CSK Vs MI: హార్దిక్‌ చెత్త కెప్టెన్సీ.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు | IPL 2024 MI Vs CSK: Fans Slamming Hardik Pandya Captaincy Blunder In Shreyas Gopal Case, See Details Inside - Sakshi
Sakshi News home page

IPL 2024, MI VS CSK: హార్దిక్‌ చెత్త కెప్టెన్సీ.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు

Published Mon, Apr 15 2024 9:49 AM | Last Updated on Mon, Apr 15 2024 11:26 AM

IPL 2024 MI VS CSK: Fans Slamming Hardik Pandya Captaincy Blunder In Shreyas Gopal Case - Sakshi

ముంబై ఇండియన్స్‌తో జత కట్టాక హార్దిక్‌ పాండ్యా కెప్టెన్సీలో లోపాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. ఈ సీజన్‌లో ముంబై ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఈ విషయం తేటతెల్లమైంది. బౌలర్లను మర్చే విషయంలో, బాగా బౌలింగ్‌ చేస్తున్న వారిని వాడుకునే విషయంలో హార్దిక్‌ పూర్తిగా తేలిపోయాడు. 

బౌలింగ్‌ అటాక్‌ను ప్రారంభించడం, చివరి ఓవర్లలో తనే బౌలింగ్‌కు దిగడం (సీఎస్‌కేతో మ్యాచ్‌లో చివరి ఓవర్‌ వేసి 26 పరుగులు సమర్పించుకున్నాడు) వం‍టి పిల్ల చేష్టలు ముంబై ఇండియన్స్‌ కొంప ముంచుతున్నాయి. ఇలాంటివన్నీ చూస్తే.. హార్దిక్‌ అయిష్టంగా ముంబై ఇండియన్స్‌ సారధిగా వ్యవహరిస్తున్నాడన్న విషయం క్రికెట్‌ పరిజ్ఞానం లేని వారికి సైతం స్పష్టంగా అర్దమవుతుంది. 

హార్దిక్‌ కెప్టెన్సీలో లోపాలు తాజాగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ బహిర్గతం అయ్యాయి. ఆర్సీబీతో మ్యాచ్‌ నుంచి అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్న శ్రేయస్‌ గోపాల్‌ను కాదని పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ రొమారియో షెపర్డ్‌పై ఎక్కువగా ఆధారపడ్డాడు. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్‌ బౌలర్‌ అయిన శ్రేయస్‌ గోపాల్‌తో ఒకే ఒక ఓవర్‌ వేయించడం కెప్టెన్‌గా హార్దిక్‌ అనుభవలేమికి అద్దం పడుతుంది.

సీఎస్‌కేతో మ్యాచ్‌లో శ్రేయస్‌ ఒకే ఒక ఓవర్‌ వేసినప్పటికీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి కీలకమైన రచిన్‌ రవీంద్ర వికెట్‌ పడగొట్టాడు. బాగా బౌలింగ్‌ చేస్తున్న వారిని వినయోగించుకోకపోవడం హార్దిక్‌కు కొత్తేమీ కాదు (ఈ సీజన్‌లో). గత మ్యాచ్‌ల్లో అతను బుమ్రా విషయంలోనూ ఇలాగే వ్యవహరించాడు. అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్న బుమ్రాను కాదని తానే బౌలింగ్‌ అటాక్‌ను ప్రారంభించడం.. కీలక దశలో అనుభవజ్ఞుడైన బుమ్రా సేవలను వినియోగించుకోకపోవడం వంటివి చూశాం.

ఈ సీజన్‌లో హార్దిక్‌ అవళంభిస్తున్న తలతిక్క నిర్ణయాల వల్లే గతమెంతో ఘనంగా ఉన్న ముంబై ఇండియన్స్‌ ప్రతిష్ట దెబ్బ తింటుంది. రోహిత్‌ విషయంలో హార్దిక్‌పై ఇప్పటికే గుర్రుగా ముంబై అభిమానులు ఇలాంటి విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ప్రతి మ్యాచ్‌లో హార్దిక్‌ నిర్ణయాలే ముంబై కొంపముంచుతున్నాయని ఆరోపిస్తున్నారు. 

కాగా, సీఎస్‌కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ అజేయ సెంచరీతో (63 బంతుల్లో 105 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కదంతొక్కినప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే.. రుతురాజ్‌ (40 బంతుల్లో 69; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శివమ్‌ దూబే (38 బంతుల్లో 66 నాటౌట్‌; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్‌లో ధోని (4 బంతుల్లో 20 నాటటౌ్‌; 3 సిక్సర్లు) హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ సిక్సర్ల బాదడంతో సీఎస్‌కే 200 పరుగుల మార్కును తాకింది. 

అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. రోహిత్‌ శర్మ  శతక్కొట్టినప్పటికీ గెలవలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ధోని ఆఖరి ఓవర్‌లో చేసిన 20 పరుగులే ముంబై ఓటమికి కారణమయ్యాయని నెటిజన్లు అనుకుంటున్నారు. 4 వికెట్లు తీసిన పతిరణ ముంబై ఓటమికి ప్రధాన కారకుడయ్యాడు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement