సన్‌రైజర్స్ రిటైన్డ్ ప్లేయర్లు (PC: SRH X)
గత మూడేళ్లుగా పేలవ ఆట తీరుతో వెనుకబడ్డ సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను తన అద్భుత కెప్టెన్సీతో ఈసారి టైటిల్ రేసులో నిలిపాడు ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియాకు వన్డే వరల్డ్‌కప్ అందించిన సారథిగా నీరాజనాలు అందుకున్న ఈ ఫాస్ట్ బౌలర్.. ఫ్రాంఛైజీ తనకు చెల్లించిన రూ. 20.50 కోట్లకు పైసా వసూల్ ప్రదర్శన ఇచ్చాడు.
సహచర ఆటగాళ్లతో మమేమకమవుతూ సరైన సమయంలో అవకాశాలు ఇచ్చి జట్టును ఫైనల్‌కు తీసుకువెళ్లాడు. తద్వారా ఆరెంజ్ ఆర్మీకి ఇష్టమైన కెప్టెన్‌గా మారిపోయాడు. కానీ.. జాతీయ జట్టు విధుల దృష్ట్యా ఈసారి కమిన్స్ అసలు ఐపీఎల్ ఆడతాడా? కెప్టెన్‌గా కొనసాగుతాడా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, రిటెన్షన్ లిస్టు విడుదల సందర్భంగా సన్‌రైజర్స్ ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది.
మన లీడర్.. మన కెప్టెన్
వచ్చే ఏడాది కూడా ప్యాటీనే రైజర్స్‌ను ముందుకు నడిపించబోతున్నాడని..ఫ్రాంఛైజీ అధికారికంగా ప్రకటించింది. ‘‘మన లీడర్.. మన కెప్టెన్... ప్యాటీ కమిన్స్ మిమ్మల్ని ఉప్పల్‌లో మరోసారి కలిసేందుకు సిద్ధంగా ఉన్నాడు’’ అంటూ ఆరెంజ్ ఆర్మీకి శుభవార్త అందించింది.
ఇక ఈ ఏడాది పరుగుల విధ్వంసంతో రికార్డులు తిరగరాసిన సన్‌రైజర్స్.. రిటెన్షన్ల విషయంలోనూ దూకుడుగా వ్యవహరించింది. హార్డ్ హిట్టర్ హెన్రిక్ క్లాసెన్ కోసం ఏకంగా రూ. 23 కోట్లు ఖర్చు చేసింది.
ఆ జట్లు వదిలేశాయి
ఇదిలా ఉంటే.. ఇతర ఫ్రాంఛైజీలలో కోల్‌కతా, ఢిల్లీ, లక్నో, పంజాబ్, బెంగళూరు తమ కెప్టెన్లను వేలంలోకి వదిలివేయగా.. చెన్నై, ముంబై, గుజరాత్, రాజస్తాన్ మాత్రం తమ సారథులను కొనసాగించాయి. దీంతో ఈసారి ఈసారి ఐపీఎల్ వేలం ఆసక్తికరంగా సాగడం ఖాయం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం ఈనెల నెలాఖరున జరగనుండగా... రీటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇందులో కొందరు ఆటగాళ్లు అనూహ్యంగా కోట్లు కొల్లగొట్టగా... మరికొందరు స్టార్ ప్లేయర్లు ఫ్రాంచైజీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోయారు.
అధిక ధర వీరికే
అందరికంటే అత్యధికంగా దక్షిణాఫ్రికా ‘హార్డ్ హిట్టర్’ హెన్రిచ్ క్లాసెన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 23 కోట్లు కేటాయించగా... విరాట్ కోహ్లీకి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు... నికోలస్ పూరన్‌కు లక్నో సూపర్ జెయింట్స్ రూ.21 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నాయి.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఇక మీదట కూడా నాయకుడిగా కొనసాగడం ఖాయం కాగా... ముంబై మొత్తంగా ఐదుగురు ప్రధాన ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. మేటి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు అత్యధికంగా రూ. 18 కోట్లు కేటాయించిన ఫ్రాంచైజీ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు చెరో రూ. 16 కోట్ల 35 లక్షలు వెచ్చించింది.
ఇక ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మకు రూ. 16 కోట్ల 30 లక్షలు కేటాయించింది. హైదరాబాద్ ఆటగాడు ఠాకూర్ తిలక్ వర్మకు రూ.8 కోట్లు ఇచ్చి ముంబై తమ వద్దే పెట్టుకుంది.
