photo credit: IPL Twitter
ఐపీఎల్ 2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్ చెత్త ఆటతీరును ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 47; 6 ఫోర్లు), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (50 బంతుల్లో 66; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించారు.
వీరు కూడా తమ ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా బ్యాటింగ్ చేసి, మ్యాచ్‌ను ఫాలో అవుతున్న జనానికి విసుగు తెప్పించారు. ముఖ్యంగా హార్ధిక్ ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్ చేసిన విధానం, సొంత జట్టు అభిమానులకు సైతం కంపరం పుట్టించింది. వికెట్ స్లోగా ఉన్నప్పుడు తొలుత బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్‌ను చూస్తుంటే టెస్ట్ మ్యాచ్ చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇన్నింగ్స్ ఆఖర్లో హార్ధిక్ ఈ మాత్రం వేగంగానైనా పరుగులు సాధించకపోయుంటే, ఐపీఎల్ చరిత్రలో అత్యంత స్వల్ప స్కోర్ నమోదయ్యేది అని అంటున్నారు. వాస్తవానికి ఈ స్లో ట్రాక్‌పై పరుగులు చేయడం చాలా ఇబ్బందిగా ఉండింది. ఇది అర్ధమయ్యే హార్ధిక్ ఆరంభంలో కాస్త నిదానంగా ఆడాడు. సాహా వేగంగా పరుగులు సాధిద్దామని ఎంత ప్రయత్నించినప్పటికీ కుదరలేదు.
ఈ క్రమంలో అతను ఔటయ్యాడు. గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో లక్నో బౌలర్ల పాత్ర అమోఘంగా ఉంది. నవీన్ ఉల్ హాక్ (4-0-19-1), కృనాల్ పాండ్యా (4-0-16-2), స్టోయినిస్ (3-0-20-2), అమిత్ మిశ్రా (2-0-9-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. గుజరాత్ ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ డకౌట్ కాగా.. అభినవ్ మనోహర్ (3), విజయ్ శంకర్ (10), మిల్లర్ (6) అనవసరంగా బంతులను వృధా చేశారు. వికెట్ నెమ్మదిగా ఉండటంతో గుజరాత్ బౌలర్లు సైతం రాణించే అవకాశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment