నేడు ఐర్లాండ్ మహిళల జట్టుతో భారత్ తొలి మ్యాచ్
ఉదయం 11 గంటల నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
భారత్, ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య 1993 నుంచి ఇప్పటి వరకు 12 వన్డేలు జరిగాయి. వీటన్నింటిలోనూ భారతే గెలవగా, ఐర్లాండ్‌కు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లన్నీ ఐసీసీ టోర్నీల్లో భాగంగానే నిర్వహించారు ఒక్కసారి కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు.
ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో ద్వైపాక్షిక పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉండగా... ఐర్లాండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం.
రాజ్‌కోట్: స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల జట్టు దేశంలోని వేర్వేరు వేదికలపై సిరీస్‌లు ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో బెంగళూరులో, న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో, వెస్టిండీస్‌తో వడోదరలో ఆడిన జట్టు ఇప్పుడు మరో కొత్త వేదిక రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో తలపడుతోంది.
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు ఆడనుంది. ప్రస్తుతం ఇరు జట్ల బలబలాలు చూస్తే భారత్ సంపూర్ణ ఆధిక్యంలో కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని జట్టు పట్టుదలగా ఉంది.
కొత్త ప్లేయర్లకు అవకాశం...
రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. స్మృతి వన్డేల్లో గతంలో ఒకే ఒక మ్యాచ్‌లో కెపె్టన్‌గా వ్యవహరించింది. టాప్ పేసర్ రేణుకా సింగ్ లేకపోవడంతో కాస్త అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్లతోనే ఆమె ఫలితాలు రాబట్టాల్సి ఉంది. అయితే కొత్త ప్లేయర్లను మరింతగా పరీక్షించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది.
హర్మన్ స్థానంలో రాఘ్వీ బిస్త్ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. మహిళల దేశవాళీ వన్డే టోర్నీలో ఉత్తరాఖండ్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన రాఘ్వీ భారత్ ‘ఎ’ తరఫున ఆసీస్ ‘ఎ’ తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసింది. రేణుక, పూజ వస్త్రకర్‌తో పాటు అరుంధతి రెడ్డి కూడా జట్టులో లేకపోవడంతో టిటాస్ సాధు, సైమా ఠాకూర్‌లపై పేస్ బౌలింగ్ భారం ఉంది.
ఆల్‌రౌండర్ కావాలంటే సయాలీ సత్‌ఘరే అందుబాటులో ఉండగా... దీప్తి శర్మ, ప్రియా మిశ్రాకు తోడుగా తుది జట్టులో మరో స్పిన్నర్ కావాలంటే తనూజ కన్వర్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే సైమా, సాధు, ప్రియా కలిపి మొత్తం 20 వన్డేలు కూడా ఆడలేదు. ఓపెనర్‌గా తన స్థానం సుస్ధిరం చేసుకునేందుకు ప్రతీక రావల్‌కు ఇది మంచి
అవకాశం.
ఎందుకంటే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత షఫాలీ వర్మ మరోవైపు దేశవాళీ క్రికెట్‌లో చెలరేగిపోతోంది. సీనియర్ వన్డే ట్రోఫీలో 527 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆమె వన్డే చాలెంజర్ ట్రోఫీలో కూడా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో మెరుపు వేగంతో రెండు అర్ధసెంచరీలు సాధించింది.
ఈ నేపథ్యంలో ప్రతీక ఆ స్థాయి దూకుడును చూపించాల్సి ఉంది. మరో ఓపెనర్‌గా స్మృతి సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలాంశం. హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లపై భారత బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది.
ఆల్‌రౌండర్లే బలం...
గాబీ లూయిస్ సారథ్యంలో ఐర్లాండ్ ఈ సిరీస్‌కు సన్నద్ధమైంది. ఈ టీమ్‌లో కూడా కొందరు అనుభవజు్ఞలతో పాటు ఎక్కువ మంది యువ ప్లేయర్లు ఉన్నారు. 2024లో జింబాబ్వే, శ్రీలంకలపై వన్డే సిరీస్‌లు నెగ్గిన ఐర్లాండ్... ఇంగ్లండ్, బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌లు కోల్పోయింది.
అయితే ఇంగ్లండ్‌పై 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక వన్డే మ్యాచ్‌లో గెలవగలిగింది. ఐర్లాండ్ టీమ్‌లో ఒర్లా ప్రెండర్‌ఘాస్ట్ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఆల్‌రౌండర్‌గా గత ఏడాది జట్టు తరఫున అత్యధిక పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకపై చేసిన సెంచరీ ఆమె సత్తాను చూపించింది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆమెకు మంచి అనుభవం ఉంది.
మరో ఆల్‌రౌండర్ లౌరా డెలానీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎయిమీ మగ్వైర్, జొవానా లాఫ్‌రన్ టీమ్‌లో ఇతర ప్రధాన ప్లేయర్లు. అయితే గత కొంతకాలంగా సంచలన ఆటతో 19 ఏళ్ల ఐర్లాండ్ స్టార్‌గా ఎదిగిన ఎమీ హంటర్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడం జట్టును కాస్త బలహీనపర్చింది.
Comments
Please login to add a commentAdd a comment