రీటైన్‌ను సంపూర్ణంగా వాడుకుంది ఎవరంటే?
ఆటగాళ్ల కొనుగోలు కోసం ఒక్కో జట్టు రూ.120 కోట్లు ఖర్చు చేసుకునే అవకాశం ఉండగా... అందులో రూ. 75 కోట్లు రిటెన్షన్‌కు కేటాయించారు. తాజా జాబితాను చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు రీటైన్‌ను సంపూర్ణంగా వాడుకోగా... అత్యల్పంగా పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ప్లేయర్లనే అట్టి పెట్టుకుంది.
పంజాబ్ మరీ ఇద్దరినే
పంజాబ్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆ్రస్టేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ వ్యూహాల్లో భాగంగా... కేవలం ఇద్దరు ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్లను మాత్రమే రీటైన్ చేసుకున్న పంజాబ్ వద్ద వేలం కోసం అత్యధికంగా రూ. 110.5 కోట్లు మిగిలి ఉన్నాయి.
ఈ ఏడాది జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించిన శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ వేలానికి వదిలేయగా... తొమ్మిదేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న రిషబ్ పంత్‌ను ఫ్రాంచైజీ వదిలేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం కేఎల్ రాహుల్‌పై నమ్మకం ఉంచలేదు.
రింకూ సింగ్‌కు జాక్‌పాట్.. ధోనీ ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ధోనీ సహా మొత్తం ఐదుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోగా... రాజస్తాన్ రాయల్స్ కూడా ఆరుగురు ప్లేయర్లను రీటైన్ చేసుకుంది. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16 కోట్ల 50 లక్షలు కేటాయించగా... సిక్సర్ల వీరుడు రింకూ సింగ్‌కు కోల్‌కతా రూ.13 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకుంది.
వెస్టిండీస్ ద్వయం రసెల్, నరైన్‌తో పాటు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తలా రూ. 12 కోట్లు కేటాయించింది. కోల్‌కతా వదిలేసుకున్న శ్రేయస్ అయ్యర్ కోసం వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడటం ఖాయమే కాగా... సారథి కోసం చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పంత్‌పై కన్నేసే అవకాశాలు ఉన్నాయి.
బేబీ మలింగకు రూ. 13 కోట్లు
జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి ఐదేళ్లు దాటిపోయిన ధోనీని ఐపీఎల్ నిబంధనల ప్రకారం ‘అన్‌క్యాప్డ్’ ప్లేయర్ కోటాలో రీటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ... మాజీ సారథికి రూ.4 కోట్లు కేటాయించింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌తో పాటు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చెరో రూ. 18 కోట్లు వెచ్చించింది. శ్రీలంక పేసర్ పతిరణకు రూ. 13 కోట్లు, పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబేను రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది.
రాజస్తాన్ రైట్‌రైట్
రిటైనింగ్‌లో మొత్తం ఆరు అవకాశాలను వాడుకున్న రాజస్తాన్ రాయల్స్... సంజూ సామ్సన్, యశస్వి జైస్వాల్‌కు చెరో రూ.18 కోట్లు కేటాయించింది. రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్‌కు చెరో రూ. 14 కోట్లు వెచ్చించింది.
పూరన్ కోసం అంత అవసరమా?
కేఎల్ రాహుల్‌ను వేలానికి వదిలేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిలకడగా ఆడతాడో లేదో తెలియని వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ కోసం రూ. 21 కోట్లు కేటాయించింది.
గాయాలతో సహవాసం చేసే సూపర్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్, స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు రూ. 11 కోట్లు కేటాయించిన లక్నో... మొహసిన్ ఖాన్, ఆయుష్ బదోనీలకు చెరో రూ. 4 కోట్లు వెచ్చించింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు రూ.18 కోట్లు కేటాయించిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ... కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను రూ. 16 కోట్ల 50 లక్షలకు అట్టిపెట్టుకుంది.
వేలానికి రానున్న ప్రధాన ఆటగాళ్లు
కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, షమీ (భారత్). వార్నర్, మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, స్టొయినిస్ ఆస్ట్రేలియా). బెయిర్‌స్టో, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బట్లర్, ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్). డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, క్వింటన్ డికాక్, నోర్జే (దక్షిణాఫ్రికా). కాన్వే, రచిన్ రవీంద్ర, బౌల్ట్ (న్యూజిలాండ్).
చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి
Comments
Please login to add a commentAdd a comment