IPL 2023, RR vs PBKS: Sanju Samson reveals the reason behind R Ashwin open innings - Sakshi
Sakshi News home page

Sanju Samson: బట్లర్‌ను కాదని అందుకే అశ్విన్‌తో ఓపెనింగ్‌.. గెలిచే మ్యాచ్‌లో ఓడాం! అతడు అద్భుతం..ఇక మా బౌలర్లు

Published Thu, Apr 6 2023 10:19 AM | Last Updated on Thu, Apr 6 2023 10:47 AM

IPL 2023 RR Vs PBKS Sanju On Loss Reason Behind Ashwin Open Innings - Sakshi

ధ్రువ్‌ జురెల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌ (Photo Credit: Rajasthan Royals)

IPL 2023- Rajasthan Royals vs Punjab Kings: ‘‘నిజం చెప్పాలంటే ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌. అయినప్పటికీ మా బౌలర్లు వైవిధ్యమైన బంతులతో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించారు.  పంజాబ్‌ కింగ్స్‌ ఆది నుంచే అద్భుతంగా బ్యాటింగ్‌ చేసింది. ముఖ్యంగా పంజాబ్‌ బ్యాటర్లు పవర్‌ప్లేను బాగా వినియోగించుకున్నారు.

ఏదేమైనా బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పంజాబ్‌ను 197 పరుగులకు కట్టడి చేశారంటే మా బౌలర్లు మెరుగ్గానే రాణించినట్లు లెక్క!’’ అని రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు.

కాగా ఐపీఎల్‌-2023లో భాగంగా గువాహటి వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆఖరి వరకు పోరాడి 5 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్‌ సారథి సంజూ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు.

దంచికొట్టిన ప్రబ్‌సిమ్రన్‌, ధావన్‌
ఈ క్రమంలో పంజాబ్‌ ఓపెనర్లు ప్రబ్‌సిమ్రన్‌(60), శిఖర్‌ ధావన్‌(86 నాటౌట్‌) విజృంభించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. ఇక ‘హోం గ్రౌండ్‌’లో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ 192 పరుగులకే పరిమితమై ఓటమిని మూటగట్టుకుంది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం సంజూ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలన్న నిర్ణయం బెడిసికొట్టిందని చెప్పుకొచ్చాడు. అదే విధంగా తమ జట్టు స్టార్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ను కాదని.. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్ర అశ్విన్‌ను ఓపెనర్‌గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.

అందుకే అశూతో ఓపెనింగ్‌
ఈ మేరకు.. ‘‘ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో క్యాచ్‌ అందుకునే క్రమంలో బట్లర్‌ వేలికి గాయమైంది. జాస్‌ పూర్తి ఫిట్‌గా లేడు. అందుకే అశ్విన్‌ను ముందు పంపి పడిక్కల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలనుకున్నాం. తనైతే స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలడన్న ఉద్దేశంతో ఇలా చేశాం’’ అని సంజూ తెలిపాడు.

అతడు అద్భుతం..
ఇక ఆఖర్లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ధ్రువ్‌ జురెల్‌ మెరుపు ఇన్నింగ్స్‌పై స్పందిస్తూ.. ‘‘ఐపీఎల్‌ ఆరంభానికి ముందు నిర్వహించిన శిక్షణా శిబిరంలో ధ్రువ్‌ జురెల్‌ పాల్గొన్నాడు. కోచ్‌లు అతడి నైపుణ్యాలు మెరుగుపడేలా రెట్టింపు శ్రద్ధ వహించారు. ధ్రువ్‌ తన ప్రాక్టీస్‌లో దాదాపు వెయ్యి బంతులు ఎదుర్కొన్నాడు. తన బ్యాటింగ్‌లో పురోగతి పట్ల నేనెంతో సంతోషంగా ఉన్నాను’’ అని ప్రశంసలు కురిపించాడు.

గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయాం
ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వికెట్‌ మరింత అనుకూలిస్తుందని భావించానని.. అయితే, ఆరంభంలోనే దెబ్బ పడటంతో ఆఖరి వరకు పోరాడిన ఫలితం లేకుండా పోయిందని సంజూ పేర్కొన్నాడు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి ఎదురైందని పరోక్షంగా వ్యాఖ్యానించాడు. తదుపరి మ్యాచ్‌కు సిద్ధమయ్యే క్రమంలో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటామని రాజస్తాన్‌ సారథి అన్నాడు.

సంజూ మినహా
కాగా తమ తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై రాజస్తాన్‌ భారీ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌లో ఇలా పంజాబ్‌ చేతిలో ఓటమిపాలైంది. బట్లర్‌ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన అశ్విన్‌ డకౌట్‌ కావడం.. కెప్టెన్‌ సంజూ(42) మినహా టాపార్డర్‌ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మెయిర్‌(18 బంతుల్లో 36 పరుగులు), ధ్రువ్‌ జురెల్‌(15 బంతుల్లో 32 పరుగులు నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకుండా పోయింది.

చదవండి: Sam Curran: పర్లేదు.. పెట్టిన సొమ్ముకు న్యాయం చేస్తున్నాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement