హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి వినయ్‌ కుమార్‌.. గేల్‌, ఏబీడీ సరసన​ చోటు | IPL 2024: Vinay Kumar Included In RCB Hall Of Fame After Chris Gayle And AB Devilliers | Sakshi
Sakshi News home page

IPL 2024: ఆర్సీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి వినయ్‌ కుమార్‌.. గేల్‌, ఏబీడీ సరసన​ చోటు

Published Wed, Mar 20 2024 3:14 PM | Last Updated on Wed, Mar 20 2024 3:55 PM

IPL 2024: Vinay Kumar Included In RCB Hall Of Fame After Chris Gayle And AB Devilliers - Sakshi

ఆర్సీబీ తమ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌ల జాబితాలో మరో ఆటగాడికి చోటు కల్పించింది. ఫ్రాంచైజీ మాజీ ఆటగాడు వినయ్‌ కుమార్‌ కొత్తగా ఆర్సీబీ హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌ల జాబితాలో చేరాడు. గతేడాది (2023) మాజీ ఆటగాళ్లు క్రిస్‌ గేల్‌, ఏబీ డివిలియర్స్‌లను హాల్‌ ఆఫ్‌ ఫేమర్ల  జాబితాలోకి చేర్చిన ఆర్సీబీ.. ఈ ఏడాది వినయ్‌ కుమార్‌ను ఆహ్వానించింది.

నిన్న (మార్చి 19) జరిగిన అన్‌బాక్స్‌ ఈవెంట్‌ సందర్భంగా ఆర్సీబీ వినయ్‌ కుమార్‌ను హాల్‌ ఆఫ్‌ ఫేమర్‌ల జాబితాలోకి ఆహ్వానించి, సత్కరించింది. వినయ్‌ను సత్కరించిన వారిలో ఆర్సీబీ యజమానితో పాటు విరాట్‌ కోహ్లి, డుప్లెసిస్‌, మహిళా జట్టు కెప్టెన్‌ స్మృతి మంధన ఉన్నారు. వినయ్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లోకి ఆహ్వానిస్తున్న విషయాన్ని ఆర్సీబీ యాజమాన్యం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

40 ఏళ్ల వినయ్‌ ఆర్సీబీ తరఫున 2008, 2009, 2010, 2012, 2013 సీజన్లలో ఆడాడు. వినయ్‌ ఆర్సీబీ తరఫున మూడో అత్యధిక వికెట్‌ టేకర్‌గా (80) ఉన్నాడు. ఓవరాల్‌గా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 105 మ్యాచ్‌లు ఆడిన వినయ్‌ 105 వికెట్లు పడగొట్టాడు. వినయ్‌ 2012 (19), 2013 (23) సీజన్లలో ఆర్సీబీ తరఫున లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో మొత్తం 11 సీజన్లు ఆడిన వినయ్‌.. ఆర్సీబీ, ముంబై ఇండియన్స్‌, కొచ్చి టస్కర్స్‌ కేరళ, కేకేఆర్‌ ఫ్రాంచైజీలకు ఆడాడు. 

దేశవాలీ క్రికెట్‌లో కర్ణాటక తరఫున రంజీ అరంగ్రేటం (2004) చేసిన వినయ్‌.. రంజీ చరిత్రలో 400 అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఏకైక పేసర్‌గా రికార్డు నెలకొల్పాడు. దేశవాలీ క్రికెట్‌లో వినయ్‌ను దావణగెరె ఎక్స్‌ప్రెస్‌ అని పిలుస్తారు. ఐపీఎల్‌, దేశవాలీ క్రికెట్‌లో ఘనమైన రికార్డు కలిగిన వినయ్‌.. టీమిండియాకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. వినయ్‌ భారత జట్టు తరఫున 9 టీ20లు, 31 వన్డేలు, ఏకైక టెస్ట్‌ ఆడి 49 వికెట్లు పడగొట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement