ODI: ఆఖరి బంతికి అద్భుతం.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ | Ireland Women Beat England After Two Decades in a Last Ball ODI Thriller | Sakshi
Sakshi News home page

ODI: ఇంగ్లండ్‌కు షాకిచ్చిన ఐర్లాండ్‌.. 23 ఏళ్ల తర్వాత తొలి గెలుపు

Published Thu, Sep 12 2024 5:32 PM | Last Updated on Thu, Sep 12 2024 6:38 PM

Ireland Women Beat England After Two Decades in a Last Ball ODI Thriller

ఐర్లాండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు సంచలన విజయం సాధించింది. దాదాపు ఇరవై మూడేళ్ల అనంతరం తొలిసారి ఇంగ్లండ్‌పై వన్డే మ్యాచ్‌లో గెలుపొందింది. ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని చిత్తు చేసి జయభేరి మోగించింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌- ఐర్లాండ్‌ మధ్య మూడు మ్యాచ్‌ల షెడ్యూల్‌ ఖరారైంది.

తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్‌ ఘన విజయం
ఇందుకోసం ఐర్లాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లిష్‌ జట్టు.. తొలి రెండు వన్డేల్లో ఘన విజయం సాధించింది. శనివారం నాటి (సెప్టెంబరు 7) మ్యాచ్‌లో 4 వికెట్లు, సోమవారం నాటి వన్డే(సెప్టెంబరు 9) రెండో వన్డేల్లో ఏకంగా 275 పరుగుల తేడాతో ఐర్లాండ్‌ను ఓడించింది. తద్వారా మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో సొంతం చేసుకుంది.

22 ఓవర్లకు మ్యాచ్‌ కుదింపు
ఈ క్రమంలో మూడో వన్డేలో గెలుపొంది పరువు నిలుపుకోవాలని భావించిన ఐర్లాండ్‌.. తమ సంకల్పం నెరవేర్చుకుంది. బెల్‌ఫాస్ట్‌ వేదికగా బుధవారం రాత్రి ముగిసిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించగా.. 22 ఓవర్లకు కుదించారు. ఇక ఈ వన్డేలో టాస్‌ ఓడిన ఆతిథ్య ఐర్లాండ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది.

5 వికెట్లు తీసిన ఐరిష్‌ స్పిన్నర్‌
బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ క్రికెటర్లలో టామీ బీమౌంట్‌(42 బంతుల్లో 52 పరుగులు) మాత్రమే రాణించింది. మిగతా వాళ్లంతా విఫలం కావడంతో 20.5 ఓవర్లలో 153 పరుగులకే ఇంగ్లండ్‌ మహిళా జట్టు ఆలౌట్‌ అయింది. ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ఐరిష్‌ స్పిన్నర్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ఐమీ మగిర్‌ ఇంగ్లండ్‌ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించింది.

 

గాబీ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్‌కు ఓపెనర్‌, కెప్టెన్‌ గాబీ లూయీస్‌ ఘనమైన ఆరంభం అందించింది. 23 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌ 56 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 72 పరుగులు చేసి బలమైన పునాది వేసింది. కానీ మిగతా వాళ్లలో నాలుగో నంబర్‌ బ్యాటర్‌ లీ పాల్‌(22) తప్ప అందరూ విఫలమయ్యారు. ఈ క్రమంలో ఐర్లాండ్‌ గెలుపుపై ఆశలను దాదాపుగా వదిలేసుకుంది.

ఆఖరి బంతికి అద్భుతం
ఆ సమయంలో టెయిలెండర్‌ అలనా డాల్‌జెల్‌ అద్భుతం చేసింది. చివరి ఓవర్లో ఏకంగా మూడు వికెట్లు తీసి జోరు మీదున్న ఇంగ్లిష్‌ బౌలర్‌ మ్యాడీ విలియర్స్‌కు షాకిస్తూ.. ఆఖరి బంతికి ఫోర్‌ బాదింది. దీంతో సీన్‌ మొత్తం రివర్స్‌ అయింది. 

ఐర్లాండ్‌ మూడు వికెట్ల తేడాతో జయకేతం ఎగురవేయగా.. ఊహించని పరిణామానికి కంగుతినడం ఇంగ్లిష్‌ జట్టు వంతైంది. కాగా ఇరవై మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌తో వన్డేల్లో ఐర్లాండ్‌ మహిళా జట్టుకు ఇదే తొలి గెలుపు కావడం విశేషం.

చదవండి: 147 ఏళ్ల చరిత్రలో తొలిసారి: కోహ్లి మరో 58 రన్స్‌ చేశాడంటే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement