Mitchell Marsh: ఐపీఎల్-2023లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 29 రాత్రి 7:30 గంటలకు) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఈ ఆసీస్ స్పీడ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ తొలుత బంతి (4-1-27-4)తో, ఆతర్వాత బ్యాట్ (39 బంతుల్లో 63; ఫోర్, 6 సిక్సర్లు)తో వీరవిహారం చేసినప్పటికీ.. అతని జట్టు మాత్రం విజయం సాధించలేకపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యానికి 10 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఢిల్లీ ఓడినప్పటికీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీసినందుకు మార్ష్‌కే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
ఫ్రాంచైజీలకతీతంగా మార్ష్ ప్రదర్శనపై మనసు పారేసుకున్న అభిమానులు అతన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. మార్ష్ నామస్మరణతో ట్విటర్ మార్మోగిపోతుంది. ఆల్‌రౌండర్ అంటే ఇలా ఉండాలి (ఆడాలి).. ఇలాంటి వాడు జట్టుకు ఒక్కడుంటే చాలు.. ఓడినా ఢిల్లీనే గెలిచింది అంటూ కామెంట్లు చేస్తూ మార్ష్‌ను ఆకాశానికెత్తుతున్నారు. క్రికెట్ ప్రపంచం చాలామంది ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లను చూసింది, కానీ ఇలాంటి నిఖార్సైన ఆల్‌రౌండ్ ప్రదర్శన చూడటం ఇదే మొదటిసారని కొనియాడుతున్నారు.
నిప్పులు చెరిగే వేగం, బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల సామర్థ్యం, పేస్‌లో వేరియేషన్స్.. ఇలా స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్‌కు ఇండాల్సిన లక్షణాలన్నీ మార్ష్ బౌలింగ్‌లో చూశామని, అలాగే పర్ఫెక్ట్ టీ20 బ్యాటర్‌కు ఉండాల్సిన క్వాలిటీస్ ఇవేనని (పవర్ హిట్టింగ్, ఐ కాంటాక్ట్, చెత్త బంతులను అంచనా వేయడం) మార్ష్ నిన్నటి ఇన్నింగ్స్‌లో చూపెట్టాడని చర్చించుకుంటున్నారు. ఢిల్లీ ఓడినా పర్లేదని, అసలుసిసలు ఆల్‌రౌండ్ ప్రదర్శన చూసే అవకాశం దక్కిందని అంటున్నారు.
తన జట్టును గెలిపించేందుకు మార్ష్ చేయాల్సిదంతా చేశాడని, జట్టులో ఇతర సభ్యుల సహకారం లేకపోవడం వల్ల, అలాగే ఛేదన సమయంలో పిచ్ నెమ్మదించడం వల్ల ఢిల్లీ ఓడిందని అభిప్రాయపడుతున్నారు. ఇన్ ఫామ్ బ్యాటర్ అక్షర్ పటేల్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు పంపకపోవడం వల్ల డీసీ తగిన మూల్యం చెల్లించుకుందని, సాల్ట్ అద్భుతంగా ఆడాడని అంటున్నారు.
ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌ను నిర్మించిన తీరు అద్భుతమని, అభిషేక్ శర్మ (36 బంతుల్లో 67; 12 ఫోర్లు, సిక్స్), క్లాసెన్ (27 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోరుల, 4 సిక్సర్లు) అత్యుత్తమ ఇన్నింగ్స్‌లు ఆడారని ప్రశంసిస్తున్నారు. సన్‌రైజర్స్ స్పిన్నర్ మయాంక్ మార్కండే (4-0-20-2).. జోరుమీద ఉన్న ఫిల్ సాల్ట్ (59)ను ఔట్ చేసి తమ జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడని, అతనికి నటరాజన్ (4-0-31-1) నుంచి మద్దతు లభించిందని పేర్కొన్నారు.
కాగా, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులకు పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment