టీమిండియాకు దూరమైన ఇషాన్ కిషన్‌కు ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోనూ ఈ ఏడాది కలిసి రాలేదు. ముంబై ఇండియన్స్ తరపున ఐపీఎల్-2024లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. పద్నాలుగు మ్యాచ్‌లలో కలిపి 320 పరుగులు చేయగలిగాడు. అయితే, మెగా వేలానికి ముందు ముంబై ఫ్రాంఛైజీ మాత్రం అతడిని వదిలేసింది.
జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మలతో పాటు యువ క్రికెటర్ తిలక్ వర్మను రీటైన్ చేసుకున్న ముంబై.. ఇషాన్ పేరును మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. నిజానికి 2018లో ముంబై తరఫునే క్యాచ్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చాడు ఈ లెఫ్టాండర్ బ్యాటర్. ఆరంభం నుంచే మెరుగ్గా రాణించిన ఇషాన్ కిషన్ కోసం ఐపీఎల్-2022లో ముంబై భారీ మొత్తం వెచ్చించింది.
నాడు రూ. 15.25 కోట్ల ధరకు ముంబై సొంతం
నాటి మెగా వేలంలో అతడిని ఏకంగా రూ. 15.25 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. కానీ.. అప్పటి నుంచి నేటి దాకా ఇషాన్ కిషన్ అందుకు తగ్గ పైసా వసూల్ ప్రదర్శన మాత్రం ఇవ్వలేకపోయాడు. అంతేకాదు.. దేశవాళీ క్రికెట్ ఆడాలన్న బీసీసీఐ ఆదేశాలను ధిక్కరించి సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయి.. జాతీయ జట్టుకూ దూరమయ్యాడు.
అయితే, ఇటీవలే రంజీల్లో సెంచరీలు చేయడంతో రీ ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్.. భారత్-‘ఎ’ జట్టుకు సెలక్ట్ అయ్యాడు. కానీ.. ఆస్ట్రేలియా గడ్డపై కంగారూ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్‌లో పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఇషాన్ కిషన్ ఐపీఎల్-2025 మెగా వేలంలోకి రాబోతున్నాడు.
వికెట్ కీపర్ కోటాలో కళ్లు చెదిరే మొత్తం
ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిర్వహించిన ‘మాక్ వేలం’లో మాత్రం ఇషాన్ కిషన్ భారీ ధర పలకడం విశేషం. మెగా వేలంలో ఇషాన్ రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. అయితే, అశ్విన్ మాత్రం తన వేలంలో.. వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కోసం బిడ్ వేసే ఫ్రాంఛైజీలు రూ. 5 కోట్ల నుంచి మొదలుపెట్టాలని సూచించాడు.
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5 కోట్లకు బిడ్ వేయగా.. క్రమక్రమంగా ఇషాన్ ధర రూ. 10 కోట్లకు పెంచింది. దీంతో పంజాబ్ కింగ్స్ రేసు నుంచి తప్పుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం వికెట్ కీపర్ కోసం ఏకంగా రూ. 14.5 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.
ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అతడు ఉన్నా కూడా
అయితే, అశ్విన్ నిర్వహించిన ఈ మాక్‌వేలంలో ఇషాన్ కిషన్‌కు కళ్లు చెదిరే మొత్తం దక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫామ్‌లో లేని ఇషాన్ కోసం.. మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ అంతగా ఆసక్తి చూపదని.. మహా అయితే, అతడికి రూ. ఐదు కోట్లు దక్కవచ్చని క్రికెట్ ప్రేమికులు అంటున్నారు.
అంతేకాదు.. లక్నో ఇప్పటికే వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను ఏకంగా రూ. 21 కోట్ల మొత్తానికి అట్టిపెట్టుకుంది. అలాంటిది.. ఇషాన్‌ను ఆ ఫ్రాంఛైజీ కొనుక్కోవడం ఏమిటంటూ అశూ మాక్ వేలంలో లక్నో తరఫున పాల్గొన్న అభిమానులను ట్రోల్ చేస్తున్నారు. కాగా సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment