photo credit: IPL Twitter
ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య నిన్న (ఏప్రిల్ 22) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్ ఫిక్స్ అయ్యిందంటూ క్రికెట్ ఫాలోవర్స్ ఆరోపణలు చేస్తున్నారు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో ఉద్దేశపూర్వకంగానే ఓటమిపాలైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అనుమానకర రీతిలో సాగిన ఈ మ్యాచ్‌పై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ సాగిన తీరు అనుమానాస్పదంగా ఉందని, బీసీసీఐ అతనిపై ఓ కన్నువేసి ఉంచాలని సలహాలు ఇస్తున్నారు. గతంలో లక్నోను పలు సందర్భాల్లో గెలిపించిన పూరన్, బదోని, స్టోయినిస్, దీపక్ హుడాలలో గెలవాలన్న కసి అస్సలు కనిపించలేదని, లక్నో జట్టు సభ్యులంతా మూకుమ్మడిగా గూడుపుఠాణి ప్లాన్ చేశారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
లక్నోను తూర్పారబెతున్న నెటిజన్లు మరో పక్క మోహిత్ శర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చివరి ఓవర్‌లో అతను మ్యాచ్‌ను హ్యాండిల్ చేసి తీరు అమోఘమని, ఓడాల్సిన మ్యాచ్‌లో గుజరాత్‌ను ఒంటిచేత్తో గెలిపించాడని ఆకాశానికెత్తుతున్నారు. మొత్తంగా చూస్తే ఈ మ్యాచ్ బెట్టింగ్‌లు నడిపే వారిపై కనకవర్షం కురిపించిందని, ఫ్యాన్స్‌ను ఫూల్స్‌ను చేసిందని కామెంట్లు చేస్తున్నారు.
కాగా, సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో లక్నో ఓటమిపాలైంది. అలవోకగా గెలవాల్సిన సందర్భంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు చేజార్చుకొని ఓటమిని కొనితెచ్చుకుంది. మోహిత్ శర్.. తన బౌలింగ్ మాయాజాలంతో (2/17)తో గుజరాత్ టైటాన్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేయగా.. లక్నో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమై 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదనలో లక్నో అద్భుతంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించినప్పటికీ ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయింది.
18 ఓవర్ల తర్వాత లక్నో స్కోరు 119/3. ఆ జట్టు గెలవాలంటే 12 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి ఉండింది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్నాయి. ఇలాంటి సమీకరణల్లో కూడా లక్నో గెలవలేక ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్ ఔట్ అయిన తర్వాత (ఆఖరి ఓవర్ తొలి బంతి) లక్నో టీమ్ నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయింది. చివరి బంతికి మోహిత్ శర్మ పరుగులేమీ ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ గుజరాత్ వశమైంది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా (50 బంతుల్లో 66; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 47; 6 ఫోర్లు) రాణించగా.. లక్నో తరఫున కేఎల్ రాహుల్ (68) అర్ధ సెంచరీ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment