‘మేము ఆడేందుకు వచ్చాం.. ట్రంప్‌తో మాకు అనవసరం’ | Iran Football Team Lands In USA For FIFA World Cup 2026 Amid US Iran Tensions, Coach Says Politics And Football Are Different | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: ‘మేము ఆడేందుకు వచ్చాం.. ట్రంప్‌తో మాకు అనవసరం’

Jun 15 2026 8:57 AM | Updated on Jun 15 2026 11:06 AM

Iran Football-Team Lands In USA For FIFA World Cup 2026

ప్రెస్‌మీట్‌లో ఇరాన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌ అమీర్ ఘ‌లేనోయ్

అమెరికా, ఇరాన్ మ‌ధ్య కొన్ని నెల‌లుగా సాగుతున్న ఉద్రిక్త ప‌రిస్థితులు ఫిఫా ప్ర‌పంచ‌కప్‌కు కూడా పాకిన విష‌యం తెలిసిందే. ఆట‌గాళ్ల వీసాల విష‌యంలో అనిశ్చితి, జ‌ట్టు అధికారుల్లో కొంద‌రికీ ఎంట్రీ నిరాక‌రించ‌డం, ఇరాన్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల‌ను అమెరికా ర‌ద్దు చేయ‌డం, అమెరికాలో ఏర్పాటు చేసుకున్న త‌మ బేస్ క్యాంప్‌ను కూడా అరిజోనాలో కాకుండా మెక్సికోలోని టిజువానాకు త‌ర‌లించుకోవ‌డం చూసి అస‌లు ఇరాన్ ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడుతుందా లేదా అనే సందిగ్ధం నెల‌కొంది.  

కానీ వాట‌న్నింటికీ తెర దించుతూ ఇరాన్ ఫుట్‌బాల్ జ‌ట్టు ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడేందుకు అమెరికాలో ల్యాండ్ అయింది. ఇవాళ రాత్రి లాస్ ఏంజిల్స్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆతిథ్య‌మిస్తున్న అమెరికా యుద్ధంలో ఉండ‌డం, అదే యుద్ధంలో ఉన్న ఇరాన్‌కు ఆతిథ్యం ఇవ్వ‌నుండ‌డం చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి కావొచ్చు. 

ఇక అమెరికాలో అడుగుపెట్టిన ఇరాన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మీడియా స‌మావేశంలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఇరాన్ ఫుట్‌బాల్ కోచ్ అమీర్ ఘ‌లేనోయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 'మేము ఇక్క‌డికి మ్యాచ్‌లు ఆడేందుకు వ‌చ్చాం. మా చుట్టూ జ‌రుగుతున్న హడావిడి, ఇత‌ర విష‌యాల గురించి ప‌ట్టించుకోము. ట్రంప్‌తో మాకు అనవసరం. ఆ దేశంతో చర్చలు, ఒప్పందాలు అనేవి రాజకీ అంశాలు.

ఇప్పుడు మా దృష్టంతా ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌పైనే ఉంది. స‌హ‌జంగానే ప్ర‌తీ జ‌ట్టుకు వారి దేశంలో అనేక స‌మ‌స్య‌లు ఉంటాయి. అంతేకాదు అవి ఆట‌కు సంబంధం లేకుండా ఉంటాయి. అమెరికా, ఇరాన్ మ‌ధ్య సైనిక ఘ‌ర్ష‌ణ నెల‌కొని ఉండొచ్చు. కానీ అవి ఆట‌తో ముడిపెట్ట‌లేం. మేము రాజ‌కీయ వ్య‌క్తులం కాదు.. ఫుట్‌బాల్ ఆట‌గాళ్లం.' అని చెప్పుకొచ్చాడు. 

ఇక ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇరాన్ ఎన్న‌డూ నాకౌట్ రౌండ్‌కు చేర‌లేదు. గ్రూప్‌-జిలో ఉన్న ఇరాన్‌కు న్యూజిలాండ్‌, బెల్జియం, ఈజిప్ట్ రూపంలో గ‌ట్టి ప్ర‌త్య‌ర్థులే ఉన్నాయి. అయితే ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ప్రారంభానికి ముందు అమెరికా త‌మ‌పై దాడులు చేస్తున్న కార‌ణంగా తొలుత ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ ఆడ‌బోమ‌ని ఇరాన్ తేల్చి చెప్పింది. ఆ తర్వాత మ‌న‌సు మార్చుకుంది. 

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా త‌మ దేశానికి వ‌స్తే ఆట‌గాళ్ల భ‌ద్ర‌త‌కు ముప్పు వాటిల్లే ప్ర‌మాదముంద‌ని హెచ్చ‌రించారు. అయితే తాజాగా అమెరికా, ఇరాన్ మ‌ధ్య యుద్ధం ముగిసింద‌ని రెండు దేశాలు అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో కొంత సానుకూలాంశం. ఇరాన్ స్వేచ్ఛ‌గా మ్యాచ్‌లు ఆడేందుకు ఇది అవ‌కాశం క‌ల్పించ‌నుంది.

ఇరాన్‌ తరఫున ఆ దేశ సుప్రీం మోజ్తబా ఖమేనీ మార్గదర్శకత్వంలో డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. చర్చలను విజయవంతం చేసిన ఖతార్‌కు ఇరు వర్గాలు కృతజ్ఞతలు తెలియజేశాయి. పాకిస్తాన్ కూడా ఈ పరిణామాన్ని స్వాగతించింది. ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో అమెరికా-ఇరాన్ ప్రతినిధులు అధికారిక శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. 

చదవండి:  ‘మ్యాచ్‌ విజయంలో ఆ ఇద్దరిదే కీలకపాత్ర’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement