ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ ఈ మధ్యకాలంలో వరుసగా లక్కీ ఛాన్స్‌లు కొట్టేస్తున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో టీ20, వన్డే అరంగేట్రం చేసిన బేతెల్.. నిన్ననే (నవంబర్ 25) ఐపీఎల్ కాంట్రాక్ట్ పట్టాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో బేతెల్‌ను ఆర్సీబీ 2.6 కోట్లకు సొంతం చేసుకున్నాడు. తాజాగా బేతెల్ మరో లక్కీ ఛాన్స్ కొట్టాడు. బేతెల్‌కు ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది.
ఈ నెల 28 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో బేతెల్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్ చేస్తాడని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. వరుస అవకాశాల నేపథ్యంలో బేతెల్ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. 21 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన బేతెల్‌కు దేశవాలీ క్రికెట్‌లో పెద్దగా ట్రాక్ రికార్డు లేనప్పటికీ వరుస అవకాశాలు వస్తున్నాయి.
బేతెల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో వార్విక్‌షైర్ తరఫున 20 మ్యాచ్‌లు ఆడి 25.44 సగటున 738 పరుగులు చేశాడు. 7 వికెట్లు తీశాడు. ఇటీవల జరిగిన హండ్రెడ్ లీగ్‌లో బేతెల్ బర్మింగ్హమ్ ఫీనిక్స్ తరఫున 7 మ్యాచ్‌లు ఆడి 165 పరుగులు చేశాడు. బేతెల్ ఇంగ్లండ్ తరఫున 8 వన్డేలు ఆడి హాఫ్ సెంచరీ సాయంతో 167 పరుగులు చేశాడు. 7 టీ20ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 173 పరుగులు చేశాడు. వన్డేల్లో బేతెల్ నాలుగు వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్ జట్టు ప్రకటన
ఈ నెల 28 నుంచి క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగబోయే తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (నవంబర్ 26) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో బేతెల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనుండగా.. రెగ్యులర్‌గా ఆ స్థానంలో బ్యాటింగ్ చేసే ఓలీ పోప్ ఆరో స్థానానికి డిమోట్ అయ్యాడు. వికెట్‌కీపర్ జోర్డన్ కాక్స్ గాయపడటంతో పోప్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓపెనర్లుగా జాక్ క్రాలే, బెన్ డకెట్ రానుండగా.. బేతెల్ మూడో స్థానంలో, జో రూట్ నాలుగులో, హ్యారీ బ్రూక్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నారు. అనంతరం ఆరో స్థానంలో ఓలీ పోప్, ఆతర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ బరిలోకి దిగనున్నారు.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ ముగ్గురు పేసర్లను, స్పిన్నర్‌ను బరిలోకి దించనుంది. పేసర్లుగా క్రిస్ వోక్స్, గస్ట్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్ బరిలోకి దిగనుండగా.. ఏకైక స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ ఎంపికయ్యాడు.
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ ప్లేయింగ్ XI: జాక్ క్రాలే, బెన్ డకెట్, జేకబ్ బేతెల్, జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్ (WK), బెన్ స్టోక్స్ (C), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడన్ కార్స్, షోయబ్ బషీర్
Comments
Please login to add a commentAdd a comment