18 కోట్ల క్రికెట‌ర్ ఆగ‌మ‌నం.. కేకేఆర్ భ‌విష్య‌త్తు మారేనా! | Key Update About Lanka Cricketers Patirana And Hasaranga To Join IPL 2026, Fitness Test Clearance Could Boost Teams | Sakshi
Sakshi News home page

18 కోట్ల క్రికెట‌ర్ ఆగ‌మ‌నం.. కేకేఆర్ భ‌విష్య‌త్తు మారేనా!

Apr 7 2026 12:52 PM | Updated on Apr 7 2026 1:57 PM

Key Update About Lanka Cricketers Patirana-Hasaranga-To Join IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లోకి మ‌రో ఇద్ద‌రు విదేశీ స్టార్లు త్వ‌ర‌లోనే అడుగుపెట్టే అవకాశముంది. శ్రీలంక‌కు చెందిన వనిందు హ‌స‌రంగ, మ‌తీశా ప‌తీరానాలు త్వ‌ర‌లోనే ఫిట్‌నెస్ టెస్టులో పాస‌య్యి లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌వోసీ పొందేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఐపీఎల్‌లో హ‌స‌రంగ ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, ప‌తీరానా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌కు ఆడ‌నున్నాడు. 

హ‌స‌రంగ‌ను రూ. 2 కోట్ల క‌నీస ధ‌ర‌కు ల‌క్నో ద‌క్కించుకోగా, ప‌తీరానాను కేకేఆర్ రూ. 18 కోట్ల భారీ ధ‌ర చెల్లించి కొనుగోలు చేసింది. ప‌తీరానా రాక‌తో కేకేఆర్ బౌలింగ్ లైన‌ప్ ఫుంజుకునే అవ‌కాశముంది. నిఖార్సైన బౌల‌ర్ లేక కేకేఆర్ ఈ సీజ‌న్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనే ప‌రాజ‌యాల‌నే మూట‌గట్టుకుంది. 

కాగా టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు గాయాల‌తో హ‌స‌రంగ‌, ప‌తీరానాలు మేజ‌ర్ టోర్నీకి దూర‌మ‌య్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా తొడ వెనుక కండ‌రాల్లో చీలిక రావ‌డంతో హ‌స‌రంగ టోర్నీ నుంచి త‌ప్పుకోగా, ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు ప‌తీరానా కండ‌రాల గాయంతో జ‌ట్టు నుంచి త‌ప్పుకున్నాడు. అప్ప‌టినుంచి ఈ ఇద్ద‌రు కొలంబోలోని ఫిట్‌నెస్ అకాడ‌మీలో చికిత్స పొందుతున్నారు. 

లంక క్రికెట్‌లో సెంట్ర‌ల్ కాంట్రాక్టులో ఉన్న 15 మంది ఆట‌గాళ్ల జాబితాలో హ‌స‌రంగ‌, ప‌తీరానాలు చోటు ద‌క్క‌డంతో బ‌య‌టి లీగుల్లో ఆడాలంటే లంక క్రికెట్ బోర్డు నుంచి ఎన్‌వోసీ త‌ప్ప‌నిస‌రి. ప్ర‌స్తుతం గాయంతో కోలుకున్న ఈ ఇద్ద‌రు ఫిట్‌నెస్ టెస్టు పాస‌య్యేందుకు శ్ర‌మిస్తున్నారు. అయితే వీరిలో హ‌స‌రంగా ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్‌వోసీకి ద‌ర‌ఖాస్తు చేసుకోక‌పోవ‌డంతో అత‌డు ఐపీఎల్ ఆడతాడా లేదా అన్నది స్పష్టత రాలేదు.

ప‌తీరానా మాత్ర‌ం ఎన్‌వోసీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవడంతో మరో రెండు రోజుల్లో అతను ఫిట్‌నెస్‌ టెస్టుకు హాజరవనున్నాడు. ఫిట్‌నెస్‌ టెస్టులో  క్లియరన్స్‌ వచ్చిన మరుక్షణం లేదా ఏప్రిల్‌ మూడో వారంలో పతీరానా కేకేఆర్‌తో క‌లిసే అవ‌కాశ‌ముంది. ఇక పతీరానా ఐపీఎల్‌లో 32 మ్యాచ్‌లాడి 47 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 

ఇక హసరంగ ఐపీఎల్‌లో 37 మ్యాచ్‌లాడి 46 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 19వ సీజ‌న్‌లో కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓట‌ములు ఎదుర‌వ్వ‌గా.. పంజాబ్‌తో మ్యాచ్ వ‌ర్షార్ప‌ణమ‌యింది. ఇక ల‌క్నో సూప‌ర్‌జెయింట్స్ తొలి మ్యాచ్‌లో ఓట‌మి చెందిన‌ప్ప‌టికీ ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో గెలిచి సీజ‌న్‌లో బోణీ చేసింది.

చదవండి: అన్నింటా విఫ‌లం.. ‘త‌లా’ లేక సీఎస్‌కే ఆగమాగం!

Advertisement
 
Advertisement
Advertisement