుకుపోయిన మార్ష్‌ ఆ అవకాశం చేజార్చుకున్నాడు. 18 బంతుల్లో 17 పరుగులు చేయాల్సిన స్థితిలో మా అవుటయ్యాడు. వార్నర్, పంత్‌ (13 నాటౌ ట్‌; 2 సిక్స్‌లు) కలిసి మిగతా పనిని పూర్తి చేశారు.

స్కోరు వివరాలు  
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) లలిత్‌ (బి) మార్ష్‌ 19; బట్లర్‌ (సి) శార్దుల్‌ (బి) సకరియా 7; అశ్విన్‌ (సి) వార్నర్‌ (బి) మార్ష్‌ 50; పడిక్కల్‌ (సి) (సబ్‌) నాగర్‌కోటి (బి) నోర్జే 48; సామ్సన్‌ (సి) శార్దుల్‌ (బి) నోర్జే 6; పరాగ్‌ (సి) పావెల్‌ (బి) సకరియా 9; డసెన్‌ (నాటౌట్‌) 12; బౌల్ట్‌ (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160.
వికెట్ల పతనం: 1–11, 2–54, 3–107, 4–125, 5–142, 6–146.
బౌలింగ్‌: సకరియా 4–0–23–2, నోర్జే 4–0–39–2, శార్దుల్‌ 4–0–27–0, అక్షర్‌ 2–0–25–0, మా 3–0–25–2, కుల్దీప్‌ 3–0–20–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: భరత్‌ (సి) సామ్సన్‌ (బి) బౌల్ట్‌ 0; వార్నర్‌ 52 (నాటౌట్‌); మార్ష్‌ (సి) కుల్దీప్‌ సేన్‌ (బి) చహల్‌ 89; పంత్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18.1 ఓవర్లలో 2 వికెట్లకు) 161.
వికెట్ల పతనం: 1–0, 2–144.
బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0–32–1, ప్రసిధ్‌ 3–1–20–0, అశ్విన్‌ 4–0–32–0, కుల్దీప్‌ సేన్‌ 3.1–0–32–0, చహల్‌ 4–0–43–1.

ఐపీఎల్‌లో నేడు
ముంబై ఇండియన్స్‌ X చెన్నై సూపర్‌ కింగ్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement