చెన్నై: డ్రెసింగ్ రూమ్‌లో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఇచ్చే విలువైన సలహాలు యువ ఆటగాళ్లలో ఎంతో స్పూర్తిని నింపుతాయని, మైదానంలో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు అవి ఓ టానిక్‌లా ఉపయోగపడతాయని టీమిండియా యువ సంచలన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అన్నాడు. ఆటలో ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని, టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తానని అతను పేర్కొన్నాడు. తన ఆటతీరును కోచ్ రవిశాస్త్రి ఏ మేరకు ప్రభావితం చేసాడనే అంశంపై సుందర్ మాట్లాడుతూ..
నాలాంటి యువ ఆటగాళ్లకు రవిశాస్త్రి లాంటి అనుభవజ్ఞుడైన కోచ్ లభించటం ఎంతో అదృష్టమని, మరీ ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా రాణించాలకున్న నాకు రవిశాస్త్రి సలహాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నాడు. రవిశాస్త్రి తన టెస్టు కెరీర్‌లో ఎడమచేతి స్పిన్ బౌలర్‌గా, కుడి చేతి ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించిన విషయాన్ని సుందర్ గుర్తుచేశాడు. ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్, కుడి చేతి ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన సుందర్.. కోచ్ రవిశాస్త్రే తనకు, స్పూర్తి, ఆదర్శమని పేర్కొన్నాడు.
బ్యాటింగ్ ఒక్కటే సరిపోదని
తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ అండర్-19 క్రికెట్‌లో స్పెషలిస్ట్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రాణించాడు. టీమిండియాలో స్థానం సంపాదించాలంటే కేవలం బ్యాటింగ్‌పైనే ఆధారపడితే సరిపోదని, తనలోని స్పిన్ బౌలింగ్‌కు సాన పట్టాడు. చాలామంది యువ ఆటగాళ్లలాగే సుందర్ కూడా ఐపీఎల్‌లో లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని, టీమిండియా టీ20 జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అంతటితో ఆగకుండా తనలోని ప్రతిభను మరింత మెరుగుపర్చుకుంటూ తన చిరకాల స్వప్నం అయిన టీమిండియా టెస్టు జట్టులో స్థానం సంపాదించాడు. తాజాగా ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లో తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణంలా మారాడు. బ్రిస్బేన్ టెస్టులో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 22 పరుగులు చేశాడు. మొత్తం 4 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment