
Photo Courtesy: BCCI/IPL
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను ముంబై ఇండియన్స్ తమ ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇందులో బుమ్రా లేని లోటు కొట్టిచ్చినట్లు కనిపించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లో ముంబై తొలి రెండు మ్యాచ్‌లు ఓడి.. ఆతర్వాతి మ్యాచ్‌లో గెలిచింది.
ముందుగా జరిగిన ప్రచారం ప్రకారం బుమ్రా తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అందుబాటులోకి రావాల్సి ఉండింది. అయితే బుమ్రా రాక మరింత ఆలస్యమవుతుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. బుమ్రా గాయం ఊహించిన దానికంటే తీవ్రమైందని బీసీసీఐ వర్గాల సమాచారం. బుమ్రా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ.. అక్కడి వైద్యులు రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది.
బుమ్రాపై అతిగా ఒత్తిడి తెస్తే మొదటికే మోసం రావచ్చని వారు భావిస్తున్నారట. ప్రస్తుతం వైద్యులు బుమ్రాకు స్ట్రెస్ ఫ్రాక్చర్ కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారట. ఐపీఎల్ ఎంట్రీకి బుమ్రా కూడా తొందరపడటం లేదని తెలుస్తుంది. సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్‌లో బుమ్రా చాలా జాగ్రత్తగా ఉన్నాడని సమాచారం. ఒకవేళ బుమ్రా తొందరపడి ఐపీఎల్‌లో ఆడాలనుకుంటే గాయం తీవ్రతరమై దీర్ఘకాలిక నష్టం సంభవించే ప్రమాదం ఉంది.
అందుకే బుమ్రా విషయంలో బీసీసీఐ రిస్క్ తీసుకోదలచుకోలేదని తెలుస్తుంది. దీన్ని బట్టి ఐపీఎల్-2025లో బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బుమ్రా తిరిగి ఎప్పుడు బరిలోకి దిగుతాడన్న విషయాన్ని బీసీసీఐ అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తే మాత్రం బుమ్రా మే నెలలోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అప్పటికి ముంబై ఇండియన్స్ 10 మ్యాచ్‌లకు పైగా ఆడేసి ఉంటుంది.
బుమ్రా గైర్హాజరీ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట ఓడింది. ఒకవేళ బుమ్రా మే నెలలో ఎంట్రీ ఇచ్చినా నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంటుంది. ముంబై ఇండియన్స్ బుమ్రా లేకపోయినా తదుపరి మ్యాచ్‌ల్లో సత్తా చాటితే ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అప్పుడు బుమ్రా సేవలను ఆ జట్టు ప్లే ఆఫ్స్‌లో వినియోగించుకోవచ్చు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తే ముంబై ఇండియన్స్‌కు అంత సీన్ లేదనిపిస్తుంది. ఆ జట్టులో సమతుల్యత లోపించినట్లు కనిపిస్తుంది. బౌలింగ్‌లో బౌల్ట్ మినహా ఆ జట్టులో సీనియర్ ఎవరూ లేరు. కొత్తగా వచ్చిన బౌలర్లతో ఆ జట్టు కాలం వెల్లదీస్తుంది. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో యువ పేసర్ అశ్వనీ కుమార్ సత్తా చాటడంతో ముంబై ఇండియన్స్ సీజన్ తొలి విజయం నమోదు చేసింది.
బ్యాటింగ్‌లో కూడా ఆ జట్టు అంతంతమాత్రంగానే ఉంది. రోహిత్ శర్మ పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముంబై ఇండియన్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. కాగా, బుమ్రా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. అదే గాయం కారణంగా అతను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా దూరమయ్యాడు.